రామాయణ్ ఎక్స్ ప్రెస్.. ఆదినుంచీ వివాదాలే..

‘దేఖో అప్నా దేశ్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకంలో భాగంగా భారత రైల్వే శాఖ రామాయ‌ణ్ యాత్ర ను మొదలు పెట్టింది. డీల‌క్స్ ఏసీ టూరిస్ట్ రైళ్లు ప్రారంభించింది. ఈనెల 7న మొదలైన తొలి రైలు మరో రెండు రోజుల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ రైలు ప్రయాణంలో భాగంగా శ్రీరాముడి ప్రముఖ ఆలయాల వద్దకు భక్తులను తీసుకెళ్తుంది రైల్వే శాఖ. ఆయా ప్రాంతాల్లో రైళ్లను ఆపి అక్కడినుంచి బస్సులు, ఇతర వాహనాల […]

Advertisement
Update:2021-11-23 02:42 IST

‘దేఖో అప్నా దేశ్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకంలో భాగంగా భారత రైల్వే శాఖ రామాయ‌ణ్ యాత్ర ను మొదలు పెట్టింది. డీల‌క్స్ ఏసీ టూరిస్ట్ రైళ్లు ప్రారంభించింది. ఈనెల 7న మొదలైన తొలి రైలు మరో రెండు రోజుల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ రైలు ప్రయాణంలో భాగంగా శ్రీరాముడి ప్రముఖ ఆలయాల వద్దకు భక్తులను తీసుకెళ్తుంది రైల్వే శాఖ. ఆయా ప్రాంతాల్లో రైళ్లను ఆపి అక్కడినుంచి బస్సులు, ఇతర వాహనాల ద్వారా ఆలయాల సందర్శన, బస ఏర్పాటు చేస్తారు. మొత్తం 17రోజులపాటు యాత్ర ఉంటుంది.

భద్రాచలం ఊసేది..?
అయోధ్య, ప్రయాగ్, నందిగ్రామ్, జానక్‌ పూర్, చిత్రకూట్, సీమర్హి, నాసిక్, హంపి, రామేశ్వరం ప్రాంతాల్లో మొత్తం 7,500 కిలోమీటర్ల ఈ యాత్ర సాగుతుంది. అయితే దక్షిణాదికి ఇందులో సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, ముఖ్యంగా తెలంగాణలోని భద్రాచలంను ఎందుకు ఈ యాత్రలో భాగం చేయలేదని టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై విమర్శలు ఎక్కు పెట్టారు. ప‌ర్యాట‌క‌ శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్వయానా తెలంగాణకు చెందిన వ్యక్తి అయిఉండి కూడా భద్రాచలంను మరచిపోవడం సరికాదన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర రైల్వే శాఖ.. దక్షిణాది యాత్రల లిస్ట్ లో భద్రాచలం పేరు ఉండేలా చర్యలు తీసుకుంటామంది.

డ్రెస్ కోడ్ వివాదం..
తాజాగా రామాయణ్ ఎక్స్ ప్రెస్ లో ఐఆర్సీటీసీ సిబ్బంది, వెయిటర్స్ డ్రెస్ కోడ్ పై వివాదం చెలరేగింది. టీలు, కాఫీలు, భోజనం సప్లై చేసే సిబ్బంది, బాత్రూమ్ లు శుభ్రం చేసే సిబ్బందితో సహా ఆ ఎక్స్ ప్రెస్ లో ఉండే స్టాఫ్ అంతా కాషాయ వస్త్రాన్ని తలపాగాగా చుట్టుకుంటున్నారు. మెడలో రుద్రాక్ష మాల ధరిస్తున్నారు. పూర్తిగా సాధువుల్లా తయారై రైలులో విధులు నిర్వహిస్తున్నారు. రామాయణ్ ఎక్స్ ప్రెస్ స్టాఫ్ కోసం ఐఆర్సీటీసీ ఈ డ్రెస్ కోడ్ తీసుకొచ్చింది. దీనిపై ఉజ్జయినికి చెందిన అఖాడా పరిషత్ స్వాములు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. డ్రెస్ కోడ్ మార్చకపోతే, ఢిల్లీలో రైలుని ఆపేస్తామని, రైలు పట్టాలపై నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. దీంతో రైల్వే శాఖ వెనక్కి తగ్గింది.

డ్రెస్ కోడ్ మార్చేస్తాం..
ఉజ్జయిని స్వాముల హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ డ్రెస్ కోడ్ పై వెనక్కి తగ్గింది. రామాయణ్ ఎక్స్ ప్రెస్ లో సిబ్బంది ఇకపై వారి యూనిఫామ్ కి సంబంధించిన దుస్తులే ధరిస్తారని, కాషాయ దుస్తులు ధరించరని స్పష్టం చేసింది. రామాయణ్ ఎక్స్ ప్రెస్ విషయంలో కేవలం ఓ మతానికి ప్రాధాన్య మిస్తున్నారంటూ గతంలో విపక్షాలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టి ఈ యాత్రను అధికారికంగా మొదలు పెట్టింది. చివరికి ఇలా ప్రతి చోటా విమర్శలు, వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Tags:    
Advertisement

Similar News