కేంద్రం పాపం.. ప్రజలకు శాపం..

భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ పాలసీ అస్తవ్యస్తంగా ఉందని, ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. అసలు వ్యాక్సినేషన్ పై ఒక స్థిరమైన పాలసీ తీసుకొస్తారా లేదా అని గట్టిగానే మందలించింది. వ్యాక్సిన్ రేట్లలో ఎందుకీ తేడాలు, రాష్ట్రాలకిచ్చే వాటాల్లో ఎందుకీ వ్యత్యాసాలంటూ నిలదీసింది. అయినా కూడా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. చివరకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కేంద్రానికి లేఖలు రాస్తున్న సమయంలో ఇంకా వ్యాక్సినేషన్ ని గాడిలో పెట్టకపోవడం దారుణం. ప్రస్తుతం భారత్ […]

Advertisement
Update:2021-06-04 12:10 IST

భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ పాలసీ అస్తవ్యస్తంగా ఉందని, ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. అసలు వ్యాక్సినేషన్ పై ఒక స్థిరమైన పాలసీ తీసుకొస్తారా లేదా అని గట్టిగానే మందలించింది. వ్యాక్సిన్ రేట్లలో ఎందుకీ తేడాలు, రాష్ట్రాలకిచ్చే వాటాల్లో ఎందుకీ వ్యత్యాసాలంటూ నిలదీసింది. అయినా కూడా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. చివరకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కేంద్రానికి లేఖలు రాస్తున్న సమయంలో ఇంకా వ్యాక్సినేషన్ ని గాడిలో పెట్టకపోవడం దారుణం.

ప్రస్తుతం భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు కంపెనీల మధ్య యుద్దానికి దారి తీస్తోంది. కోవిడ్ టీకాలకు అనుమతిచ్చే విషయంలోనూ, వాటి సామర్థ్యాన్ని అంచనా వేసే విషయంలోనూ, ధరలను నిర్ణయించే విషయంలోనూ కేంద్రం ఆయా కంపెనీలపై ఏమాత్రం నియంత్రణ ధోరణి ఉంచలేదనే విషయం బయటపడుతోంది. తనకు తానుగానే విధించుకున్న పరిమితుల వల్ల కేంద్రం కంపెనీల వైపు బేలగా చూడాల్సి వస్తోంది. సామర్థ్యాన్ని పెంచుకుంటామంటూ కేంద్రం వద్ద నిధులు తీసుకుని కూడా.. సరఫరా మెరుగుపరచలేకపోతున్నాయి కంపెనీలు. అయినా కూడా కేంద్రం తన విస్తృత అధికారాలు ఉపయోగించడానికి వెనకాడుతోంది. దీని వెనక రాజకీయ ప్రయోజనాలున్నాయనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

కేంద్రం ఇచ్చే ఉచిత వ్యాక్సిన్ సెంట‌ర్లు టీకాలు లేక మూతబడి కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.800నుంచి 2వేల వరకు ఒక్కో డోసుని అమ్మేస్తున్నారు. మరి వారికి టీకాలు ఎక్కడినుంచి వస్తున్నాయి, కేంద్రం ఎందుకు కంపెనీల నుంచి తీసుకోలేకపోతోంది, రాష్ట్రాలకు ఎందుకు అందించలేకపోతోంది. టెలికం, వైమానిక రంగాల్లాగే.. ఇక్కడ కూడా అనివార్యంగా ప్రజలు ప్రైవేటు కేంద్రాలవైపు మొగ్గు చూపాల్సి వస్తుంది.

ఇప్పటి వరకూ భారత్ లో కేవలం 4 శాతం మందికి మాత్రమే డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. 12శాతం మంది కేవలం సింగిల్ డోస్ తీసుకున్నారంతే. సెకండ్ వేవ్ పోయి, థర్డ్ వేవ్ రావడానికి నాలుగు నెలలు మాత్రమే టైమ్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పటికైనా వ్యాక్సినేషన్ జోరందుకోకపోతే భారతీయల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. భారత్ లో బయటపడిన డెల్టా టైప్ కోవిడ్ వైరస్ పై ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్) సింగిల్ డోస్ అయితే 33శాతం, డబుల్ డోస్ అయితే 59.5 శాతం సమర్థంగా పనిచేస్తుందని ఓ బ్రిటన్ అధ్యయనం తేల్చి చెప్పింది. భారత్ లో ఇలాంటి గణాంకాలు అధికారికంగా బయటకు రాలేదు. కనీసం తమ టీకా సామర్థ్యం ఎంతో చెప్పకుండా కంపెనీలు ఉన్నప్పుడు, వాటికి రాయితీలు, ప్రోత్సాహకాలు అంటూ కేంద్రం వంతపాడటం విడ్డూరం కాక ఇంకేంటి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయలేకపోతున్న కేంద్రం, రాష్ట్రాల భుజాన బాధ్యత పెట్టి తప్పించుకోవాలని చూస్తోంది. రాష్ట్రాలన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉత్పత్తిదారుల చుట్టూ తిరగడం చూస్తుంటే.. ఈ రాష్ట్రాలన్నీ భారత దేశంలో ఉన్నాయా.. లేక అవన్నీ వేర్వేరు దేశాలా అనే అనుమానం వస్తుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణం.

ఇప్పటికైనా కేంద్రం తనకున్న అధికారాలను ఉపయోగించి, వ్యాక్సినేషన్ విషయంలో ఓ స్థిరమైన పాలసీని తీసుకొస్తే దేశ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే రాష్ట్రాల మధ్య కొట్లాటలు, వ్యాక్సిన్ కంపెనీల దోపిడీతో.. మన దేశంలో టీకా కార్యక్రమం పూర్తిగా అభాసుపాలవుతుంది.

Tags:    
Advertisement

Similar News