తెలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో రెండు సంచలనాలు..
ఏపీలో బద్వేల్, తెలంగాణలో హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందన అంచనాలున్నాయి. అయితే అనూహ్యంగా హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చింది. సీనియర్లందర్నీ కాదని NSUI నేత బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు కి కాంగ్రెస్ అవకాశమిచ్చింది. ఇటు ఏపీలో బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయట్లేదంటూ వెనకడుగేసింది. ఈ రెండు కీలక పరిణామాలు ఉప ఎన్నికలపై […]
ఏపీలో బద్వేల్, తెలంగాణలో హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందన అంచనాలున్నాయి. అయితే అనూహ్యంగా హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చింది. సీనియర్లందర్నీ కాదని NSUI నేత బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు కి కాంగ్రెస్ అవకాశమిచ్చింది. ఇటు ఏపీలో బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయట్లేదంటూ వెనకడుగేసింది. ఈ రెండు కీలక పరిణామాలు ఉప ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ మొదలైంది.
హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రభావం ఎంత..?
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత, కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు ప్రచారంలోకి వచ్చాక పరిస్థితిలో మార్పు రావొచ్చని అనుకున్నారంతా. గతంలో కాంగ్రెస్ అక్కడ రెండో స్థానంలో ఉంది. సురేఖ అభ్యర్థి అయితే కనీసం రెండో స్థానం నిలుపుకోవచ్చని, అన్నీ కలిసొస్తే విజయం వరించొచ్చని కార్యకర్తలు అనుకున్నారు. కానీ సీనియర్లలో వచ్చిన లుకలుకలు, సురేఖ స్థానికత ఆమె అభ్యర్థిత్వంపై ప్రభావం చూపాయి. చివరకు NSUI నేత బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. అయితే ఈ కొత్త అభ్యర్థి అధికార టీఆర్ఎస్ ని, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఎంతవరకు నిలువరించగలరనేదే ఇప్పుడు ప్రశ్న. కొత్త అభ్యర్థితో కాంగ్రెస్ చేసిన ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
బద్వేల్ లో జనసేన పోటీకి దూరం..
ఇటు బద్వేల్ ఉప ఎన్నికలపై జనసేన సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్నటి వరకు బద్వేల్ సీటుపై జనసేన-బీజేపీ మధ్య చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం జరిగింది. తిరుపతి సీటు బీజేపీకి త్యాగం చేశారు కాబట్టి, బద్వేల్ సీటుని జనసేన డిమాండ్ చేసి తీసుకుంటుందని, అందుకే పవన్ ఈమధ్య స్పీడ్ పెంచారని అనుకున్నారు. కానీ చివరకు పవన్ కల్యాణ్ బద్వేల్ లో జనసేనపోటీ చేయట్లేదని తేల్చి చెప్పారు. కేవలం జనసేన గురించే ఆయన చెప్పారు కానీ, బీజేపీ విషయం ఏంటనేది తేలలేదు. ఒకవేళ బీజేపీ అక్కడ పోటీ చేస్తే పవన్ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారా అనేది అనుమానం. బద్వేల్ లో దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే వైసీపీ సీటు ఇచ్చింది కాబట్టి, అక్కడ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయితే బాగుంటుందని అన్నారు పవన్. తనవంతుగా జనసేనను పోటీలో నిలపడం లేదని ప్రకటించారు.
కాంగ్రెస్ నిర్ణయంతో హుజూరాబాద్ లో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉండే అవకాశం ఉంది. ఇటు బద్వేల్ లో జనసేన నిర్ణయంతో మిగతా పార్టీలు ఎలాంటి వ్యూహాలు రచిస్తాయో వేచి చూడాలి.