కొత్త జిల్లాల విషయంలో పక్కా ప్రణాళిక.. ఏప్రిల్ 2నుంచి పాలన..
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉన్నట్టు తెలుస్తోంది. మార్చి 18నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని, ఏప్రిల్ 2నుంచి కొత్త జిల్లాల పేరుతో పాలన మొదలవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళిక అంతా సిద్ధమైంది. మార్చి 18న గెజిట్.. కొత్త జిల్లాల ఏర్పాటుకి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం అభ్యంతరాల స్వీకరణ మొదలు పెట్టింది. వీటిని ఈనెల 16నుంచి ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. […]
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉన్నట్టు తెలుస్తోంది. మార్చి 18నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని, ఏప్రిల్ 2నుంచి కొత్త జిల్లాల పేరుతో పాలన మొదలవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళిక అంతా సిద్ధమైంది.
మార్చి 18న గెజిట్..
కొత్త జిల్లాల ఏర్పాటుకి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం అభ్యంతరాల స్వీకరణ మొదలు పెట్టింది. వీటిని ఈనెల 16నుంచి ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. మార్చి 3వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జిల్లాల నుంచి వచ్చే నివేదికలను సీసీఎల్‌ఏ, ప్రణాళిక శాఖకు చెందిన అధికారులు మార్చి 10వ తేదీ వరకు పరిశీలిస్తారు. మార్చి 15 నుంచి 17వతేదీ మధ్య తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. చివరిగా మార్చి 18న గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. అక్కడితో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా పూర్తవుతుంది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో అధికారికంగా కార్యకలాపాలు మొదలవుతాయి.
ఇన్ చార్జి కలెక్టర్లతో పాలన..
ఏప్రిల్-2న కొత్త జిల్లాల్లో పాలన మొదలైనా.. తాత్కాలికంగా కలెక్టర్లు, ఎస్పీలు పాతవారే ఉంటారు. ఇప్పటి వరకు 13 జిల్లాలకు బాధ్యులుగా ఉన్న కలెక్టర్లు, ఎస్పీలను కొత్త జిల్లాలకు కేటాయిస్తారు. పాత జిల్లాలకు వారు ఇన్ చార్జిలుగా ఉంటారు. కొత్త జిల్లాలకు ఉద్యోగులు, అధికారులను కేటాయించడం, మౌలిక వసతుల కల్పన, కార్యాలయా ఏర్పాట్లు.. అన్నీ నెలరోజుల్లోగా పూర్తి కావాలని టార్గెట్ పెట్టుకున్నారు. పాత జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చినా విభజన, మౌలిక వసతుల కల్పన తదితర వ్యవహారాలను సీనియర్లే పర్యవేక్షిస్తారు.
కలెక్టరేట్ సిబ్బంది ఇలా..
ప్రస్తుతం ఏపీలో జిల్లా కలెక్టరేట్ లో వివిధ హోదాల్లో 165 మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి సంఖ్యను 158కి పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇకపై జిల్లాకు ఇద్దరే జాయింట్ కలెక్టర్లు ఉంటారు. 80శాఖలకు చెందిన ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్లో ఉంటారు. ఆరు సెక్షన్లు అలాగే ఉంటాయి. కేవలం ఏడుగురు సిబ్బందిని మాత్రమే తగ్గిస్తారు. మిగతావారంతా అలాగే ఉంటారు. ఎవరెవర్ని కలెక్టరేట్లకు పంపించాలి, ఏయే విభాగాల్లో ఉంచాలి అనే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. మొత్తమ్మీద ఏప్రిల్ 2నుంచి కొత్త జిల్లాల్లో పాలన మొదలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది.