ఉచిత డోసులపై కేంద్రం చేతులెత్తేసినట్టేనా..?

కరోనా వారియర్స్ కి ఉచిత టీకాలన్నారు, ఆ తర్వాత తొలి విడత కేంద్రమే పూర్తి ఉచితంగా ఇస్తుందన్నారు, రెండో విడత బాధ్యత కూడా మాదేనన్నారు. ఇప్పుడు రాష్ట్రాలకిచ్చే కోటాలో కోత పెట్టేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచిత టీకాలివ్వాల్సిన బాధ్యత ఉన్నా కూడా కేంద్రం చెతులెత్తేస్తోంది. రాష్ట్రాలను సొంతంగా టీకాలు సమకూర్చుకోమని చెబుతూ, తమ వల్లకాదని పరోక్ష సంకేతాలిచ్చేసింది. ఇప్పుడు రాష్ట్రాలకిచ్చే కోటాని క్రమక్రమంగా తగ్గించేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్రం. భారత్ లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై […]

Advertisement
Update:2021-05-20 03:17 IST

కరోనా వారియర్స్ కి ఉచిత టీకాలన్నారు, ఆ తర్వాత తొలి విడత కేంద్రమే పూర్తి ఉచితంగా ఇస్తుందన్నారు, రెండో విడత బాధ్యత కూడా మాదేనన్నారు. ఇప్పుడు రాష్ట్రాలకిచ్చే కోటాలో కోత పెట్టేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచిత టీకాలివ్వాల్సిన బాధ్యత ఉన్నా కూడా కేంద్రం చెతులెత్తేస్తోంది. రాష్ట్రాలను సొంతంగా టీకాలు సమకూర్చుకోమని చెబుతూ, తమ వల్లకాదని పరోక్ష సంకేతాలిచ్చేసింది. ఇప్పుడు రాష్ట్రాలకిచ్చే కోటాని క్రమక్రమంగా తగ్గించేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్రం.

భారత్ లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఆ మధ్య సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ల రేట్లలో భారీ తేడా ఎందుకని, కేంద్రమే సబ్సిడీకి నేరుగా సేకరించి రాష్ట్రాలకు సరఫరా చేయొచ్చుకదా అని ప్రశ్నించింది. యాప్ లు, ఆధార్ కార్డులు అంటూ అడ్డుకట్ట వేయకుండా సామాన్యులకు కూడా టీకాలు అందుబాటులోకి తేవాలని తలంటింది. అయితే కేంద్రం మాత్రం వ్యాక్సినేషన్ విషయంలో తమ వాదనే సరైనదంటూ.. సుప్రీంకు ఓ అఫిడవిట్ సమర్పించి సరిపెట్టింది. ఇప్పుడు రాష్ట్రాలకిచ్చే వ్యాక్సిన్ కోటాని తగ్గించేస్తూ చేతులు దులుపుకుంటోంది.

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాల్సిన వ్యాక్సినేషన్ ను, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులోకి తేవడమే తప్పు అనే విమర్శలు గతంలో వినిపించాయి. అయితే ఆ తప్పుని సరిదిద్దుకోకుండా, ఇప్పుడు మరిన్ని తప్పులు చేస్తోంది కేంద్రం.

వ్యాక్సినేషన్‌ చరుగ్గా సాగేందుకు టీకాల సరఫరా మరింత పెరగాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఇచ్చే డోసులు తగ్గిపోతుండడం ఆందోళన కలిగించే పరిణామం. మే1నుంచి 18ఏళ్ల పైబడినవారికి టీకాలివ్వాలనే సరళీకృత విధానం అమలులోకి రాగా.. దాని ప్రకారం దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 50శాతాన్ని కేంద్రం సేకరించి రాష్ట్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు. దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాల్లో కనీసం పావు వంతు కూడా కేంద్రం, రాష్ట్రాలకు ఇవ్వలేకపోతోంది.
సరళీకృత విధానం అమలులోకి వచ్చాక మే-1నుంచి 15వతేదీ వరకు రాష్ట్రాలకు తొలివిడతలో 2,12,50,000 డోసులు పంపిణీ చేసింది కేంద్రం. రెండో విడతలో మే16నుంచి 31తేదీ వరకు 1,91,49,000 డోసులు మాత్రమే ఇచ్చారు. మూడో విడతలో ఆ సంఖ్య మరింత తగ్గింది. జూన్1-15 వరకు కేవలం 1,82,30,000 డోసులు మాత్రమే కేటాయించింది.

తొలివిడత కేటాయింపుల కంటే రెండో విడతలో 21.01 లక్షల మేర డోసులు తగ్గగా, మూడో విడతకు వచ్చే సరికి మొదటి విడత కంటే 30.20లక్షలు తగ్గిపోయాయి. మొత్తంగా రాష్ట్రాలకు ఈ మూడు దశల్లోనే 50లక్షలకు పైగా టీకా డోసులు తగ్గాయని స్పష్టమవుతోంది. అంటే రాను రాను వ్యాక్సినేషన్ బాధ్యతను పూర్తిగా రాష్ట్రాలపైకి నెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ నిర్ణయాధికారాన్ని, తద్వారా వచ్చే ఆర్థిక ఇబ్బందుల్ని కూడా పూర్తిగా రాష్ట్రాలకే బదలాయించి చేతులు దులుపుకున్న కేంద్రం.. ఇప్పుడు వ్యాక్సినేషన్ విషయాన్ని కూడా మొక్కుబడి వ్యవహారంగా మార్చేస్తోంది. భారమంతా రాష్ట్రాల నెత్తినే వేస్తోంది.

Tags:    
Advertisement

Similar News