మాల్దీవుల్ని కాపాడిన భారత పర్యాటకులు..

కరోనా ఉపద్రవంతో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. ముఖ్యంగా పర్యాటక రంగంతో ముడిపడి ఉన్న దేశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడటంతో ఆయా దేశాలు పర్యాటకుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. టూరిజంపైనే ఆధారపడి, కరోనా విలయం తర్వాత ఇబ్బందుల్లోకి వెళ్లిన మాల్దీవుల్ని భారత పర్యాటకులు ఇప్పుడు ఒడ్డునపడేస్తున్నారు. కరోనాకి ముందు మాల్దీవ్స్ పర్యాటకరంగం ఎక్కువగా చైనాపై ఆధారపడి ఉండేది. ప్రతి ఏటా ఒక్క చైనా నుంచే 20శాతానికి పైగా పర్యాటకులు మాల్దీవ్స్ […]

Advertisement
Update:2021-10-18 05:33 IST

కరోనా ఉపద్రవంతో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. ముఖ్యంగా పర్యాటక రంగంతో ముడిపడి ఉన్న దేశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడటంతో ఆయా దేశాలు పర్యాటకుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. టూరిజంపైనే ఆధారపడి, కరోనా విలయం తర్వాత ఇబ్బందుల్లోకి వెళ్లిన మాల్దీవుల్ని భారత పర్యాటకులు ఇప్పుడు ఒడ్డునపడేస్తున్నారు.

కరోనాకి ముందు మాల్దీవ్స్ పర్యాటకరంగం ఎక్కువగా చైనాపై ఆధారపడి ఉండేది. ప్రతి ఏటా ఒక్క చైనా నుంచే 20శాతానికి పైగా పర్యాటకులు మాల్దీవ్స్ కి వస్తుండేవారు. కరోనానుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మాల్దీవులు.. నిబంధనలను అనుసరించి పర్యాటకుల్ని స్వాగతిస్తున్నాయి. అయితే చైనా ఇప్పుడు మాల్దీవ్స్ వైపు చూడటంలేదు. పరిస్థితులు చక్కబడిన తర్వాత మాల్దీవ్స్ ని సందర్శించిన చైనా పర్యాటకులు కేవలం 0.1 శాతం మంది అంటే ఆశ్చర్యం కలగకమానదు. అదే సమయంలో భారత పర్యాటకులు మాత్రం ఆ దేశాన్ని ఆదుకున్నారు. ప్రస్తుతం భారత్, రష్యానుంచి వచ్చే పర్యాటకులతో మాల్దీవ్స్ కి ఆర్థిక భరోసా లభిస్తోంది. ఈమేరకు ప్రపంచ ఆర్థిక సంస్థలు ఆశించినదానికంటే ఎక్కువ రేటింగ్స్ ఇస్తూ మాల్దీవుల్లో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

కొవిడ్ ప్రభావం నుంచి బయటపడేందుకు గతంలో 250మిలియన్ డాలర్ల ఆర్థిక సాయన్ని మాల్దీవ్స్ కి అందించింది భారత ప్రభుత్వం. ఇప్పుడు పరోక్షంగా పర్యాటకులతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్దికి దోహదపడుతోంది. 2021 మాల్దీవుల వృద్ధి అంచనాను వరల్డ్ బ్యాంక్ 17.1 శాతంగా పేర్కొంది. ఇప్పుడు దాన్ని 22.3 శాతానికి పెంచడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ కూడా మాల్దీవుల వృద్ధి అంచనాను 13శాతం నుంచి 18శాతానికి పెంచింది.

చైనా, యూరప్ దేశాలనుంచి వచ్చే పర్యాటకులు పెద్దగా ఆసక్తి చూపించకపోయినా.. భారత్, రష్యా వల్ల మాల్దీవుల్లో మళ్లీ సందడి మొదలైంది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత మాల్దీవ్స్ కి వచ్చే పర్యాటకుల సంఖ్య తాజాగా 5లక్షలు దాటింది. నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి దేశాల్లో వ్యాక్సినేషన్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పర్యాటకుల తాకిడి పెరగలేదు. మాల్దీవ్స్ లో మాత్రం వ్యాక్సినేషన్ జోరందుకోవడంతోపాటు, పర్యాటకులపై విధించే ఆంక్షలను తగ్గించడంతో అక్కడ టూరిజం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఇందులో భారత్ పాత్ర మాత్రం ఎన్నదగినది.

Tags:    
Advertisement

Similar News