కరోనా తర్వాత ఐటీకీ మరింత ఆదరణ..

ఐటీ ఉద్యోగాలపై ఉన్న మోజు.. రాను రాను తగ్గుతుందనుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా కరోనా, ఆ పరిస్థితుల్ని మార్చేసింది. కరోనా టైమ్ లో మిగతా ఉద్యోగాల్లో చిన్న చిన్న ఒడుదొడుకులు ఎదురైనా.. ఐటీ కొలువులకు ఏమాత్రం ఇబ్బంది కలగకపోవడం విశేషం. వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఐటీ సెక్టార్ అంతా ఇంటి వద్దనుంచే పనిచేసింది. విపత్తు వేళలో కూడా ఉపాధి నిలుపుకుంది. దీంతో ఇప్పుడు మళ్లీ యువత అంతా ఐటీవైపు చూస్తోంది. తెలంగాణ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి జరిగిన […]

Advertisement
Update:2021-09-19 04:06 IST

ఐటీ ఉద్యోగాలపై ఉన్న మోజు.. రాను రాను తగ్గుతుందనుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా కరోనా, ఆ పరిస్థితుల్ని మార్చేసింది. కరోనా టైమ్ లో మిగతా ఉద్యోగాల్లో చిన్న చిన్న ఒడుదొడుకులు ఎదురైనా.. ఐటీ కొలువులకు ఏమాత్రం ఇబ్బంది కలగకపోవడం విశేషం. వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఐటీ సెక్టార్ అంతా ఇంటి వద్దనుంచే పనిచేసింది. విపత్తు వేళలో కూడా ఉపాధి నిలుపుకుంది. దీంతో ఇప్పుడు మళ్లీ యువత అంతా ఐటీవైపు చూస్తోంది. తెలంగాణ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి జరిగిన ఎంసెట్ కౌన్సిలింగే దీనికి పెద్ద ఉదాహరణ. ఇప్పటి వరకూ ఇంజినీరింగ్ లో ఈసీఈ గ్రూప్ చదివేందుకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. ఆ తర్వాత ఈఈఈ, సీఎస్ఈ కి డిమాండ్ ఉండేది. ఈ ఏడాది తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ లో మాత్రం ఈ గణాంకాలన్నీ తారుమారయ్యాయి. కంప్యూటర్ సైన్స్(సీఎస్ఈ), ఐటీ గ్రూప్ లు హాట్ కేకుల్లాగా మారిపోయాయి. సీఎస్ఈ, ఐటీ విభాగాల్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లోనే 95.56శాతం సీట్లు భర్తీ కావడం విశేషం. కాలేజీ ఏదయినా పర్లేదు కంప్యూటర్ సీటు వస్తే చాలు అనుకుంటున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు.

తెలంగాణలో కన్వీనర్‌ కోటా కింద కంప్యూటర్‌, ఐటీ బ్రాంచిల్లో మొత్తం 38,796 సీట్లుండగా, వాటిలో 37,073 తొలి విడతలోనే భర్తీ అయ్యాయి. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతోపాటు, మిగిలిన ఏ బ్రాంచ్ చదివినా చివరకు సాఫ్ట్ వేర్ రంగంలోకి రావాల్సిన పరిస్థితి కూడా ఉండటంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సీఎస్ఈ, ఐటీకే తొలి ప్రాధాన్యమిస్తున్నారు.

తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ లో ఐటీ సంబంధిత బ్రాంచిల్లో 95.56 శాతం సీట్లు భర్తీ కాగా, ఈసీఈలో 88శాతం, ఈఈఈలో 55శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. సివిల్-51శాతం, మెకానికల్ విభాగాన్ని 43శాతం మంది విద్యార్థులు మాత్రమే ఎంచుకున్నారు. మొత్తమ్మీద కరోనా తర్వాత మారిన పరిస్థితులు మరోసారి విద్యార్థులందర్నీ ఐటీవైపు ఆకర్షించాయి. ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా రంగాల్లో సీట్ల భర్తీకి నేటినుంచి ఈఏపీసెట్ నిర్వహిస్తున్నారు. ఏపీలో కూడా ఇంజినీరింగ్ విద్యార్థులు తొలి ప్రాధాన్యం ఐటీకే ఇస్తారనే అంచనాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News