రాష్ట్రాలతో కేంద్రం వ్యాక్సిన్ వార్..

భారత్ లో టీకాల పంపిణీ ఇంకా వేగం పుంజుకోలేదు. స్పుత్నిక్ -వి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు, అటు కొవాక్సిన్, కొవిషీల్డ్ ఉత్పత్తి కూడా పెరగలేదు. ఈ దశలో టీకాలు అందుబాటులో లేక కొన్నిరోజులు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ విరామం ప్రకటించారు. తాజాగా కేంద్రం వ్యాక్సిన్ సరఫరా తిరిగి ప్రారంభించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు టీకా ప్రక్రియ మొదలు పెట్టాయి. అయితే ఈ సారి కూడా రాష్ట్రాలు అడుగుతున్నంత మేర టీకా డోసులు సరఫరా చేయడం కేంద్రానికి తలకు మించిన […]

Advertisement
Update:2021-06-01 08:11 IST

భారత్ లో టీకాల పంపిణీ ఇంకా వేగం పుంజుకోలేదు. స్పుత్నిక్ -వి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు, అటు కొవాక్సిన్, కొవిషీల్డ్ ఉత్పత్తి కూడా పెరగలేదు. ఈ దశలో టీకాలు అందుబాటులో లేక కొన్నిరోజులు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ విరామం ప్రకటించారు. తాజాగా కేంద్రం వ్యాక్సిన్ సరఫరా తిరిగి ప్రారంభించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు టీకా ప్రక్రియ మొదలు పెట్టాయి. అయితే ఈ సారి కూడా రాష్ట్రాలు అడుగుతున్నంత మేర టీకా డోసులు సరఫరా చేయడం కేంద్రానికి తలకు మించిన భారంలా మారింది. కనీసం ప్రత్యామ్నాయాలపై కూడా కేంద్రం దృష్టిపెట్టకపోవడంతో అనివార్యంగా రాష్ట్రాలతో గొడవలు పెరిగిపోతున్నాయి.

కేంద్రం వర్సెస్ ఢిల్లీ..
వ్యాక్సినేషన్ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంతో డైరెక్ట్ ఫైట్ కి దిగింది. కేంద్రం వైఖరిని కేజ్రీవాల్ నేరుగా తప్పుబడుతున్నారు. ఢిల్లీకి డోసుల పంపిణీలో అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారాయన. దీంతో హర్యానా ముఖ్యమంత్రి, బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్రానికి మద్దతుగా ముందుకొచ్చారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తోందని, కేజ్రీవాల్ అనవసర రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.

కేంద్రం వర్సెస్ రాజస్థాన్..
రాజస్థాన్‌లో 11.5లక్షల మోతాదుల కరోనా వ్యాక్సిన్‌ వృధా అయిందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో టీకా వృధాకు ఆ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమే కారణం అంటూ షెకావత్ మండిపడ్డారు. గ్లోబల్ టెండర్ల పేరుతో నాటకం ఆడారంటూ ఆయన సీఎం అశోక్ గెహ్లాట్ పై విమర్శలు సంధించారు. అయితే కేంద్ర మంత్రి ఆరోపణలను తీవ్రంగా ఖండించింది రాజస్థాన్ ప్రభుత్వం. తమ రాష్ట్రంలో వ్యాక్సిన్ వృధా 2 శాతం కంటే తక్కువగా ఉందని, ఇది జాతీయ సగటు 6 శాతం కంటే తక్కువ అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

కేంద్రం వర్సెస్ జార్ఖండ్
కేంద్రం నుంచి సరిపడా టీకా డోసులు జార్ఖండ్‌ కు అందడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ ఆరోపించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఇది పెద్ద అవరోధంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రాలే సొంతంగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారని సోరెన్‌ అభిప్రాయపడ్డారు. దేశం మొత్తం కరోనా మహమ్మారితో విలవిల్లాడుతుంటే, టీకాల సమీకరణ బాధ్యతను కేంద్రం, రాష్ట్రాలపైకి నెట్టడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారాయన. కేంద్రమే టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు సోరెన్.

కేంద్రం వర్సెస్ పశ్చిమబెంగాల్..
బెంగాల్ ప్రభుత్వం, కేంద్రం మధ్య ఉన్న సత్సంబంధాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పటికే ఎన్నికల అనంతర అల్లర్లపై కేంద్రం, రాష్ట్రం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా బెంగాల్ లో ప్రధాని మోదీ నిర్వహించిన తుఫాన్ సమీక్ష రాజకీయ తుఫాన్ కి కారణం అయింది. వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందని గతంలోనే మమతా ఆరోపించారు. వ్యాక్సినేషన్ సకాలంలో పూర్తి కావాలంటే కేంద్రం ఇలాంటి వివక్షపూరిత రాజకీయాలు వదిలేయాలని ఆమె డిమాండ్ చేశారు.

మొత్తమ్మీద.. కరోనా తొలిదశలో రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపిన కేంద్రం.. రెండో దశ వచ్చేసరికి తప్పుల్ని తనపై వేసుకోడానికి ఇష్టపడటంలేదు. లాక్ డౌన్ విషయంలో వేసిన వెనకడుగు, వ్యాక్సినేషన్ విషయంలో జరుగుతున్న ఆలస్యం వల్ల కేంద్రంతో రాష్ట్రాలకు గొడవలు మొదలై మరింత ముదిరిపోతున్నాయి.

Tags:    
Advertisement

Similar News