ప్రజలపై బీమా పిడుగు.. సెటిల్మెంట్లతోపాటు పెరిగిన ప్రీమియంలు..

కరోనా కాలంలో దాదాపుగా అన్నిరంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బీమా కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కరోనా మరణాల సెటిల్మెంట్లు ఎక్కువ కావడంతో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తున్న కంపెనీలు, ఆస్పత్రి ఖర్చులు ఎక్కువ కావడంతో హెల్త్ పాలసీలు ఇస్తున్న కంపెనీలకు ఆర్థిక భారం ఎక్కువైంది. క్లెయిముల సంఖ్య దాదాపుగా 10రెట్లు పెరిగిపోవడంతో బీమా సంస్థలకు కష్టకాలం మొదలైంది. ఇన్నాళ్లూ సెటిల్మెంట్లు తక్కువ కావడంతో భారీ లాభాలను ఆర్జించిన బీమారంగం.. ఇప్పుడు వాటిని కరిగించుకోవాల్సి వస్తోంది. ఈ […]

Advertisement
Update:2021-06-21 02:33 IST

కరోనా కాలంలో దాదాపుగా అన్నిరంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బీమా కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కరోనా మరణాల సెటిల్మెంట్లు ఎక్కువ కావడంతో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తున్న కంపెనీలు, ఆస్పత్రి ఖర్చులు ఎక్కువ కావడంతో హెల్త్ పాలసీలు ఇస్తున్న కంపెనీలకు ఆర్థిక భారం ఎక్కువైంది. క్లెయిముల సంఖ్య దాదాపుగా 10రెట్లు పెరిగిపోవడంతో బీమా సంస్థలకు కష్టకాలం మొదలైంది. ఇన్నాళ్లూ సెటిల్మెంట్లు తక్కువ కావడంతో భారీ లాభాలను ఆర్జించిన బీమారంగం.. ఇప్పుడు వాటిని కరిగించుకోవాల్సి వస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో దేశవ్యాప్తంగా అధికారికంగా నమోదైన మరణాల సంఖ్య 1.9 లక్షలు. దీంతో టర్మ్‌, ఎండోమెంట్‌, మనీబ్యాక్‌, యులిప్‌ పాలసీల క్లెయిముల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. గతంలో 10 పాలసీలు సెటిల్ చేసేవారు, ఇప్పుడు 100 క్లెయిములు సెటిల్ చేయాల్సి వస్తోంది. ఇంత పెద్దమొత్తంలో క్లెయిమ్‌ లు పరిష్కరించాల్సి వస్తుందని జీవిత బీమా కంపెనీలు అంచనా వేయలేదు. ఆ మేరకు కేటాయింపులు కూడా జరగలేదు. దీంతో ఒక్కసారిగా బీమా కంపెనీల లాభాల మీద ఒత్తిడి పెరిగింది.

ఆరోగ్యబీమా కుదేలు..
ఆరోగ్య బీమా కంపెనీల విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఆసుపత్రుల పాలై 10-20 రోజుల పాటు కొవిడ్‌-19 చికిత్స తీసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. భారత్ లో బలవంతంగా ఆరోగ్య బీమాపాలసీలు కట్టేవారే కానీ, వాటిని సమర్థంగా వినియోగించుకునేవారు అరుదు. ప్రతి వాటికీ హాస్పిటలైజేషన్ అనే కొర్రీతో క్లెయిములు తిరస్కరిస్తుంటాయి కంపెనీలు. అయితే కొవిడ్ విషయంలో ఆస్పత్రి బెడ్లు, ఆక్సిజన్ ఖర్చులు అన్నీ తడిసి మోపెడయ్యాయి. బీమా కంపెనీలు కూడా కాదనలేని పరిస్థితి వచ్చింది. ఓ దశలో కేసులు ఎక్కువ కావడంతో బీమా కంపెనీలు ‘క్యాష్‌ లెస్‌’ సదుపాయాన్ని అమలు చేయడం లేదని, రీ-ఇంబర్స్‌ మెంట్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDA) బీమా కంపెనీలను హెచ్చరించింది కూడా.

ఖరీదైన పాలసీలు..
కరోనా కష్టకాలంలో ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియం భారీగా పెరిగింది. క్లెయిమ్‌ ల సంఖ్య గణనీయంగా పెరగడంతో బీమా కంపెనీలు ఆదాయాలను పెంచుకోవడంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే కొత్తగా జారీ చేసే టర్మ్‌ పాలసీలపై ప్రీమియాన్ని గరిష్టంగా 25 శాతం పెంచేశాయి. ఆరోగ్య బీమా విభాగంలో కొత్త పాలసీలు, రెన్యువల్ పాలసీల ప్రీమియం 15 నుంచి 40 శాతం పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రజలపై బీమా భారం పెరిగిపోయింది. అసలే ఆదాయాలు, ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి ప్రజలు ప్రీమియం వాయిదాలు కట్టలేక తల్లడిల్లిపోతున్నారు. కొత్తగా పాలసీలు తీసుకోవాలనుకునే వారికి కూడా ప్రీమియంలు కష్టంగా మారాయి. కొంత మంది పాలసీలు రెన్యువల్ చేసుకోలేక, వాటిని వదిలేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News