ఉప ఎన్నికలకు సీఈసీ కసరత్తు.. అక్టోబర్ లేదా నవంబర్ లో ముహూర్తం..
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరగాల్సిన అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి పోలింగ్ కి ఏర్పాట్లు జరగబోతున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితులు కాస్త కంట్రోల్ లోకి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా కసరత్తులు చేస్తోంది. అన్నీ కుదిరితే అక్టోబర్ లో దేశవ్యాప్తంగా 3 లోక్ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. సీఈసీ కాస్త నిదానిస్తే మాత్రం నవంబర్ ముహూర్తం ఖరారవుతుంది. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రాంతాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, తదితర […]
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరగాల్సిన అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి పోలింగ్ కి ఏర్పాట్లు జరగబోతున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితులు కాస్త కంట్రోల్ లోకి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా కసరత్తులు చేస్తోంది. అన్నీ కుదిరితే అక్టోబర్ లో దేశవ్యాప్తంగా 3 లోక్ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. సీఈసీ కాస్త నిదానిస్తే మాత్రం నవంబర్ ముహూర్తం ఖరారవుతుంది.
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రాంతాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, తదితర అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల అధికారులతో సమీక్షించింది. కరోనా, వరదలు, ఇతర అంశాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. మే నెలలో కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. దేశవ్యాప్తంగా అన్ని ఉప ఎన్నికలను సీఈసీ వాయిదా వేసింది. ఇప్పుడు పరిస్థితులు కుదుటపడుతుండటంతో ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది.
పశ్చిమ బెంగాల్ గరంగరం..
పశ్చిమబెంగాల్‌లో 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. నందిగ్రామ్ లో ఓడిపోయినా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మమతా బెనర్జీ.. నవంబర్ 5లోపు తిరిగి శాసన సభకు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో ఉప ఎన్నికలకోసం తృణమూల్ కాంగ్రెస్ పట్టుబడుతోంది. మరోవైపు బెంగాల్ లో శాసన సమండలి పునరుద్ధరించేందుకు తీర్మానం చేసినా, అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. దీంతో ఉప ఎన్నికలపైనే మమత భవితవ్యం ఆధారపడి ఉంది.
హరియాణా, మేఘాలయ రాష్ట్రాల్లో చెరో రెండు స్థానాలకు, రాజస్థాన్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ లలో ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. దాద్రానగర్ హవేలీ, ఖండ్వా (మధ్యప్రదేశ్), మండి (హిమాచల్ ప్రదేశ్) లోక్‌సభ స్థానాలకు కూడా ఒకేసారి ఉప ఎన్నికలు నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా..
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఏపీలో బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అటు తెలంగాణలో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈటల రాజకీయ భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. అటు కేసీఆర్ కూడా ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన నూతన పథకాలకు ప్రజామోదం ఎంత ఉందనేదానికి కూడా ఉప ఎన్నికల ఫలితాలే గీటురాయి. దీంతో హుజూరాబాద్ ఫైట్ పైనే అందరి ఫోకస్ ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచార హోరు పెంచాయి.
తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు కూడా..
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలకు గతంలో కరోనా పరిస్థితులను అడ్డుగా ఉన్నాయని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు పరిస్థితులు సానుకూలం కావడంతో ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.