వాహనాల రిజిస్ట్రేషన్లో ఇక భారత్ సిరీస్..
ఇండియాలో ఇప్పటి వరకూ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు ఆయా రాష్ట్రాల పేర్లతో మొదలవుతాయి. AP, TS, KA.. ఇలా ఇంగ్లిష్ పొడి అక్షరాలతో రిజిస్ట్రేషన్ నెంబర్ మొదలవుతుంది. ఇకపై ఆ స్థానంలో భారత్ అనే పేరు వస్తుంది. BH అనే అక్షరాలతో నెంబర్ ప్లేట్ కనపడుతుంది. వాహనం రిజిస్ట్రేషన్ చేస్తున్న సంవత్సరం కూడా నెంబర్ ప్లేట్ పై ఉంటుంది. అయితే అన్ని వాహనాలకు ఇది అవసరం లేదు. ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాలు, లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో […]
ఇండియాలో ఇప్పటి వరకూ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు ఆయా రాష్ట్రాల పేర్లతో మొదలవుతాయి. AP, TS, KA.. ఇలా ఇంగ్లిష్ పొడి అక్షరాలతో రిజిస్ట్రేషన్ నెంబర్ మొదలవుతుంది. ఇకపై ఆ స్థానంలో భారత్ అనే పేరు వస్తుంది. BH అనే అక్షరాలతో నెంబర్ ప్లేట్ కనపడుతుంది. వాహనం రిజిస్ట్రేషన్ చేస్తున్న సంవత్సరం కూడా నెంబర్ ప్లేట్ పై ఉంటుంది. అయితే అన్ని వాహనాలకు ఇది అవసరం లేదు. ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాలు, లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో నివశించే అవసరం ఉన్నవారికి ఇది ఓ వెసులుబాటుగా ఉంటుంది. రీ రిజిస్ట్రేషన్ లు అవసరం లేకుండా భారత్ సిరీస్ ని తెరపైకి తెచ్చింది కేంద్రం.
ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాన్ని మరో రాష్ట్రంలో గరిష్టంగా ఏడాది వరకు వాడుకునేందుకు అనుమతిస్తున్నారు. ఆ తర్వాత కూడా అదే రాష్ట్రంలో వాహనం తరచూ తిరుగుతుంటే మాత్రం అధికారులకు దాన్ని సీజ్ చేయొచ్చు. అందుకే ఆ గడువు ముగిసేలోపు యజమానులు రీ-రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. దీనికి ముందుగా గతంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న రాష్ట్రంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి, కొత్త రాష్ట్రంలో రీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీంతో వాహన యజమాని మరోసారి రిజిస్ట్రేషన్ చార్జీలు భరించాల్సి వస్తుంది. మళ్లీ రాష్ట్రం మారితే మళ్లీ రీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇలాంటి ఇబ్బందుల్ని నివారించడానికే కేంద్రం ఈ పద్ధతిని అమలులోకి తెస్తోంది.
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి వ్యక్తిగత వాహనాలను తీసుకువెళ్లినప్పుడు ఇక రీ-రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. BH -సిరీస్ కింద వాహనాలను స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే సదుపాయం రక్షణ శాఖ సిబ్బందికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు ఉంటుంది. వీరితో పాటు కనీసం 4 రాష్ర్టాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను రవాణా శాఖ జారీ చేసింది.
నెంబర్ ఫార్మాట్ ఇలా ఉంటుంది.
BH -సిరీస్ రిజిస్ట్రేషన్ ఫార్మాట్ AA BH XXXX BB లాగా ఉంటుంది. ఇందులో AA అంటే ఆ వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న సంవత్సరం. BH అనేది భారత్ కి ప్రతిరూపం. XXXX అంటే ఇప్పటిలాగే నెంబర్ సిరీస్. BB స్థానంలో రెండు ఇంగ్లిష్ అక్షరాలుంటాయి. అంటే ఇకపై BH-సిరీస్ కింద రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలు ఏ సంవత్సరంలో కొన్నారో కూడా నెంబర్ ప్లేట్ చూసి చెప్పేయొచ్చనమాట.
BH -సిరీస్ నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు పన్ను 3 శ్లాబుల్లో ఉంటుంది. రూ.10 లక్షలలోపు వాహనాలకు 8 శాతం, రూ.10-20 లక్షలలోపు వాహనాలకు 10 శాతం, రూ.20 లక్షలు పైబడిన వాహనాలకు 12 శాతం వసూలు చేస్తారు. డీజిల్ వాహనాలకు 2 శాతం పన్ను అదనం. ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం 2 శాతం పన్ను తగ్గిస్తారు.