తెలుగు రాష్ట్రాల్లో బడ్జెట్ కసరత్తులు.. సాంప్రదాయాన్ని పక్కనపెట్టిన తెలంగాణ..
ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బడ్జెట్ సమావేశాలకు కసరత్తులు చేస్తున్నాయి. ఏపీలో ఈనెల 7న బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. 8న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహా, మరికొందరు మాజీ శాసన సభ్యుల మృతిపై సభ సంతాపం తెలుపుతుంది. మార్చి 11న ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ ఖరారైంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ బిల్లుతోపాటు మరో 10కీలక బిల్లులు ఈ దఫా అసెంబ్లీ […]
ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బడ్జెట్ సమావేశాలకు కసరత్తులు చేస్తున్నాయి. ఏపీలో ఈనెల 7న బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. 8న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహా, మరికొందరు మాజీ శాసన సభ్యుల మృతిపై సభ సంతాపం తెలుపుతుంది. మార్చి 11న ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ ఖరారైంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ బిల్లుతోపాటు మరో 10కీలక బిల్లులు ఈ దఫా అసెంబ్లీ ముందుకు వస్తాయి. బడ్జెట్ ఆమోదం తర్వాత మరో వారం రోజులపాటు సమావేశాలు కొనసాగే అవకాశముంది. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎంగానే తిరిగి సభకు వస్తానంటూ ఛాలెంజ్ చేసి వాకవుట్ చేసిన ప్రతిపక్షనేత చంద్రబాబు ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది.
తెలంగాణ షెడ్యూల్ ఇదీ..
తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల 7న బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు తొలిరోజే సభలో బడ్జెట్ ప్రవేశపెడతారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 28లోపు సమావేశాలు ముగుస్తాయి.
గవర్నర్ తో కయ్యం..
తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై మధ్య ఇప్పటికే చాలా విషయాల్లో అభిప్రాయ భేదాలొచ్చాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ నియామకంపై తొలిసారిగా ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కనపెట్టి షాకిచ్చారు గవర్నర్. ఆ తర్వాత వరుసగా విభేదాలు బయటపడ్డాయి. గవర్నర్ ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం హాజరు కాకపోవడం, ఆ తర్వాత సమ్మక్క సారక్క జాతరలో గవర్నర్ కు ప్రొటోకాల్ మర్యాదలు జరక్కపోవడంతో గ్యాప్ మరింత పెరిగింది. తాజాగా బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించాలనే నిర్ణయం మరింత సంచలనంగా మారింది. గవర్నర్ మహిళ కావడంతోనే ఇలా అవమానిస్తున్నారంటూ.. తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.