దంపతుల ఆత్మహత్యలు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఆత్మహత్యాయత్నం చేసినవారిపై ఐపీసీ సెక్షన్ 309కింద కేసు పెడతారు. ఆత్మహత్యకు ప్రేరేపించినవారు ఐపీసీ సెక్షన్ 306కింద శిక్షార్హులు. దంపతుల ఆత్మహత్యా ప్రయత్నాలు, ఆత్మహత్యలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. ఆర్థిక కష్టాల వల్ల, కుటుంబ కలహాల వల్ల దంపతులు ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు కో కొల్లలు. అదే క్రమంలో ప్రేమ విఫలమై కొన్ని జంటలు, ప్రేమించినవారితో వివాహం కాక.. విడిపోయామన్న బాధతో మరికొన్ని జంటలు, పెళ్లి తర్వాత కొత్తగా ప్రేమలో పడి సమాజం ముందు తలెత్తుకోలేక ఇంకొన్ని […]

Advertisement
Update:2021-09-15 02:16 IST

ఆత్మహత్యాయత్నం చేసినవారిపై ఐపీసీ సెక్షన్ 309కింద కేసు పెడతారు. ఆత్మహత్యకు ప్రేరేపించినవారు ఐపీసీ సెక్షన్ 306కింద శిక్షార్హులు. దంపతుల ఆత్మహత్యా ప్రయత్నాలు, ఆత్మహత్యలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. ఆర్థిక కష్టాల వల్ల, కుటుంబ కలహాల వల్ల దంపతులు ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు కో కొల్లలు. అదే క్రమంలో ప్రేమ విఫలమై కొన్ని జంటలు, ప్రేమించినవారితో వివాహం కాక.. విడిపోయామన్న బాధతో మరికొన్ని జంటలు, పెళ్లి తర్వాత కొత్తగా ప్రేమలో పడి సమాజం ముందు తలెత్తుకోలేక ఇంకొన్ని జంటలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదాహరణలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్న జంటలో ఇద్దరూ చనిపోకపోతే పరిస్థితి వేరు. ఒకరు చనిపోయి, ఒకరు ప్రాణాలతో ఉంటే.. ఆ మిగిలినవారి పరిస్థితి ఏంటి..? ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కేసు ఎదుర్కోవాల్సి వస్తే రెండో వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారు. ఇలాంటి ఓ కేసులో సుప్రీంకోర్టు ఆసక్తికర తీర్పునిచ్చింది. దంపతులిద్దరూ విషం తాగిన సందర్భంలో ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ భర్తకు శిక్ష విధించడం సరికాదని తీర్పు చెప్పింది.

కేసేంటంటే..?
తమిళనాడుకు చెందిన వేలుదురైకు వివాహం జరిగి 25 ఏళ్లు. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. అయితే వివాహం జరిగిన కొత్తల్లోనే దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. పాతికేళ్లుగా వారిద్దరూ సర్దుకుపోయి సజావుగానే కాపురం చేసి ముగ్గురు పిల్లలను పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల గొడవలు మరింత ముదిరి ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగారు. భార్య చనిపోగా, భర్త వేలుదురై బతికి బయటపడ్డాడు. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ ఆయనపై కేసు పెట్టారు పోలీసులు. సెక్షన్‌ 306 కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ట్రయల్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టుకి వెళ్లినా ట్రయల్ కోర్ట్ తీర్పునే సమర్థించారు న్యాయమూర్తులు. చివరకు కేసు సుప్రీంకోర్టుకి వచ్చింది. అయితే ఈ తీర్పులతో సుప్రీం ఏకీభవించలేదు. ఇద్దరూ ఆత్మహత్యయత్నం చేశారని, అందువల్ల భర్త ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా భావించలేమని తెలిపింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తప్ప, ఇతరత్రా సంఘటనలు జరిగినట్టు నిరూపించలేదని పేర్కొంది.

ఆత్మహత్య చేసుకోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితులు కల్పించినప్పుడే.. ప్రేరేపించారని భావించి శిక్ష వేయాల్సి ఉంటుందని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ ధర్మాసనం తీర్పునిచ్చింది.

దంపతులు ఆత్మహత్యాయత్నం చేస్తే.. పొరపాటున అందులో ఒకరు బతికి బయటపడితే.. వారిని కచ్చితంగా అపరాధ భావం వెంటాడుతూనే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో తన భాగస్వామిని ఆత్మహత్యకు ప్రేరేపించి, మిగతావారు ఆత్మహత్యాయత్నం చేసినట్టు నటించి.. వారిని వదిలించుకునే సందర్భాలూ ఉంటాయి. అలాంటి ప్రత్యేక సందర్భాలు మినహా.. మిగతా కేసుల విషయంలో ఏకపక్షంగా బతికున్నవారిపై కేసు పెట్టి వేధించడం సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News