దారుణాలు.. పరామర్శలు.. రాజకీయాలు..
ఏపీలో ఇటీవల జరుగుతున్న వరుస దుర్ఘటనలు, వాటితోపాటు జరుగుతున్న పరామర్శ యాత్రలు, ఆ తర్వాత రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు.. ఇవన్నీ ఓ క్రమపద్ధతిలో జరుగుతున్నాయి. ఒంగోలులో సీఎం జగన్ కాన్వాయ్ కోసం ఆర్టీఏ అధికారులు ఓ ప్రైవేటు కారుని బలవంతంగా లాక్కోవడం విమర్శలకు దారితీయగా.. దానిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ప్రజలపై మరీ నిర్దయగా వ్యవహరిస్తున్నారంటూ ప్రభుత్వ అధికారుల్ని, అధికార పక్షాన్ని దుయ్యబట్టారు ప్రతిపక్ష నేతలు. ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో […]
ఏపీలో ఇటీవల జరుగుతున్న వరుస దుర్ఘటనలు, వాటితోపాటు జరుగుతున్న పరామర్శ యాత్రలు, ఆ తర్వాత రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు.. ఇవన్నీ ఓ క్రమపద్ధతిలో జరుగుతున్నాయి. ఒంగోలులో సీఎం జగన్ కాన్వాయ్ కోసం ఆర్టీఏ అధికారులు ఓ ప్రైవేటు కారుని బలవంతంగా లాక్కోవడం విమర్శలకు దారితీయగా.. దానిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ప్రజలపై మరీ నిర్దయగా వ్యవహరిస్తున్నారంటూ ప్రభుత్వ అధికారుల్ని, అధికార పక్షాన్ని దుయ్యబట్టారు ప్రతిపక్ష నేతలు. ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలు అత్యాచారానికి గురైన ఘటనలో కూడా రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరాయి. బాధితురాలి పరామర్శ వ్యవహారం బలప్రదర్శనలాగా జరిగింది. చంద్రబాబు, వాసిరెడ్డి పద్మ మధ్య జరిగిన మాటల యుద్ధం, ఆ తర్వాత మహిళా కమిషన్ నోటీసులు, కమిషన్ ముందు టీడీపీ తెలుగు మహిళల నిరసనలు.. ఇలా ఆ వ్యవహారం టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన కూడా అంతే సంచలనంగా మారింది. బాలుడి శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ ని ఆస్పత్రి లోపలికి రానివ్వకపోవడంతో కొడుకు శవాన్ని భుజానికెత్తుకుని బైక్ పై తీసుకెళ్లాడు తండ్రి. ఈ దారుణ ఘటన కూడా రాజకీయాలకు కేంద్ర బిందువైంది. అంబులెన్స్ నిర్వాహకుడు టీడీపీ నేత అని, అందుకే దీన్ని రాజకీయం చేశారని అంటున్నారు వైసీపీ నేతలు. అలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఏం చేస్తోందనేది ప్రతిపక్షం వాదన.
తాజాగా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో లక్ష్మీ తిరుపతమ్మ అనే మహిళ హత్యోదంతం.. చివరకు రాళ్లదాడికి దారితీసింది. ఆ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందనే కథనం ప్రచారంలో ఉంది. అయితే పోలీసులు అది కేవలం అక్రమ సంబంధం వల్ల జరిగిన హత్య అని తేల్చేశారు. సామూహిక అత్యాచారం జరగలేదన్నారు. టీడీపీ నేతలు మాత్రం పోలీసులు నిజాల్ని దాచిపెడుతున్నారని, నిందితుల్ని కాపాడుతున్నారంటూ లోకేష్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. లోకేష్ రావడంతో తుమ్మపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఘర్షణ జరిగింది. రాళ్లదాడిలో పోలీసులకు కూడా గాయాలు కావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఇక లోకేష్ కి మంత్రి రోజా చీరలు పంపిస్తాననడం, రోజాపై టీడీపీ నేతల ఘాటు వ్యాఖ్యలు కూడా రోజంతా హాట్ టాపిక్ గా మారాయి.
ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. వరుసగా జరుగుతున్న దుర్ఘటనలు వాటి వెనక రాజకీయ కోణాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, చివరకు ఇలా రాళ్ల దాడి వరకు చేరాయి. రెండేళ్ల ముందుగానే పరిస్థితి ఇలా ఉంటే.. ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.