లాలూ కొడుకుల వేరుబాటలు..
సమోసాలో ఆలూ ఉన్నంతకాలం బీహార్ లో లాలూ ఉంటారని చెప్పుకునేవారు. కానీ లాలూ ఉండగానే ఆయన కొడుకులు వేరుబాటలు పడేట్టు ఉన్నారు. లాలూ తనయుల్లో తేజశ్వీ యాదవ్ ఇప్పటికే తనని తాను నిరూపించుకున్నారు. ఆయన బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అదే సమయంలో తేజ్ ప్రతాప్ యాదవ్, విడాకుల వ్యవహారంతో వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డారు. రాజకీయాల్లో కూడా పార్టీపై ఆయనకు పెద్దగా పట్టులేదు. ఆయన్ను తమ నాయకుడిగా కూడా ఆర్జేడీ నేతల్లో చాలామంది గుర్తించరు. తేజశ్వీ […]
సమోసాలో ఆలూ ఉన్నంతకాలం బీహార్ లో లాలూ ఉంటారని చెప్పుకునేవారు. కానీ లాలూ ఉండగానే ఆయన కొడుకులు వేరుబాటలు పడేట్టు ఉన్నారు. లాలూ తనయుల్లో తేజశ్వీ యాదవ్ ఇప్పటికే తనని తాను నిరూపించుకున్నారు. ఆయన బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అదే సమయంలో తేజ్ ప్రతాప్ యాదవ్, విడాకుల వ్యవహారంతో వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డారు. రాజకీయాల్లో కూడా పార్టీపై ఆయనకు పెద్దగా పట్టులేదు. ఆయన్ను తమ నాయకుడిగా కూడా ఆర్జేడీ నేతల్లో చాలామంది గుర్తించరు. తేజశ్వీ యాదవ్ నే భావి నాయకుడిగా ఆదరిస్తారు. ఈ క్రమంలో తేజ్ ప్రతాప్ కూడా పార్టీపై పట్టు పెంచుకునేందుకు కృషి చేస్తున్నారు.
పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రారంభించిన పాదయాత్ర ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. తాను కొత్తగా ఏర్పాటు చేసిన విద్యార్థి సంఘం పేరుతో ఈ యాత్ర చేపట్టారు తేజ్ ప్రతాప్ యాదవ్. జయప్రకాష్ నారాయణ్ (జేపీ) ఉద్యమం లాగా బీహార్ లో ఎల్పీ ఉద్యమం మొదలు పెట్టామని, అందులో భాగంగానే పాదయాత్ర మొదలు పెట్టామని చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నా కూడా తేజశ్వి వెళ్లలేదు. దీంతో అన్నదమ్ముల మధ్య సయోధ్యకోసం తల్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఆమె ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. తనతో మాట్లాడేందుకే తల్లి వస్తుందని తెలిసి కూడా తేజ్ ప్రతాప్ ఇంటినుంచి చెప్పకుండా వెళ్లిపోయారు.
తండ్రి ఆశీర్వాదం ఎవరికి..?
పార్టీపై తమ్ముడి పెత్తనం పెరిగిపోతోందని, అతడినే ప్రతిపక్ష నేతగా ఎన్నికున్నారని చాన్నాళ్లనుంచి రగిలిపోతున్నారు తేజ్ ప్రతాప్ యాదవ్. ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లి తండ్రి లాలూ ప్రసాద్ ని కలసి వచ్చారు. ఆయన అక్కడ బందీ అయిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే లాలూ లాంటి వ్యక్తిని బందీగా ఎవరైనా మార్చగలరా.. త్వరలోనే తన తండ్రి పాట్నా వస్తారంటూ తేజశ్వీ యాదవ్ బదులిచ్చారు. దీంతో అన్నదమ్ములిద్దరి మధ్య ఉన్నవైరం మరోసారి రచ్చకెక్కింది. ప్రస్తుతం బెయిల్ పై జైలునుంచి బయటకొచ్చి ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న లాలూ ప్రసాద్, త్వరలోనే బీహాల్ లో అడుగు పెడతారని అంటున్నారు.
పార్టీపై పెత్తనంకోసం వేరుబాటలు..
ప్రస్తుతానికి పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ తేజశ్వీ యాదవ్ వైపే మొగ్గు చూపుతున్నారు. తనని తాను శ్రీకృష్ణుడిగా, రాధగా అభివర్ణించుకునే.. తేజ్ ప్రతాప్ ని కమెడియన్ గానే వారు చూస్తుంటారు. కానీ తేజ్ ప్రతాప్ లో రెండో మనిషి ఉన్నాడనే విషయం చాలా కొద్దిమందికే తెలుసు. పైకి కమెడియన్ గా కనిపిస్తున్నా.. అధికారం కోసం తమ్ముడిపై ఆయన రగిలిపోతున్నారు. చివరకు పార్టీని చీల్చడానికైనా వెనకాడడని అంటున్నారు. అయితే అలా వేరు కుంపటి పెడితే.. ఆయన వెంట ఎవరు వెళ్తారనేదే అసలు ప్రశ్న.