పెట్రో మంట తగ్గదు.. కేంద్రం క్లారిటీ..

ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అందుకే పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు పెంచుతున్నాం, ప్రజలకు కష్టమైనా, నష్టమైనా భరించాల్సిందేనంటూ కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వం సర్దిచెప్పుకుంటూ వస్తోంది. ఇప్పటికిప్పుడు ఇబ్బందులు పడ్డా, భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి చక్కబడ్డాక కాస్త ఊరట లభిస్తుందేమోనని సామాన్యులు ఆశపడ్డారు. నెలరోజులుగా పెట్రోలు, డీజిల్ రేట్ల పెంపుకి కాస్త విరామం దొరకడంతో ఊరటచెందారు. కానీ అలాంటి ఆశలేవీ పెట్టుకోవద్దని, పెట్రో వాతలు కలకాలం ఉంటాయని తేల్చి చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. […]

Advertisement
Update:2021-08-17 03:02 IST

ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అందుకే పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు పెంచుతున్నాం, ప్రజలకు కష్టమైనా, నష్టమైనా భరించాల్సిందేనంటూ కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వం సర్దిచెప్పుకుంటూ వస్తోంది. ఇప్పటికిప్పుడు ఇబ్బందులు పడ్డా, భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి చక్కబడ్డాక కాస్త ఊరట లభిస్తుందేమోనని సామాన్యులు ఆశపడ్డారు. నెలరోజులుగా పెట్రోలు, డీజిల్ రేట్ల పెంపుకి కాస్త విరామం దొరకడంతో ఊరటచెందారు. కానీ అలాంటి ఆశలేవీ పెట్టుకోవద్దని, పెట్రో వాతలు కలకాలం ఉంటాయని తేల్చి చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పాపమంతా గత ప్రభుత్వానిదేనంటూ పాతపాటే పాడారు.

ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచుకుంటూ పోవడం వల్లే భారత్ లో పెట్రోలు రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడల్లా దాన్ని తగ్గించే ప్రసక్తే లేదని, భవిష్యత్ లో ఎక్సైజ్ ట్యాక్స్ మరింత పెరగదని గ్యారెంటీ ఏమీ లేదని అన్నారు నిర్మలా సీతారామన్. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటే త‌ప్ప ప‌రిష్కార మార్గం లేద‌ని తేల్చి చెప్పారు.

పాపం వారిది.. భారం మీది..
కాంగ్రెస్ పాలనను తప్పుబట్టి, కొత్త ఆశలు చూపించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఆశించిన మార్పు రాలేదు సరికదా కొత్త కష్టాలు మొదలయ్యాయి. అయితే ఈ కష్టాలన్నిటికీ కారణం గత పాలకుల పాపమేనంటూ బీజేపీ తనని తాను సమర్థించుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఏడేళ్లు గడిచిపోయాయి. ఇంకా పాత పాలకుల పాపాలే వెంటబపడుతున్నాయంటూ బీజేపీ చెప్పడం మాత్రం విచిత్రం. ఇప్పుడు పెట్రోలు రేట్ల వ్యవహారంలో కూడా కాంగ్రెస్ ని ముద్దాయిగా చేయడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

రిటైల్ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను కృత్రిమంగా త‌గ్గించేందుకు కేంద్ర చ‌మురు సంస్థ‌ల‌కు అప్పటి యూపీఏ ప్ర‌భుత్వం బాండ్ల‌ను జారీ చేసింద‌ని, ఆ ఆయిల్ బాండ్ల‌పై ఇప్ప‌టికీ త‌మ ప్ర‌భుత్వం వ‌డ్డీ చెల్లిస్తుంద‌ని చెప్పుకొచ్చారు ఆర్థిక మంత్రి నిర్మల. గ‌త ఐదేళ్ల కాలంలో ఆయిల్ బాండ్ల‌పై ఎన్డీఏ స‌ర్కార్ రూ.60 వేల కోట్ల వ‌డ్డీ చెల్లించిన‌ట్లు తెలిపారు. ఇంకా చమురు సంస్థలకు రూ.1.3 ల‌క్ష‌ల కోట్ల బ‌కాయిలు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. యూపీఏ హ‌యాంలో రూ.1.44 ల‌క్ష‌ల కోట్ల విలువైన ఆయిల్ బాండ్లు జారీ చేయ‌డంతో అప్పుడు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గాయ‌ని.. కానీ, ఆయిల్ బాండ్ల భారం తమ ప్ర‌భుత్వంపై ప‌డింద‌ని.. వాటి కార‌ణంగానే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌లేక‌పోతున్నామ‌ని తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News