నకిలీ టీకాపై బీజేపీ, తృణమూల్ బిగ్ ఫైట్..
దేశంలో నకిలీ టీకాలు వస్తున్నాయంటే.. సకాలంలో సమర్థంగా టీకా పంపిణీ చేపట్టలేకపోయిన కేంద్ర ప్రభుత్వానిదే ఆ తప్పంతా. వ్యాక్సినేషన్ అంతా ప్రభుత్వ అధీనంలో జరిగితే అసలు నకిలీ టీకాల వ్యవహారమే ఉండేది కాదు. కానీ ప్రైవేటుకి కూడా గేట్లు బార్లా తీయడంతోనే చిక్కొచ్చిపడింది. ప్రైవేటు ఆస్పత్రుల పేరుతో కొన్ని ఏజెన్సీలు చేపడుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నకిలీ టీకాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. అయితే తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంలో ముందుండే బీజేపీనేతలు దీన్ని కూడా రాజకీయానికి […]
దేశంలో నకిలీ టీకాలు వస్తున్నాయంటే.. సకాలంలో సమర్థంగా టీకా పంపిణీ చేపట్టలేకపోయిన కేంద్ర ప్రభుత్వానిదే ఆ తప్పంతా. వ్యాక్సినేషన్ అంతా ప్రభుత్వ అధీనంలో జరిగితే అసలు నకిలీ టీకాల వ్యవహారమే ఉండేది కాదు. కానీ ప్రైవేటుకి కూడా గేట్లు బార్లా తీయడంతోనే చిక్కొచ్చిపడింది. ప్రైవేటు ఆస్పత్రుల పేరుతో కొన్ని ఏజెన్సీలు చేపడుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నకిలీ టీకాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. అయితే తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంలో ముందుండే బీజేపీనేతలు దీన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నారు. పశ్చిమబెంగాల్ లో నకిలీ టీకా మాఫియా వెనక తృణమూల్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని శాసనసభ విపక్ష నేత సువేందు అధికారి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. నకిలీ వ్యాక్సిన్ల అంశంపై డీజీపీ కార్యాలయం వద్దకు లక్ష మందితో ప్రదర్శనగా వెళ్తామని బీజేపీ హెచ్చరించింది.
అసలేంటి వివాదం..?
కోల్ కతాలో దేవంజన్ దేవ్ అనే ఓ మోసగాడు తనను తాను ఐఏఎస్ అధికారినంటూ తృణమూల్ ఎంపీ మిమి చక్రవర్తికి పరిచయం చేసుకుని ఈ నకిలీ వ్యాక్సిన్ కథ నడిపాడు. స్వయంగా ఎంపీయే వచ్చి ఆ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించి తాను కూడా టీకా తీసుకుంది. అయితే ఆమెకు టీకా తీసుకున్న సర్టిఫికెట్ రాలేదు, కనీసం సెల్ ఫోన్ కి మెసేజ్ కూడా రాకపోవడంతో అసలు విషయం ఆరా తీశారు. దీంతో ఈ మోసం బయటపడింది. దేవంజన్ దేవ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్ కతాలో దాదాపుగా 2వేలమందికి ఇతని ఆధ్వర్యంలో నకిలీ వ్యాక్సిన్లు వేశారని, టీకా పేరుతో కేవలం యాంటీబయోటిక్ ఇంజక్షన్లు వేశారని తేల్చారు. ఈ క్రమంలో మిమి చక్రవర్తి అనారోగ్యంపాలవడం మరింత సంచలనంగా మారింది. ఆమె అనారోగ్యానికి నకిలీ టీకాకు సంబంధం లేదని ప్రకటన వెలువడింది. అయితే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా దేవంజన్ దేవ్ ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు తీసుకున్నవారికి ఆరోగ్య పరీక్షలు చేయిస్తోంది. సదరు మోసగాడిపై, అతని టీమ్ పై హత్యాయత్నం కింద అభియోగాలు మోపాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశాలిచ్చారు.
అయితే ఈ నకిలీ టీకా వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. సకాలంలో టీకా సరఫరా చేయకపోవడం వల్లే ఇలాంటి నకిలీ వ్యవహారాలు బయటపడుతున్నాయని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ మాత్రం ఆ బురదను టీఎంసీపై చల్లాలనుకుంటోంది. కేంద్రం టార్గెట్ అవుతుండే సరికి, రాష్ట్రంలోని బీజేపీ నేతలు నకిలీ టీకాకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీస్తున్నారు. కేంద్రం తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నారు.