శ్రీలంకలో పొలిటికల్ హీట్.. అధ్యక్షుడికి షాకిచ్చిన కొత్త ప్రధాని..
శ్రీలంకలో అధికారం తమ కుటుంబాన్నుంచి వెళ్లిపోతుందేమోనని అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తీవ్ర ఆందోళన పడ్డారు. తమ్ముడు మహింద రాజపక్స రాజీనామా తర్వాత ప్రధాని పదవికి చాలామంది పేర్లు పరిశీలనకు వచ్చినా.. 73 ఏళ్ల రణిల్ విక్రమ సింఘేవైపు ఆయన మొగ్గు చూపారు. పార్లమెంట్ లో బలం లేదు కాబట్టి.. తాను చెప్పినట్టల్లా వింటారని అనుకున్నారు. కానీ ఏకై వచ్చిన విక్రమ సింఘే మేకుగా మారిపోయారు. ఏకంగా అధ్యక్షుడి సీటుకే ఎసరు పెడుతున్నారు. ‘గొట గో హోమ్’ అనే […]
శ్రీలంకలో అధికారం తమ కుటుంబాన్నుంచి వెళ్లిపోతుందేమోనని అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తీవ్ర ఆందోళన పడ్డారు. తమ్ముడు మహింద రాజపక్స రాజీనామా తర్వాత ప్రధాని పదవికి చాలామంది పేర్లు పరిశీలనకు వచ్చినా.. 73 ఏళ్ల రణిల్ విక్రమ సింఘేవైపు ఆయన మొగ్గు చూపారు. పార్లమెంట్ లో బలం లేదు కాబట్టి.. తాను చెప్పినట్టల్లా వింటారని అనుకున్నారు. కానీ ఏకై వచ్చిన విక్రమ సింఘే మేకుగా మారిపోయారు. ఏకంగా అధ్యక్షుడి సీటుకే ఎసరు పెడుతున్నారు. ‘గొట గో హోమ్’ అనే ఉద్యమానికి ఆయన మద్దతిస్తున్నారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అనంతరం అధ్యక్షుడు గొటబాయ రాజీనామా చేయాలనే డిమాండ్ వచ్చింది. అయితే ఆయన తెలివిగా.. ఆ ఆందోళన ప్రభావం తనపై పడకుండా చూసుకున్నారు. ప్రధాని పదవిలో ఉన్న తమ్ముడు మహింద రాజపక్సతో రాజీనామా చేయించారు. ఆందోళనలు తీవ్రతరమై అధికార పార్టీ ఎంపీ బలైపోయిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం అది. కానీ అధ్యక్షుడు టార్గెట్ గా జరుగుతున్న ఆందోళనలు ఇంకా తగ్గలేదు. ప్రధాని మారినా కూడా ‘గొట గో హోమ్’ అనే ఉద్యమం ఆగిపోలేదు. తాజాగా ఈ ఉద్యమానికి మద్దతు పలికారు ప్రధాని రణిల్ విక్రమ సింఘే. నిరసనకారుల డిమాండ్లను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
దేశంలోని రాజకీయ వ్యవస్థను మార్చేందుకు ‘గొట గో హోమ్’ నిరసనలు కొనసాగాలని అన్నారాయన. దేశంలోని యువత బాధ్యత తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో నిరసనలు చేస్తున్న యువతకు రక్షణ కల్పిస్తామని భరోసా కూడా ఇచ్చారు. భవిష్యత్తు విధాన రూపకల్పన కోసం వారి అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు రణిల్ విక్రమ సింఘే.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఏప్రిల్ 9 నుంచి ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళనల్లో ఇప్పటికే 9మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ గొడవలు ఆగిపోవాలంటే ఆర్థిక పరిస్థితి కుదుటపడాలి, లేదా కనీసం కుదుటపడుతుందన్న నమ్మకం అయినా ప్రజలకు కలగాలి. ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీంతో వారంతా అధ్యక్షుడు కూడా పదవీచ్యుతుడు కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితికి కారణం అయినవారెవరూ అధికారంలో ఉండటానికి వీల్లేదంటున్నారు. కొత్త ప్రధాని కూడా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసనకారులకు మద్దతు తెలపడం విశేషం.