కేంద్రం వర్సెస్ కేరళ.. కరోనా వార్..

కేరళలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం బక్రీద్, ఓనమ్ పండగలకు ఇచ్చిన వెసులుబాట్లే దీనికి కారణం అని నిర్థారణ అయింది. అయితే ఈ సందర్భంలో కేరళకు సాయం చేయాల్సిన కేంద్రం విమర్శలతో విరుచుకుపడుతోంది. దేశమంతా ఒకే విధానం అమలు చేస్తుంటే.. కేరళలోని పినరయి విజయన్‌ ప్రభుత్వం మాత్రం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను కరోనాకు బలిచేస్తోందంటూ జేపీ నడ్డా ఇటీవలే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 70 శాతం […]

Advertisement
Update:2021-08-28 05:20 IST

కేరళలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం బక్రీద్, ఓనమ్ పండగలకు ఇచ్చిన వెసులుబాట్లే దీనికి కారణం అని నిర్థారణ అయింది. అయితే ఈ సందర్భంలో కేరళకు సాయం చేయాల్సిన కేంద్రం విమర్శలతో విరుచుకుపడుతోంది. దేశమంతా ఒకే విధానం అమలు చేస్తుంటే.. కేరళలోని పినరయి విజయన్‌ ప్రభుత్వం మాత్రం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను కరోనాకు బలిచేస్తోందంటూ జేపీ నడ్డా ఇటీవలే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 70 శాతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయమంటే కేరళ మాత్రం 50 శాతం లోపే చేసిందని ఆరోపించారు. అంతే కాదు బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిక పెడుతూ కూడా విమర్శలు చేశారు. కేరళ జనాభా 3.58 కోట్లే అయినా, కరోనా కేసులు 38.8 లక్షలు నమోదయ్యాయని, అదే సమయంలో 24 కోట్లకు పైగా జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటివరకు కేవలం 17లక్షలమంది మాత్రమే కరోనా వైరస్ బారిన పడ్డారని కేంద్రం లెక్కలు చెబుతోంది. పరోక్షంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది.

కేరళ ప్రతివిమర్శలు..
కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కేంద్రం నలుగురు సభ్యుల బృందాన్ని అక్కడికి పంపించి చేతులు దులుపుకుంది. వారు సలహాలిచ్చారే కానీ, క్షేత్ర స్థాయిలో సహాయ కార్యక్రమాలకు కేంద్రం ఏమాత్రం ముందుకు రావడంలేదనేది కేరళ ఆరోపణ. కొవిడ్‌ పరీక్షల విషయానికొస్తే దేశంలో ప్రతి 100 మందిలో దాదాపు 40 మందికి పరీక్షలు చేశారు. కేరళలో మాత్రం ప్రతి 100 మందిలో 86 మందికి కరోనా పరీక్షలు జరిగినట్లు గణాంకాలు నమోదయ్యాయి. జేపీ నడ్డా పోలిక తీసుకొచ్చిన ఉత్తర ప్రదేశ్‌లో ఈ సంఖ్య 33గా ఉంది. దీంతో యూపీ పోలికపై కేరళ సర్కారు విరుచుకుపడుతోంది.

జనసాంద్రత ఎక్కువ కావడంతో..
దేశవ్యాప్త జనసాంద్రతతో పోలిస్తే కేరళ జనసాంద్రత ఎక్కువగా ఉండటం సహా అధిక ర్యాపిడ్‌ పరీక్షల కారణంగా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున పరీక్షల నిర్వహణతో దేశం మొత్తం కేసుల్లో కేరళ కేసులు 12 శాతం ఉన్నప్పటికీ మరణాల రేటు మాత్రం 0.5 శాతంగానే ఉందని సమర్థించుకుంటున్నారు. దేశవ్యాప్త మరణాల రేటు 1.4 శాతం కాగా.. యూపీలో 1.3శాతం మరణాలు నమోదవుతున్నాయని, కేరళ విధానమే ఇక్కడ భేష్ అని అంటున్నారు.

కేరళ లెక్కలు ఎలా ఉన్నా.. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండో దశను దాటామని చెప్పుకుంటున్నా కేరళ సరిహద్దు రాష్ట్రాలు ఇంకా భయం గుప్పెట్లోనే ఉన్నాయి. కేరళలో ప్రస్తుతం 100మందికి పరీక్షలు చేస్తే అందులో 18మందికి కొవిడ్ సోకినట్టు నిర్థారణ అవుతోంది. పాజిటివిటీ రేటు 18.03గా ఉండటం గమనార్హం. ఈ దశలో కేంద్రం పంతాలకు పోకుండా కేరళను ఒడ్డునపడేసే విధానాలతో ముందుకు రావాలంటున్నారు నిపుణులు.

Tags:    
Advertisement

Similar News