సందిగ్ధంలో తెలంగాణ బడి.. ఆఫ్ లైన్ తోపాటు.. ఆన్ లైన్ కూడా..

ఏపీలో ఆగస్ట్ 16నుంచి స్కూల్స్, కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి. ఆన్ లైన్ బోధన లేనే లేదు, అంతా ఆఫ్ లైన్ బోధనే. కానీ తెలంగాణ సర్కారు మాత్రం ఈ విషయంలో ఇరుకున పడింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజునుంచి ప్రభుత్వ పాఠశాలలను తెరుస్తున్నా.. ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాల్సి వస్తోంది. కొవిడ్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వల్ల ఈ సందిగ్ధత నెలకొంది. పిల్ […]

Advertisement
Update:2021-09-01 01:56 IST

ఏపీలో ఆగస్ట్ 16నుంచి స్కూల్స్, కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి. ఆన్ లైన్ బోధన లేనే లేదు, అంతా ఆఫ్ లైన్ బోధనే. కానీ తెలంగాణ సర్కారు మాత్రం ఈ విషయంలో ఇరుకున పడింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజునుంచి ప్రభుత్వ పాఠశాలలను తెరుస్తున్నా.. ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాల్సి వస్తోంది. కొవిడ్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వల్ల ఈ సందిగ్ధత నెలకొంది. పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. స్కూల్ కి రావడం, రాకపోవడం పిల్లలు, వారి తల్లిదండ్రుల ఇష్టంగా తేల్చింది. ఎవరినీ బలవంత పెట్టొద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రైవేట్ స్కూల్స్ తెరిచే విషయంలో యాజమాన్యాలకే తుది నిర్ణయం వదిలేయాలని చెప్పింది. అదే సమయంలో ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాలని, హాస్టళ్లతో అనుసంధానమైన గురుకులాలను తెరవొద్దని ఆదేశించింది.

కోర్టు తీర్పు నేపథ్యంలో చివరి నిముషంలో తెలంగాణ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌ వాడీలు, ఇంటర్‌, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతుందని, ప్రైవేటు పాఠశాలల విషయంలో మాత్రం తరగతులు ఆన్‌ లైనా, ఆఫ్ లైనా అనేది యాజమాన్యాలకు వదిలేస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లను కోర్టు ఆదేశాల మేరకు మరికొంత కాలం మూసి ఉంచుతున్నట్టు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు సమాంతరంగా ఆన్‌ లైన్‌ తరగతులు కూడా నిర్వహిస్తారు. విద్యార్థులు ఏ విధానంలోనైనా తరగతులకు హాజరుకావొచ్చు. ఇంటర్‌, డిగ్రీ సహా అన్ని రకాల కాలేజీల్లో మాత్రం ప్రత్యక్ష తరగతులే నిర్వహిస్తారు.

డిక్లరేషన్లపై ఆగ్రహం..
విద్యార్థుల్ని స్కూళ్లకు పంపించేటపుడు తల్లిదండ్రుల వద్ద తీసుకుంటున్న డిక్లరేషన్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ స్కూళ్లు అయినా, ప్రైవేటు స్కూళ్లు అయినా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి డిక్లరేషన్లు తీసుకోకూడదని స్పష్టం చేసింది. కొన్ని యాజమాన్యాలు విద్యార్థులను స్కూళ్లకు పంపిన తర్వాత అక్కడ ఏమైనా జరిగితే తమ బాధ్యత కాదని తల్లిదండ్రుల నుంచి కన్సెంట్లు తీసుకొంటున్నాయని, అలాంటివాటికి చట్టబద్ధత లేదని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను అక్టోబర్-4కి వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News