పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. ఫిబ్రవరి నాటికి థర్డ్ వేవ్ తీవ్రం..!

దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించామని చెప్పుకుంటున్నా.. ఎక్కడికక్కడ విదేశీ ప్రయాణికుల్ని క్వారంటైన్ కి పరిమితం చేస్తున్నామని అధికారులు అంటున్నా.. కేసుల వ్యాప్తి మాత్రం ఆగలేదు. ఆదివారం ఒక్కరోజే 17 కొత్త కేసులు నమోదు కాగా.. దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 21కి చేరుకుంది. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని అంచనా. కర్నాటకతోపాటు ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో కూడా ఒమిక్రాన్ ప్రవేశించింది. దక్షిణాఫ్రికా […]

Advertisement
Update:2021-12-06 03:01 IST

దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించామని చెప్పుకుంటున్నా.. ఎక్కడికక్కడ విదేశీ ప్రయాణికుల్ని క్వారంటైన్ కి పరిమితం చేస్తున్నామని అధికారులు అంటున్నా.. కేసుల వ్యాప్తి మాత్రం ఆగలేదు. ఆదివారం ఒక్కరోజే 17 కొత్త కేసులు నమోదు కాగా.. దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 21కి చేరుకుంది. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని అంచనా. కర్నాటకతోపాటు ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో కూడా ఒమిక్రాన్ ప్రవేశించింది. దక్షిణాఫ్రికా నుంచి రాజస్థాన్‌ కు వచ్చిన ఓ కుటుంబంలోని మొత్తం 9మంది సభ్యులు ఒమిక్రాన్ బారినపడ్డారు. వెంటనే అప్రమత్తమైన రాజస్థాన్‌ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. ఇటు మహారాష్ట్ర కూడా ఆంక్షలు కఠినతరం చేసింది.

ఫిబ్రవరినాటికి థర్డ్ వేవ్ కేసులు గరిష్టం..
ఒమిక్రాన్ తోనే థర్డ్ వేవ్ మొదలైందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో మన దేశంలో స్వల్ప స్థాయిలో థర్డ్‌వేవ్‌ కనిపిస్తుందని.. ఫిబ్రవరిలో గరిష్ట స్థాయిని చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ అంచనా వేశారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందినా.. దానివల్ల తీవ్ర నష్టాలేవీ జరగబోవని ఆయన చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడే దీనిపై ఓ అంచనాకి రాలేమని, కేసుల సంఖ్య భారీగా పెరిగినా, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య స్వల్పంగా ఉండొచ్చని చెబుతున్నారాయన.

వివిధ రాష్ట్రాల ఎన్నికలకు గండం..?
వచ్చే ఏడాది పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరి నాటికి కేసుల సంఖ్య పెరిగితే.. అసెంబ్లీ సమరంపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కేంద్రం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు పెంచుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేస్తున్నారు, వ్యాక్సిన్ వేసుకున్నవారికే అన్ని ప్రాంతాల్లోకి అనుమతి అంటున్నారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగితే.. ముందుగా నైట్ కర్ఫ్యూని అమలు చేయాలని భావిస్తోంది కేంద్రం. ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం ఒమిక్రాన్ భయంతో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలులోకి తెచ్చింది. మిగతా రాష్ట్రాలు కూడా కేసులు బయటపడితే నిబంధనలు తెరపైకి తేవాలని చూస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News