ఆన్ లైన్ చదువులకు సిగ్నల్ కష్టాలు..

గతంలో స్కూళ్లు అందుబాటులో లేక చదువు కోసం పల్లెటూరు విద్యార్థులు మైళ్లదూరం నడిచివెళ్లేవారు. కానీ ఇప్పుడు అన్నిచోట్లా స్కూళ్లున్నాయి, నిరుపేద పిల్లలకోసం ఉచిత హాస్టళ్లున్నాయి. అయినా కూడా కరోనా కష్టకాలం మళ్లీ పాతరోజుల్ని గుర్తుకు తెస్తోంది. అప్పట్లో స్కూల్ కి వెళ్లడానికి విద్యార్థులు ఊర్లు దాటి వెళ్తే, ఇప్పుడు సిగ్నల్ కోసం కొండలు, కోనలు దాటి.. పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ దుస్థితి ఒడిశా లో కనిపిస్తోంది. అక్కడి గిరిజన విద్యార్థులకు కరోనా కష్టకాలంలో […]

Advertisement
Update:2021-07-25 16:35 IST
ఆన్ లైన్ చదువులకు సిగ్నల్ కష్టాలు..
  • whatsapp icon

గతంలో స్కూళ్లు అందుబాటులో లేక చదువు కోసం పల్లెటూరు విద్యార్థులు మైళ్లదూరం నడిచివెళ్లేవారు. కానీ ఇప్పుడు అన్నిచోట్లా స్కూళ్లున్నాయి, నిరుపేద పిల్లలకోసం ఉచిత హాస్టళ్లున్నాయి. అయినా కూడా కరోనా కష్టకాలం మళ్లీ పాతరోజుల్ని గుర్తుకు తెస్తోంది. అప్పట్లో స్కూల్ కి వెళ్లడానికి విద్యార్థులు ఊర్లు దాటి వెళ్తే, ఇప్పుడు సిగ్నల్ కోసం కొండలు, కోనలు దాటి.. పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ దుస్థితి ఒడిశా లో కనిపిస్తోంది. అక్కడి గిరిజన విద్యార్థులకు కరోనా కష్టకాలంలో చదువు దూరమైంది.

ఒడిశాలోని సుందర్ ఘర్ జిల్లాలో రంగమతి అనే ఓ గ్రామం ఉంది. ఆ ఊరికి ఇంటర్నెట్ సౌకర్యం లేదు. సిగ్నల్ రావాలంటే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడోపని అనే ఊరికి వెళ్లాలి. అంటే బోర్డర్ దాటి జార్ఖండ్ రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నమాట. ఒడిశా ప్రభుత్వం 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టడంతో విద్యార్థులంతా పాఠాలకోసం పక్క రాష్ట్రానికి వెళ్తున్నారు. అడవి మార్గం ద్వారా రోజూ 5 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. ఇంటర్ పూర్తి చేసిన సోనీ సంజుక్త అనే యువతి.. విద్యార్థులకు తోడుగా వెళ్తోంది. అడవినుంచి వెళ్లేందుకు గ్రామస్తులు సహకరిస్తుంటారు. సిగ్నల్ రాగానే ఆన్ లైన్ పాఠాలు డౌన్ లోడ్ చేసుకుంటామని, ఊరికి తిరిగొచ్చిన తర్వాత వారికి మరోసారి వాటిని వివరిస్తానని చెబుతోంది సోనీ. ఆ ఊరిలో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆంబులెన్స్ కి ఫోన్ చేయాలన్నా సెల్ ఫోన్ సిగ్నల్ వెదుక్కూంటూ అడవిబాట పట్టాల్సిందే.

కవితది మరో దీన గాధ..
రాయగఢ జిల్లాలో మారుమూల గిరిజన తండా యువతి కవిత. కరోనాకి ముందు భువనేశ్వర్ లోని కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో ఆమెకు సీటొచ్చింది, హాస్టల్ కూడా దొరికింది. ఇంకే కష్టమూ లేదనుకున్న సమయంలో కరోనా వచ్చిపడింది. ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. కనీసం ఫోన్ కొనే స్థోమత కూడా లేని కవిత తప్పనిసరి పరిస్థితుల్లో ఒక అకడమిక్ ఇయర్ కోల్పోవాల్సి వచ్చింది. ఆమెకు తండ్రిలేడు, తల్లి, పెద్దక్కతో కలసి కూలిపనికి వెళ్లి డబ్బు సంపాదించి ఫోన్ కొనుక్కుంది. ఆమె సొంత ఊరిలో సిగ్నల్ ఉండదు కాబట్టి, రాయగఢలో ఓ చిన్న రూమ్ అద్దెకు తీసుకుని ఆన్ లైన్ పాఠాలు నేర్చుకుంటోంది. ఒడిశాలోని గిరిజన గ్రామాల్లో ఒక్కో విద్యార్థిది ఒక్కో దీన గాధ.

సిగ్నల్ కోసం ఊరు వదలి కొండలెక్కుతున్నారు..
ఒడిశాలో ఆన్ లైన్ బోధన, విద్యార్థులకు తీవ్ర సమస్యగా మారింది. కేవలం 40శాతం మంది మాత్రమే ఆన్ లైన్ లో పాఠాలు వింటున్నారు. మిగతా వారికి ఆ అవకాశమే లేదు. ముఖ్యంగా గిరిజన విద్యార్థులు సిగ్నల్స్ కోసం ఊరు వదలి చెట్లెక్కుతున్నారు, కొండలెక్కుతున్నారు, రాష్ట్రాలు దాటి వెళ్తున్నారు. కోరాపుట్ జిల్లా మాచ్ ఖండ్ ప్రాంతంలోని గిరిజన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి సిగ్నల్ కోసం వస్తున్నారు.

భారత్ లో సెల్ ఫోన్ సిగ్నల్ డెన్సిటీ 87.37 శాతం కాగా.. ఒడిశాలో అది కేవలం 76.46 మాత్రమే. ఒడిశాలో 100మంది జనాభాకు కేవలం 43.95మందికి మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వందలో 34మందికి మాత్రమే నెట్ సౌకర్యం ఉంది. కరోనా కష్టకాలంలో నిరుపేద విద్యార్థులు ఆన్ లైన్ చదువులకోసం అష్టకష్టాలు పడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News