జంతువుల్లో కరోనా కలకలం.. అందుబాటులోకి వ్యాక్సిన్..
ఇన్నాళ్లూ మనుషులనే ఇబ్బంది పెట్టిన కరోనా.. ఇప్పుడు జంతువులకి కూడా శాపంగా మారింది. ఆమధ్య హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో సింహాలకు కరోనా సోకిందనే వార్తలొచ్చినా.. అది జలుబు లక్షణాలతో ఉన్న సార్క్ కొవ్-2గా నిర్ధారించారు. ఆ తర్వాత తమిళనాడులోని వండలూరు జూ పార్క్ లో జంతువులకు కరోనా సోకిందని ప్రచారం జరిగింది. ఏకంగా ఓ సింహం కరోనా వ్యాధితో మరణించిందని కూడా నిర్ధారించారు. ఆ సింహం ద్వారా మరో 9 సింహాలు కూడా కరోనాతో […]
ఇన్నాళ్లూ మనుషులనే ఇబ్బంది పెట్టిన కరోనా.. ఇప్పుడు జంతువులకి కూడా శాపంగా మారింది. ఆమధ్య హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో సింహాలకు కరోనా సోకిందనే వార్తలొచ్చినా.. అది జలుబు లక్షణాలతో ఉన్న సార్క్ కొవ్-2గా నిర్ధారించారు. ఆ తర్వాత తమిళనాడులోని వండలూరు జూ పార్క్ లో జంతువులకు కరోనా సోకిందని ప్రచారం జరిగింది. ఏకంగా ఓ సింహం కరోనా వ్యాధితో మరణించిందని కూడా నిర్ధారించారు. ఆ సింహం ద్వారా మరో 9 సింహాలు కూడా కరోనాతో బాధపడుతున్నాయని తెలుస్తోంది. అదే జూలో ఉన్న ఏనుగులకు కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు అధికారులు.
ముందు జాగ్రత్తగా.. తమిళనాడు ముదుమలై టైగర్ రిజర్వ్ లోని తెప్పకాడు ఏనుగుల శిబిరంలో 28 గజరాజులకు కరోనా పరీక్షలు చేశారు. శ్వాబ్ శాంపిల్స్ సేకరించి ఉత్తర ప్రదేశ్ లోని ఇన్జత్ నగర్ లోని భారత పశుసంవర్ధక పరిశోధనా సంస్థకు పంపించారు. ఏనుగుల నుంచి ట్రంప్ వాష్ శాంపిల్, రెక్టల్ స్వాబ్‌ను సేకరించారు. అయితే ఏనుగులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని, వాటికి కరోనా లక్షణాలు లేవని అంటున్నారు అధికారులు. ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే పరీక్షలు చేయించామని, వాటి బాగోగులు చూసుకునే మావటిలు, సహాయ సిబ్బంది మొత్తం 52 మందికి కరోనా వ్యాక్సిన్ వేయించామని తెలిపారు.
రష్యాలో జంతువుల వ్యాక్సిన్ కి భారీ డిమాండ్..
అటు రష్యాలో జంతువులకు కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. జంతువుల కోసం రూపొందించిన వ్యాక్సిన్ ‘కార్నివాక్ కోవ్’ ను తొలుత మిలట్రీ విభాగంలోని ఆర్మీ డాగ్స్ కి వేశారు. ప్రస్తుతం పిల్లి, కుందేలు వంటి పెంపుడు జంతువులకు కూడా రష్యాలో ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ టీకా ద్వారా 6నెలలు జంతువులకు కరోనా నుంచి రక్షణ ఉంటుందని ఆ దేశ వెటర్నరీ విభాగం వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జంతువుల వ్యాక్సిన్ కు కూడా భారీగా డిమాండ్ ఉంది. ప్రపంచంలోనే తొలిసారిగా రష్యాలో జంతువులకు వేస్తున్న ఈ వ్యాక్సిన్ త్వరలోనే ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి వస్తుందని అంటున్నారు.