అంతరించిపోతున్న జంతుజాలం లిస్ట్ లో గాడిదలు..

గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరముపాలు.. వేమన శతకంలోని ఈ వాక్యాలు ఆధునిక కాలంలో పూర్తిగా తారుమారయ్యాయి. ఇటీవల కాలంలో ఆవుపాలకంటే గాడిదపాలకే ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. గాడిద పాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయనే ప్రచారంతో పట్టాణాల్లో సైతం గాడిద పాలను మిల్లీలీటర్ల లెక్కన అమ్మేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ గాడిద పాలకు కూడా కరువొచ్చింది. త్వరలో భారత్ లో గాడిదలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని తేలింది. గాడిదలను నేరుగా చూడటం రాబోయే రోజుల్లో […]

Advertisement
Update:2022-01-26 03:37 IST

గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరముపాలు.. వేమన శతకంలోని ఈ వాక్యాలు ఆధునిక కాలంలో పూర్తిగా తారుమారయ్యాయి. ఇటీవల కాలంలో ఆవుపాలకంటే గాడిదపాలకే ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. గాడిద పాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయనే ప్రచారంతో పట్టాణాల్లో సైతం గాడిద పాలను మిల్లీలీటర్ల లెక్కన అమ్మేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ గాడిద పాలకు కూడా కరువొచ్చింది. త్వరలో భారత్ లో గాడిదలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని తేలింది. గాడిదలను నేరుగా చూడటం రాబోయే రోజుల్లో అసాధ్యం అని, అవి అంతరించిపోతున్న జంతుజాలంగా మారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది బ్రూక్ ఇండియా అనే సంస్థ.

చైనాలో భలే డిమాండ్..
భారత్ లోని గాడిదల్లో ఎక్కువ శాతం చైనాకు తరలిపోతున్నాయి. సజీవంగా అయినా పర్వాలేదు, కేవలం చర్మాన్ని పంపించినా పర్లేదు అని బేరాలు కుదుర్చుకుంటున్నారు. గాడిద చర్మంతో చైనాలో ఎజియావో అనే ఔషధాన్ని తయారు చేస్తారట. దానికి సర్వరోగ నివారణిగా అక్కడ పేరుంది. అందుకే ఇక్కడి గాడిదల్ని అక్రమ మార్గాల్లో అక్కడికి తరలించేస్తున్నారు. కరోనాకంటే ముందే ఈ వ్యాపారం జోరుగా సాగింది. ఇప్పుడు మరింత ముదిరిపోయింది. 2012 నుంచి 2019 వరకు భారత్ లో గాడిదల సంఖ్య 61శాతం తగ్గిపోయిందని సర్వేలో తేలింది.

రాజస్థాన్ లో అత్యథికంగా గాడిదల సంఖ్య తగ్గిపోయింది. 8 ఏళ్ల కాలంలో అక్కడ ఏకంగా 71.31 శాతం గాడిదలు మాయమయ్యాయి. ఆస్థాయిలో కొత్త సంతతి లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో అవి పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇక ఏపీలో కూడా గాడిదల సంతతి బాగా తగ్గిపోయింది. ఎనిమిదేళ్ల కాలంలో ఏపీలో 53.22 శాతం మేర గాడిదలు తగ్గిపోయాయని తేలింది.

అవసరం లేక..
గాడిదలను గతంలో బరువులు మోసేందుకు ఉపయోగించేవారు. ఇప్పుడు బరువులు మోసేందుకు, ఇతర రవాణా పనులకు అన్నిచోట్లా యంత్రాలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో గాడిదలను పెంచేవారు, వాటిని ఉపయోగించేవారు తక్కువయ్యారు. వీలైనంత మేర వదిలించుకోడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. అందులోనూ చైనాలో గాడిద చర్మానికి ఎక్కువ డిమాండ్ ఉండటంతో.. భారత్ లో వాటి సంఖ్య బాగా తగ్గిపోతోంది.

Advertisement

Similar News