పంజాబ్ ప్రభుత్వ నిర్ణయం విమర్శలకు తావిస్తుందా?

పంజాబ్ లో కొత్తగా కొలువుదీరిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 424మంది ప్రముఖులకు సెక్యూరిటీ ఉపసంహరించుకుంది. అయితే అందులో ఒకరు ఇప్పుడు హత్యకు గురయ్యారు. సెక్యూరిటీ ఉపసంహరించుకునే నిర్ణయం వెలువడిన గంటల వ్యవధిలో పంజాబ్ అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రముఖ గాయకుడు, సినీ నటుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. 28 ఏళ్ల వయసున్న సిద్ధూని కొంతమంది దుండగులు కిరాతకంగా కాల్చి చంపారు. వీఐపీ […]

Advertisement
Update:2022-05-29 16:15 IST

పంజాబ్ లో కొత్తగా కొలువుదీరిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 424మంది ప్రముఖులకు సెక్యూరిటీ ఉపసంహరించుకుంది. అయితే అందులో ఒకరు ఇప్పుడు హత్యకు గురయ్యారు. సెక్యూరిటీ ఉపసంహరించుకునే నిర్ణయం వెలువడిన గంటల వ్యవధిలో పంజాబ్ అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రముఖ గాయకుడు, సినీ నటుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. 28 ఏళ్ల వయసున్న సిద్ధూని కొంతమంది దుండగులు కిరాతకంగా కాల్చి చంపారు. వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పరోక్షంగా సిద్ధూ బలయ్యారు. సిద్ధూకి ఉన్న గన్ మెన్లను ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాతే పక్కా ప్లాన్ ప్రకారం ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది.

ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా.. దారికాచి గుర్తుతెలియని వ్యక్తులు సిద్ధూని తుపాకీతో కాల్చిచంపారు. ఈ ఘటనలో మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. మూసేవాలా వాహనంపై నిందితులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బుల్లెట్‌ గాయాలతో ఆయన కారులోనే కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

సిద్ధూ మూసేవాలా అసలు పేరు శుభ్‌ దీప్‌ సింగ్‌ సిద్ధూ. గతేడాది డిసెంబరులో కాంగ్రెస్‌ పార్టీలో చేరి మాన్సా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమ్ ఆద్మీ అభ్యర్థి విజయ్‌ సింగ్లా చేతిలో ఓడిపోయారు. సిద్ధూ మూసేవాలా రాక్ స్టార్ గా పంజాబ్ లో బాగా ఫేమస్. ప్రైవేట్ సాంగ్ లతో పాటు, ఆయన సినిమాల్లో కూడా తళుక్కున మెరిసేరు. ఆయన పాటల్లో ఎక్కువగా తుపాకీలను ఉపయోగించడం, గ్యాంగ్ స్టర్ల సంస్కృతి కనిపించేది. ఇప్పుడు అదే విష సంస్కృతికి ఆయన బలవడం యాదృచ్ఛికం. అయితే పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే మూసేవాలా దుర్మరణం పాలయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గన్ మెన్లు ఉండి ఉంటే.. ఆయనపై ఇంత ధైర్యంగా ఎవరూ అటాక్ చేసేవారు కాదని అంటున్నారు. మొత్తమ్మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ హత్యతో మరోసారి చర్చనీయాంశమవుతోంది. సెక్యూరిటీ లేకపోవడంతో వీఐపీలంతా బిక్కుబిక్కు మంటున్నారు.

Tags:    
Advertisement

Similar News