భూతాపానికి వార్నింగ్ బెల్.. అత్యధిక ఉష్ణోగ్రత గల నెలగా జూలై
సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు జూలై నెలలోనే రికార్డు అవుతుంటాయి. కానీ ఈ ఏడాది ఆ ఉష్ణోగ్రతలు 142 ఏళ్ల నాటి రికార్డుల్ని బద్దలు కొట్టాయి. ప్రపంచ ఉష్ణోగ్రతలను అధికారికంగా లెక్కగట్టడం మొదలు పెట్టిన తర్వాత ఈ ఏడాది జూలై నెలలో అత్యథిక ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఇప్పటి వరకూ 2010 అత్యథిక ఉష్ణోగ్రత ఉన్న సంవత్సరంగా రికార్డుల్లో ఉంది. దాన్ని 2021 దాటిపోయింది. భూ ఉపరితలం, సముద్ర ఉపరితలంపై కలిపి సగటు ఉష్ణోగ్రతలను లెక్కగట్టి ఈ గణాంకాలు […]
సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు జూలై నెలలోనే రికార్డు అవుతుంటాయి. కానీ ఈ ఏడాది ఆ ఉష్ణోగ్రతలు 142 ఏళ్ల నాటి రికార్డుల్ని బద్దలు కొట్టాయి. ప్రపంచ ఉష్ణోగ్రతలను అధికారికంగా లెక్కగట్టడం మొదలు పెట్టిన తర్వాత ఈ ఏడాది జూలై నెలలో అత్యథిక ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఇప్పటి వరకూ 2010 అత్యథిక ఉష్ణోగ్రత ఉన్న సంవత్సరంగా రికార్డుల్లో ఉంది. దాన్ని 2021 దాటిపోయింది. భూ ఉపరితలం, సముద్ర ఉపరితలంపై కలిపి సగటు ఉష్ణోగ్రతలను లెక్కగట్టి ఈ గణాంకాలు నిర్ణయిస్తారు. 20వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రత 15.8 డిగ్రీల సెల్సియస్ కాగా.. ఈ ఏడాది దానికంటే 0.93 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదయింది.
అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్(NOAA) సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ఇటీవలే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) సంస్థ భూతాపం పెరిగిపోవడం వల్ల కలిగే అనర్థాలపై ఓ నివేదికను విడుదల చేసింది. భూతాపం పెరిగి, హిమానీ నదాలు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతాయని ప్రపంచ వ్యాప్తంగా పలు సముద్ర తీర నగరాల్లోకి కొన్ని అడుగుల మేర నీరు వస్తుందని అంచనా వేసింది. 2100 సంవత్సరానికల్లా ఈ మార్పు స్పష్టంగా తెలుస్తుందని చెప్పింది. ఈ నివేదికలో భారత్ లోని 12 తీర ప్రాంత నగరాలు కూడా ఉండటం గమనార్హం. 2006 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టం ఏడాదికి 3.7 మిల్లీమీటర్ల చొప్పున పెరిగిపోయింది. 21వ శతాబ్దం మొత్తం ప్రపంచం అంతటా సముద్ర మట్టాలు పెరుగుతూనే ఉంటాయని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది.
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఉష్ణోగ్రతలు రాను రాను భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే దశాబ్దంలో ఉష్ణోగ్రతలు సగటున 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయని అంచనా. విచిత్రం ఏంటంటే.. ఏడాది కాలంగా లాక్ డౌన్ కారణంగా చాలా చోట్ల పరిశ్రమలు మూతబడ్డాయి, ప్రజా రవాణా తగ్గిపోయింది, వ్యక్తిగత వాహనాల వాడకం కూడా ఓ దశలో బాగా తగ్గింది. అప్పట్లో భూ ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేశాయి. వాతావరణంలో కాలుష్య కారకాలు కూడా తగ్గిపోయాయి. అంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవ్వాలి. కానీ వారి అంచనాలకు భిన్నంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఏకంగా గత రికార్డులన్నీ బద్దలయ్యాయి.