సామాన్యుడు మూవీ రివ్యూ

నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, తులసి, రవీనా రవి సంగీతం : యువన్ శంకర్ రాజా కెమెరామెన్ : కెవిన్ రాజా ఎడిటర్: ఎన్ బి శ్రీకాంత్ ఆర్ట్ : ఎస్ఎస్ మూర్తి నిర్మాత : విశాల్ దర్శకత్వం : తు.పా. శరవణన్ నిడివి : 166 నిమిషాలు రేటింగ్ : 2/5 విశాల్ సినిమాల్లో యాక్షన్ గ్యారెంటీగా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లేని విశాల్ సినిమాల్ని ఊహించుకోలేం. అయితే అన్నీ గాలికొదిలేసి […]

Advertisement
Update:2022-02-04 11:35 IST

నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, తులసి, రవీనా రవి
సంగీతం : యువన్ శంకర్ రాజా
కెమెరామెన్ : కెవిన్ రాజా
ఎడిటర్: ఎన్ బి శ్రీకాంత్
ఆర్ట్ : ఎస్ఎస్ మూర్తి
నిర్మాత : విశాల్
దర్శకత్వం : తు.పా. శరవణన్
నిడివి : 166 నిమిషాలు
రేటింగ్ : 2/5

విశాల్ సినిమాల్లో యాక్షన్ గ్యారెంటీగా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లేని విశాల్ సినిమాల్ని ఊహించుకోలేం. అయితే అన్నీ గాలికొదిలేసి యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే చూపిస్తే సినిమా ఆడుతుందా? ఈరోజు రిలీజైన సామాన్యుడు సినిమా ఈ కోవలోకే వస్తుంది. తన సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉంటేచాలు, ఆడియన్స్ వచ్చేస్తారనే భ్రమలో విశాల్ ఈ సినిమా తీసినట్టు కనిపిస్తోంది తప్ప, అంతకుమించి ఇందులో కొత్తదనం లేదు.

కానిస్టేబుల్ కొడుకు పోరస్ (విశాల్) ఎప్పటికైనా ఎస్ఐ అవ్వాలనుకుంటాడు. దాని కోసం పరీక్షలు కూడా రాస్తాడు. మరోవైపు బ్యాంక్ లో జాబ్ చేసే మైథిలి (డింపుల్ హయతి) తో ప్రేమలో ఉంటాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న పోరస్ కుటుంబంలో ఊహించని ఓ ఘటన జరుగుతుంది. పోరస్ చెల్లెలు (రవీన) హత్యకు గురవుతుంది.

అప్పుడప్పుడు టీజింగ్ చేస్తుండే వీధి రౌడీ ఆమెను హత్య చేశాడని అందరూ భావిస్తారు. అతడు కూడా పోలీసులకి లొంగిపోతాడు. కానీ తన సిస్టర్ ను హత్య చేసింది అతడు కాదని గమనించి అసలు నేరస్థుడిని పసిగట్టే ప్రయత్నం చేస్తాడు పోరస్. ఈ క్రమంలో ఒక్కొక్కడిని పట్టుకుంటూ చివరికి వ్యాపారవేత్త నీలకంఠంని చేరుకుంటాడు. ఇంతకీ నీలకంఠం ఎవరు ? అతడికి పోరస్ చెల్లెలి హత్యకి సంబంధం ఏమిటి ? ఫైనల్ గా ఈ హత్య కేసుని పోరస్ ఎలా ఛేదించాడు అనేది స్టోరీ.

ఇలా కథగా చెప్పుకుంటే ఇదొక సింపుల్ రివెంజ్ డ్రామా. కానీ యాజ్ ఇటీజ్ గా ఇలా చెబితే రొటీన్ అయిపోతుందని దర్శకుడు శరవణన్ భావించినట్టున్నాడు. అందుకే దీనికి సిస్టర్ సెంటిమెంట్, కూసింత డ్రామా, ఒక ఫ్యాక్టరీ వల్ల నష్టపోయిన కుటుంబం తరుపున పోరాడే వ్యక్తి కథని కూడా జత చేశాడు దర్శకుడు. కానీ ఈ యాడ్ ఆన్స్ ఏవీ సామాన్యుడుకి పనిచేయలేదు. చుట్టూతిరిగి మళ్లీ ఆ 3 ఫైట్స్ తోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది.

ఇలాంటి రివెంజ్ డ్రామాలకు, యాక్షన్ కథలకు బేసిక్ రూల్ ఒకటుంది. అదేంటంటే.. స్క్రీన్ ప్లేను పరుగులు పెట్టించాలి. కథనంలో థ్రిల్ లేకపోయినా, సీన్లు చకచకా పడిపోవాలి. సామాన్యుడులో అది పూర్తిగా మిస్సయింది. సినిమా ఏదో నడుస్తుందంటే నడుస్తున్నట్టు ఉంటుంది. అన్నీ రొటీన్ సన్నివేశాలు, రొటీన్ స్క్రీన్ ప్లే. దర్శకుడు శరవణన్ పై ఏ నమ్మకంతో విశాల్, ఈ ప్రాజెక్టు అప్పగించాడో అస్సలు అర్థంకాదు.

ఇంటర్వెల్ కార్డు పడే వరకు ట్విస్ట్ ఏంటనేది అర్థం కాదు, పోనీ ఇంటర్వెల్ తర్వాత సినిమా ఏమైనా పరుగులు పెడుతుందనుకుంటే, మళ్లీ అదే కథ, వ్యథ. ఇంటర్వెల్ వరకూ హీరో క్యారెక్టరైజేషన్, లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఎపిసోడ్స్ తో నడిపించేసిన దర్శకుడు సెకండాఫ్ లో కథను గాడిలో పెట్టాడనిపిస్తుంది. ఇంటర్వెల్ నుండి రెండో భాగం కాస్త స్పీడ్ అందుకున్నట్టే అందుకొని మళ్లీ చతికిల పడుతుంది. హీరో విలన్ ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు మళ్ళీ రొటీన్ యాక్షన్ సినిమాలనే గుర్తుచేస్తాయి.

హీరో విశాల్ మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడు. ఒళ్లొంచి కష్టపడి ఫైట్స్ చేశాడు. ఎప్పట్లానే యాక్షన్ ఎపిసోడ్స్ లో తన మార్క్ చూపించాడు. హీరోయిన్ డింపుల్ హయతి ఈ సినిమాకు అక్కర్లేదు. అయినప్పటికీ గ్లామర్ కోసం ఆమెను పెట్టుకున్నారు. స్టయిలిష్ విలన్ గా జాకబ్ ఆకట్టుకున్నాడు. యోగిబాబు కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది. హీరో చెల్లెలిపాత్ర పోషించిన రవీనా రవి ఓకే అనిపించుకుంది.

టెక్నికల్ గా చూసుకుంటే, సినిమాలో ఫైట్స్ మాత్రమే బాగున్నాయి. యువన్ శంకర్ రాజా పాటలతో నిరాశపరిచాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ఓవరాల్ గా యాక్షన్ సీక్వెన్సుల కోసం సామాన్యుడు సినిమాను చూడొచ్చు. అంతకుమించి ఈ సినిమాలో, కథలో, విశాల్ లో ఎలాంటి కొత్తదనం లేదు. చివరికి విశాల్ వేసుకునే దుస్తుల్లో కూడా.

బాటమ్ లైన్ – సాదాసీదా సామాన్యుడు

Tags:    
Advertisement

Similar News