హిట్ కొట్టినా తప్పని వెయిటింగ్..!

సినీ ఇండస్ట్రీ ఎప్పుడైనా విజయం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హిట్ కొట్టిన హీరోలకు, నటులకు, దర్శకులకు వరుసగా ఆఫర్లు రావడం చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో విచిత్రంగా పలువురు దర్శకులకు విజయం లభించినప్పటికీ వారికి తర్వాత సినిమా చేసే అవకాశం రావడం లేదు. అలా అవకాశం రాని దర్శకుల్లో అగ్ర హీరోలతో సినిమాలు తీసి విజయం అందుకున్న దర్శకులు కూడా ఉన్నారు. మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా […]

Advertisement
Update:2022-05-24 07:48 IST

సినీ ఇండస్ట్రీ ఎప్పుడైనా విజయం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హిట్ కొట్టిన హీరోలకు, నటులకు, దర్శకులకు వరుసగా ఆఫర్లు రావడం చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో విచిత్రంగా పలువురు దర్శకులకు విజయం లభించినప్పటికీ వారికి తర్వాత సినిమా చేసే అవకాశం రావడం లేదు. అలా అవకాశం రాని దర్శకుల్లో అగ్ర హీరోలతో సినిమాలు తీసి విజయం అందుకున్న దర్శకులు కూడా ఉన్నారు.

మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ రెండేళ్ల కిందట నూతన దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ కు మరో సినిమా చేసే అవకాశం లభించలేదు. ఎన్టీఆర్ కు ఒక స్పోర్ట్స్ డ్రామా కథ వినిపించారని, అది నచ్చడంతో ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల ఎన్టీఆర్ తన జన్మదినం సందర్భంగా తాను కొత్తగా చేయబోయే సినిమాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తన తదుపరి సినిమాలను కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించారు.

బుచ్చిబాబుతో సినిమా గురించి కనీసం ప్రస్తావన కూడా రాలేదు. బుచ్చిబాబు ఉప్పెనతో విజయం అందుకున్నా రెండేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయకుండా ఖాళీగా ఉన్నాడు. ఎన్టీఆర్ తో సినిమా కూడా ఇప్పట్లో ఉండదని క్లారిటీ రావడంతో ఇప్పటికిప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా రావడం కష్టమే.

బొమ్మరిల్లు సినిమాతో భారీ హిట్ కొట్టి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ ఆ తర్వాత చరణ్ తో చేసిన ఆరెంజ్ పరాజయంతో గుర్తింపు కోల్పోయాడు. ఆ సినిమా తర్వాత భాస్కర్ చేసిన సినిమాలు ఏవీ విజయం సాధించలేదు. అయితే గత ఏడాది అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అటు అఖిల్ కు మొదటి విజయం అందించడమే కాకుండా తాను కూడా చాలా రోజుల తర్వాత హిట్టు కొట్టాడు.

అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విజయవంతమైనప్పటికీ బొమ్మరిల్లు భాస్కర్ కు మరో సినిమా చేసే అవకాశం ఇంతవరకు రాలేదు. రాజకీయాలకు చిన్న విరామం ఇచ్చి పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు వేణు శ్రీరామ్, సాగర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ రెండు సినిమాలు విజయం సాధించినప్పటికీ ఆ ఇద్దరు దర్శకులకు ఇప్పటివరకూ మరో హీరోతో పని చేసే అవకాశం రాలేదు. వేణు శ్రీరామ్ -అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఐకాన్ అనే సినిమా రావాల్సి ఉండగా ఇప్పుడు ఆ సినిమా తెరకెక్కే అవకాశం కనిపించడం లేదు.

ఇక అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన నందినిరెడ్డి తెలుగులో మంచి హిట్ సినిమాలు అందించినప్పటికీ, మూడేళ్ల కిందట సమంతతో చేసిన ఓ బేబీ మూవీ సక్సెస్ అయినప్పటికీ ఆమెకు ఆ తర్వాత ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. కొన్ని షార్ట్ ఫిల్మ్ లకు మాత్రం ఆమె పని చేశారు. అలాగే ఛలో, భీష్మ వంటి సినిమాలతో బ్యాక్ బ్యాక్ హిట్లు కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా రెండేళ్లుగా సినిమా లేకుండా ఖాళీగా ఉన్నాడు.

కొన్ని నెలల కిందట ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిసి కథ వినిపించగా.. అది ఆయనకు నచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాళ్తేరు వీరయ్య సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాలు పూర్తి అయితే గానీ వెంకీ కుడుముల- చిరంజీవి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. ఇలా హిట్ కొట్టిన పలువురు దర్శకులకు చేతిలో సినిమాలు లేకుండా పోయాయి.

Tags:    
Advertisement

Similar News