థర్డ్ వేవ్ ను భారత్ తట్టుకోగలదా?

ప్రస్తుతం దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ నగరాల్లో కాస్త తగ్గి గ్రామాలపై విరుచుకుపడుతోంది. ఇంకా భారతీయ గ్రామాలు కోవిడ్ సెకండ్ వేవ్ తో తంటాలు పడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా త్వరలో మూడో వేవ్ కూడా వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడో వేవ్ వస్తే భారత్ తట్టుకోగలదా? మహమ్మారిని ఎదుర్కోడానికి అవసరమైన ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు భారతదేశానికి లేవని అర్థమవుతోంది. కానీ మూడో వేవ్ వస్తే పరిస్థితి మరింత ఘోరంగా మారొచ్చు. దీన్ని […]

Advertisement
Update:2021-06-04 11:41 IST

ప్రస్తుతం దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ నగరాల్లో కాస్త తగ్గి గ్రామాలపై విరుచుకుపడుతోంది. ఇంకా భారతీయ గ్రామాలు కోవిడ్ సెకండ్ వేవ్ తో తంటాలు పడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా త్వరలో మూడో వేవ్ కూడా వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడో వేవ్ వస్తే భారత్ తట్టుకోగలదా?

మహమ్మారిని ఎదుర్కోడానికి అవసరమైన ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు భారతదేశానికి లేవని అర్థమవుతోంది. కానీ మూడో వేవ్ వస్తే పరిస్థితి మరింత ఘోరంగా మారొచ్చు. దీన్ని అర్థం చేసుకోవడానికి బీహార్, కేరళలోని రెండు గ్రామీణ జిల్లాల ఉదాహరణను తీసుకుందాం. బీహార్‌లోని పూర్ణియాలో రోజుకి సుమారు వెయ్యి కేసులు నమోదవుతుండగా ఆ జిల్లాలో 199 ఆసుపత్రి పడకలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కేరళలోని కన్నూర్‌లో 15 వేల క్రియాశీల కేసులు నమోదవుతుంటే అక్కడ 5,043 వరకూ ఆసుపత్రి పడకలు ఉన్నాయి. ఓ మోస్తరుగా కేరళ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా ఇక్కడ పడకలు, వసతుల అవసరం ఉంది. ఇక బీహార్ లాంటి రాష్ట్రాల విషయానికొస్తే వెయ్యి కేసులకు కనీసం సగం పడకలు కూడా లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో వేవ్ వస్తే ఏంటి మన గతి అని చాలామంది విశ్లేషిస్తున్నారు. అందులోనూ కోవిడ్ విస్తరణ గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.
మహమ్మారిని ఎదర్కోవాలంటే.. ప్రతి మిలియన్ జనాభాకు కనీసం 5,000 ఆసుపత్రి పడకల ఏర్పాటు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచిస్తోంది. ఇది భారతదేశంలో అత్యుత్తమమైన రాష్ట్రంలో పడకల లభ్యత కంటే 4 రెట్లు ఎక్కువ.

ఇప్పటికే దేశంలోని ప్రజలు ఒకపక్క టీకాలు లేకుండా, మరో పక్క మానసిక భయంతో కృంగిపోతున్నారు. ఇలాంటి పొజిషన్ లో మూడో వేవ్ వస్తే.. కేసులు మరణాల సంఖ్య ఊహించని స్థాయిలో ఉండే ప్రమాదముంది. అందుకే దీన్ని ఎదుర్కోవడం కోసం ఆరోగ్య కేంద్రాలు, పడకలు, సంరక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు భారీగా, త్వరితగతిన అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో పాటు ప్రైవేటు రంగాల క్రియాశీల సహకారం కూడా అవసరం.

గ్రామీణ ప్రాంతాల్లోని మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ (పిహెచ్‌సి)లు ముందంజలో ఉన్నాయి. ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండడం అలాగే అక్కడ డాక్టర్లు అందుబాటులో ఉండడం లాంటివి సరిగ్గా పర్యవేక్షిస్తే.. గ్రామాలను కొంతవరకైనా కాపాడుకోవచ్చు. బీహార్‌లోని మధుబనిలోని పిహెచ్‌సిని ఒక సంవత్సరానికి పైగా వైద్యుడు సందర్శించకపోవడం వల్ల అది ఆవు పాక‌గా మారినట్లు సమాచారం.

వీటన్నింటికంటే ముందు ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం చేసే ఖర్చు చాలాచాలా తక్కువగా ఉంటోంది. ఆరోగ్యం కోసం దేశం చేస్తున్న ఖర్చు జీడీపీలో కేవలం 4% వరకు మాత్రమే ఉంది. ఇది పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే ఎక్కువ. కానీ చైనా (5%) కంటే తక్కువ. అలాగే అభివృద్ధి చెందిన దేశాలైన యుకె (10%) , యుఎస్ (17%) కంటే చాలా వెనుకబడి ఉంది. 2021-22 ఎకనామిక్ సర్వే ప్రకారం ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే దేశాల లిస్టులో భారత్ చిట్టచివరి పది స్థానాల్లో ఉంది. 189 దేశాల లిస్టులో భారత్ 179 స్థానంలో ఉంది. ఇది హైతీ, సుడాన్ లాంటి దాత-ఆధారిత దేశాల లీగ్‌లో భారత్‌ను నిలబెట్టింది.

ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 10,189 మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉన్నాడు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి 1,000 మందికి ఒక వైద్యుడు ఉండాలని చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ యుద్ధ ప్రాతిపదికన ప్రజారోగ్య వ్యవస్థను పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్స్, స్టాఫ్, డాక్టర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆక్సిజన్, టీకాలు వీటన్నింటిపై శ్రద్ధ పెట్టి వెంటనే యాక్షన్ తీసుకుంటే గానీ మూడోవేవ్ లో భారత్ గట్టెక్కగలుగుతోంది. లేకపోతే మరికొన్ని నెలల్లో తీవ్రమైన నష్టాన్ని చూస్తూ కూడా ఏమీ చేయలేని దుస్థితి వస్తుంది.

Tags:    
Advertisement

Similar News