ఎన్నికల కమిషన్ సై అంటోంది.. కరోనా వదిలిపెడుతుందా..?
ఈ ఏడాది 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికలు కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు పరోక్ష కారణంగా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పశ్చిమబెంగాల్ లో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ వల్ల కేసుల సంఖ్య భారీగా పెరిగింది. సభలు, సమావేశాలు, సంబరాలపై ఎన్ని ఆంక్షలు విధించినా ఎవరూ లక్ష్యపెట్టలేదు. నాయకులకు అధికారం దక్కింది కానీ, ప్రజలను కరోనా వెంటాడింది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న సిబ్బంది కరోనా కారణంగా పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. […]
ఈ ఏడాది 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికలు కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు పరోక్ష కారణంగా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పశ్చిమబెంగాల్ లో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ వల్ల కేసుల సంఖ్య భారీగా పెరిగింది. సభలు, సమావేశాలు, సంబరాలపై ఎన్ని ఆంక్షలు విధించినా ఎవరూ లక్ష్యపెట్టలేదు. నాయకులకు అధికారం దక్కింది కానీ, ప్రజలను కరోనా వెంటాడింది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న సిబ్బంది కరోనా కారణంగా పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ఈ పాపం ఎవరి ఖాతాలో వేయాలి. రాజకీయ పార్టీలని నిందించాలా, లేక కరోనా కష్టంలోనూ విధి నిర్వహణలో తమకు తిరుగులేదనిపించుకున్న ఎన్నికల కమిషన్ ని తప్పుబట్టాలా..? మద్రాస్ హైకోర్టు పెట్టిన చీవాట్లు ఇంకా కమిషన్ కి గుర్తుండే ఉంటాయి.
ఎన్నికల వల్ల కరోనా విలయాన్ని ఇంకా మరచిపోకముందే.. వచ్చే ఏడాది జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర ఎన్నికల సంఘం సంకేతాలు పంపడం మరింత సంచలనంగా మారింది. పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి మార్చి 2022న ముగుస్తుంది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి మే నెలాఖరు వరకు గడువు ఉంది. ఈ ఐదు రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలు జరపాల్సి ఉంది. ఈ మినీ సంగ్రామానికి సిద్ధమంటూ సీఈసీ సుశీల్ చంద్ర ఇచ్చిన ఇంటర్వ్యూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
“ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. కరోనా వైరస్ విజృంభణ సమయంలోనూ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాం. దీంతో మాకు మరింత అనుభవం వచ్చింది. కరోనా విజృంభణ వేళ ఎన్నికల నిర్వహణలో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాం” అని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర వెల్లడించారు.
అనుకున్నంత ఈజీ కాదు..
దేశంలో అధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. దాదాపు 14.66కోట్ల మంది ఓటర్లున్నారు. పశ్చిమబెంగాల్ లాగా ఇక్కడ కూడా సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉన్నా.. కరోనా వేళ అది సాహసమనే చెప్పాలి. ఇక పంజాబ్ లో 2 కోట్లు, ఉత్తరాఖండ్ లో 78 లక్షలు, మణిపూర్ లో 19.58 లక్షలు, గోవాలో 11.45 లక్షల మంది ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఐదు రాష్ట్రాల్లో దాదాపుగా 17.84 కోట్ల మంది ఓటర్లు పోలింగ్ కోసం బయటకు రావాల్సి ఉంటుంది. సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభలపై కట్టుదిట్టమైన కట్టడి పెడితేనే ఎన్నికల నిర్వహణలో కరోనా ఉధృతిని అడ్డుకోవచ్చు. లేకపోతే భారత్ తనకు తానే మరోసారి కరోనా కోరల్లో చిక్కుకుంటుంది.