థర్డ్ వేవ్ లో మరో ట్విస్ట్.. డెల్టాను మించిపోతున్న ఒమిక్రాన్..

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. బ్రిటన్, దక్షిణాఫ్రికా ఒమిక్రాన్ భయంతో వణికిపోయిన తర్వాత అది మెల్లగా భారత్ లో ప్రవేశించింది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో భారత్ లో కూడా విస్తృతంగా పరీక్షలు నిర్వహించారు, కేసులు పెరిగాయి, అదే థర్డ్ వేవ్ అన్నారు. అయితే థర్డ్ వేవ్ లో కూడా డెల్టా వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా.. డెల్టా ముందు వాటి సంఖ్య నామమాత్రమే. అయితే ఇప్పుడు భారత్ లో కూడా […]

Advertisement
Update:2022-01-25 05:41 IST

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. బ్రిటన్, దక్షిణాఫ్రికా ఒమిక్రాన్ భయంతో వణికిపోయిన తర్వాత అది మెల్లగా భారత్ లో ప్రవేశించింది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో భారత్ లో కూడా విస్తృతంగా పరీక్షలు నిర్వహించారు, కేసులు పెరిగాయి, అదే థర్డ్ వేవ్ అన్నారు. అయితే థర్డ్ వేవ్ లో కూడా డెల్టా వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా.. డెల్టా ముందు వాటి సంఖ్య నామమాత్రమే. అయితే ఇప్పుడు భారత్ లో కూడా ఒమిక్రాన్ విజృంభణ పెరిగిపోతోంది. డెల్టాని మించిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు.

ముఖ్యంగా ముంబైలో ఒమిక్రాన్‌ వేరియంట్ కేసుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. ముంబైలో నమోదవుతున్న కొత్త కేసుల్లో అత్యధికం కరోనా కొత్త వేరియంట్ కి సంబంధించినవేనని ఓ నివేదిక బయటకొచ్చింది. బృహన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) పరిధిలో 280 నమూనాలను పరిశీలించగా అందులో 89 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులే బయటపడ్డాయి. 8 శాతం కేసులు డెల్టా వేరియంట్ కి చెందినవని, మిగతా మూడు శాతం కేసుల్లో డెల్టా, ఇతర లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు అధికారులు. ఈ 280 మంది రోగుల్లో 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్కులు 96 మంది (34 శాతం) ఉన్నారని అధికారులు తెలిపారు. 41-60 సంవత్సరాల మధ్యవారు 79 మంది (28 శాతం), 20 ఏళ్ల లోపువారు 22 మంది మాత్రమే ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతానికి ముంబైలో కొనసాగుతున్న ఒమిక్రాన్ విజృంభణ, ఇతర రాష్ట్రాలకు పాకే ప్రమాదం ఉందనే అనుమానాలున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో కొవిడ్ టెస్టులన్నిటినీ ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ కోసం పంపించడంలేదు. దీంతో మొత్తం కేసుల్లో ఏ వేరియంట్ శాతం ఎంత అనేది పూర్తి స్థాయిలో నిర్థారణ కావడంలేదు.

చిన్నారులపై ప్రభావం తక్కువే..
ఫస్ట్ వేవ్ వృద్ధులపై ప్రతాపం చూపించిందని, సెకండ్ వేవ్ మధ్యవయసు వారిని టార్గెట్ చేసిందని, థర్డ్ వేవ్ కచ్చితంగా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందనే పుకార్లు కూడా ఆమధ్య బాగా వినిపించాయి. అయితే థర్డ్ వేవ్ లో దాదాపుగా ఎవరూ ఆస్పత్రికి వెళ్లే అవసరం రావడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఏర్పాట్లు చేసినా ఏపీలో ఇన్ పేషెంట్ల సంఖ్య చాలా తక్కువ. రోజువారీ వెయ్యి కొత్త కేసులు నమోదవుతున్న జిల్లాల్లో కూడా 100మంది కూడా ఇన్ పేషెంట్లుగా చేరడంలేదు. అందరూ హోమ్ ఐసోలేషన్లోనే ఉంటున్నారు. స్వల్ప లక్షణాలున్నవారు ఇంట్లో కూడా ఉండటంలేదని, బహిరంగ సమూహాల్లోకి వచ్చేస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక థర్డ్ వేవ్ ప్రభావం చిన్నారులపై కూడా పెద్దగా లేదని తేలిపోయింది. సాధారణ డెంగీ, ఇతర సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులకు వస్తున్నారే కానీ, ప్రత్యేకంగా చిన్నారుల్లో కరోనా లక్షణాలు కనపడ్డం లేదు. అందుకే ఏపీలాంటి రాష్ట్రాలు స్కూళ్లను యథావిధిగా కొనసాగిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News