చిన్నమ్మ బెదిరింపులు.. వెనక్కి తగ్గిన అన్నాడీఎంకే నేతలు..
తమిళనాట ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాభవం తర్వాత.. పార్టీపై పెత్తనంకోసం శశికళ రకరకాల ఎత్తులు వేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, కొంతమంది నేతలతో తాను మాట్లాడిన ఆడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు. నేనొస్తున్నా, అన్నీ చక్కబెడతానంటూ భరోసా కూడా ఇస్తున్నారు. ఈ దశలో అన్నాడీఎంకే నేతల్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారనే ఆరోపణలతో శశికలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ శశికళ వ్యవహారంలో స్పందించని పన్నీర్, పళని కూడా స్వరం మార్చారు. శశికళ వల్ల తమకేమాత్రం ఇబ్బంది లేదని, తమ పార్టీకి […]
తమిళనాట ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాభవం తర్వాత.. పార్టీపై పెత్తనంకోసం శశికళ రకరకాల ఎత్తులు వేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, కొంతమంది నేతలతో తాను మాట్లాడిన ఆడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు. నేనొస్తున్నా, అన్నీ చక్కబెడతానంటూ భరోసా కూడా ఇస్తున్నారు. ఈ దశలో అన్నాడీఎంకే నేతల్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారనే ఆరోపణలతో శశికలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ శశికళ వ్యవహారంలో స్పందించని పన్నీర్, పళని కూడా స్వరం మార్చారు. శశికళ వల్ల తమకేమాత్రం ఇబ్బంది లేదని, తమ పార్టీకి వచ్చిన నష్టం లేదని, ఆమె అసలు తమ పార్టీ సభ్యురాలే కాదని చెబుతున్నారు పళని స్వామి.
పైకి మేకపోతు గాంభీర్యం చూపుతున్నా.. చిన్నమ్మ వల్ల తమ పార్టీలో లుకలుకలు మొదలవుతాయని పార్టీ కేడర్ తమని ధిక్కరించే రోజులు వస్తాయని ముందునుంచీ అనుమానిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రులు పన్నీర్ సెల్వం, పళని స్వామి. ఆ భయంతోనే పార్టీ అంతర్గత ఎన్నికలను మరోసారి వాయిదా వేసుకున్నారు. ఈమేరకు ఎన్నికల కమిషన్ అనుమతి కోరారు. ఆ అనుమతి లాంఛనమే అయినా.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని ఇంకెన్నాళ్లు ఖాళీగా పెడతారనే విషయం మాత్రం తేలడంలేదు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలిత తర్వాత ఇంకెవరూ ఆ పదవి జోలికి వెళ్లలేదు. కన్వీనర్ గా పన్నీర్ సెల్వం, కో కన్వీనర్ గా పళనిస్వామి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. చివరిసారిగా అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు 2014 ఆగస్టు నుంచి 2015 ఏప్రిల్ వరకు నిర్వహించారు. 2014 ఆగష్టు 29వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏడోసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత అనేక కారణాల వల్ల సంస్థాగత ఎన్నికలు జరగలేదు. 2017 సెప్టెంబర్ లో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించినా, ప్రధాన కార్యదర్శి పోస్ట్ మాత్రం భర్తీ చేయలేదు. కన్వీనర్, కో కన్వీనర్ పోస్ట్ లను సృష్టించి భర్తీ చేసుకున్నారు. అప్పటి తీర్మానం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ లోగా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది.
ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలన్నీ కచ్చితంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాల్సిందే. దీంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఈసీ, జూలై రెండోవారంలోగా పార్టీలో అంతర్గత ఎన్నికలు జరపాలని సూచించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంస్థాగత ఎన్నికలు జరిపితే, శశికళ వర్గం తిరగబడే అవకాశముంది, అందులోనూ ఆమె అన్నాడీఎంకే నేతల్ని రెచ్చగొట్టి తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎన్నికలను మరో 6నెలలు వాయిదా కోరుతూ ఈసీని అభ్యర్థిస్తూ పార్టీ నేతలు లేఖ రాశారు. ఒకరకంగా శశికళ ఎపిసోడ్ తో అన్నాడీఎంకేలో.. ముఖ్యంగా పన్నీర్, పళని వర్గంలో కలకలం రేగింది. చిన్నమ్మ పార్టీలో ఎంట్రీ ఇస్తే.. తమని పూర్తిగా అణగదొక్కేస్తుందని వారు భయపడుతున్నారు.