'అసని' అటు కాదు ఇటు.. ఏపీకే తుపాను గండం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ఒడిశా వైపు వెళ్తుందని, అక్కడే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వేసిన అంచనాలు మారిపోయాయి. ఇప్పుడు అసని ప్రయాణం మచిలీపట్నం వైపుగా సాగుతోంది. ప్రస్తుతం కాకినాడకు 210 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 310 కిలోమీటర్లు, గోపాలపూర్ కు 530 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇది వాయువ్య దిశగా పయనించి రేపు ఉదయం కాకినాడ -విశాఖపట్నం తీరాలకు దగ్గరగా చేరుకునే అవకాశం […]

Advertisement
Update:2022-05-10 13:57 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ఒడిశా వైపు వెళ్తుందని, అక్కడే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వేసిన అంచనాలు మారిపోయాయి. ఇప్పుడు అసని ప్రయాణం మచిలీపట్నం వైపుగా సాగుతోంది. ప్రస్తుతం కాకినాడకు 210 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 310 కిలోమీటర్లు, గోపాలపూర్ కు 530 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇది వాయువ్య దిశగా పయనించి రేపు ఉదయం కాకినాడ -విశాఖపట్నం తీరాలకు దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత దిశ మార్చుకుని వాయువ్య బంగాళాఖాతంలోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 12గంటల్లో క్రమంగా తీవ్ర తుపాను కాస్త.. బలహీనపడుతుందని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్రకు గండం..
‘అసని’ తుపాను కారణంగా ఇప్పటికే విశాఖకు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో, ఎయిర్ ఏసియా, ఎయిరిండియా సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. తుపాను దృష్ట్యా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి తానేటి వనిత సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ తో ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తీర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సముద్రం అలజడిగా ఉండటంతో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ అంబేద్కర్ తెలిపారు.

తెలంగాణలోనూ వర్షాలు..
తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు కోస్తా, రాయలసీమలో కూడా ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఈదురు గాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక తెలంగాణలో కూడా మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags:    
Advertisement

Similar News