హ్యాకింగ్ తోనే కర్నాటకలో కుట్ర జరిగిందా..?

రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్ సహా.. పలువురు కీలకమైన వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పెట్రోల్ రేట్ల పెంపుపై పార్లమెంట్ లో వాదోపవాదాలు జరుగుతాయనుకుంటే, దాన్ని పెగాసన్ కుట్ర ఆక్రమించింది. అయితే ఇప్పుడీ కుట్ర తాలూకు ప్రతిఫలాలు కూడా క్రమక్రమంగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కర్నాటక ప్రభుత్వం కూలిపోయిన వ్యవహారానికి పెగాసన్ హ్యాకింగ్ కారణం అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలడానికి ఇప్పటి అధికార బీజేపీ కుట్రలు చేసిందనే విషయం […]

Advertisement
Update:2021-07-21 03:18 IST

రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్ సహా.. పలువురు కీలకమైన వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పెట్రోల్ రేట్ల పెంపుపై పార్లమెంట్ లో వాదోపవాదాలు జరుగుతాయనుకుంటే, దాన్ని పెగాసన్ కుట్ర ఆక్రమించింది. అయితే ఇప్పుడీ కుట్ర తాలూకు ప్రతిఫలాలు కూడా క్రమక్రమంగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కర్నాటక ప్రభుత్వం కూలిపోయిన వ్యవహారానికి పెగాసన్ హ్యాకింగ్ కారణం అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలడానికి ఇప్పటి అధికార బీజేపీ కుట్రలు చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. ఏకంగా 17మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేసి కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోయడంతో బీజేపీ వారిని తమ జట్టులో చేర్చుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఈ రాజకీయ క్రీడలో పార్టీమారినవారు మంత్రిపదవుల్ని దక్కించుకుని లాభపడ్డారు. నిజాయితీగా ఉన్నవారు ప్రతిపక్షంలో కూర్చున్నారు.

కర్నాటకలో అధికార మార్పు జరిగి సరిగ్గా రెండేళ్లవుతోంది. ఇప్పుడీ వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు తావిచ్చింది. పెగాసన్ హ్యాకింగ్ సాయంతో కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ప్రభుత్వానికి చెందిన కొందరు కీలక నేతల ఫోన్‌ నంబర్లు కూడా పెగాసన్ స్పైవేర్ టార్గెట్ జాబితాలో ఉన్నట్లు ‘ది వైర్’ వార్తా సంస్థ పేర్కొంది. దీంతో కర్నాటక సర్కారు కూలిపోడానికి హ్యాకింగ్ కి సంబంధం ఉన్నట్టు అనుమానాలు బలపడుతున్నాయి.

కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర, మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్య వ్యక్తిగత కార్యదర్శుల ఫోన్‌ నంబర్లు స్పైవేర్‌ టార్గెట్ జాబితాలో ఉన్నట్లు ‘ది వైర్’ కథనంలో వెల్లడైంది. వీరితో పాటు మరికొందరు కీలక రాజకీయ నేతల ఫోన్ల పైనా అప్పట్లో నిఘా పెట్టినట్లు తెలిపింది. దీంతో ఈ హ్యాకింగ్‌ ద్వారానే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి ఉంటుందనే సందేహాలు వెలువడుతున్నాయి. పెగాసన్ ఆరోపణలను బీజేపీ ప్రభుత్వం తిప్పికొడుతున్నా కూడా ప్రతిపక్షాలు మాత్రం పార్లమెంట్ లో ఆందోళనలు చేపట్టాయి, ప్రభుత్వాన్ని నిలదీశాయి.

Advertisement

Similar News