ఈటల వర్సెస్ గంగుల.. బీసీ వార్..

హుజూరాబాద్ కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. తన వర్గం వారిని బ్లాక్ మెయిల్ చేసి, టీఆర్ఎస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ పరోక్షంగా మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈటల రాజేందర్. అటు ఈటల మాటలపై స్పందించిన గంగుల కూడా దమ్ముంటే రాజీనామా చేయాలంటూ ఈటలకు సవాల్ విసిరారు. తానూ బీసీ బిడ్డనేనని, బెదిరింపులకి భయపడనని స్పష్టం చేశారు గంగుల. అధికారం శాశ్వతం కాదు -ఈటల హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ తిరిగొచ్చిన ఈటల రాజేందర్, […]

Advertisement
Update:2021-05-18 09:37 IST

హుజూరాబాద్ కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. తన వర్గం వారిని బ్లాక్ మెయిల్ చేసి, టీఆర్ఎస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ పరోక్షంగా మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈటల రాజేందర్. అటు ఈటల మాటలపై స్పందించిన గంగుల కూడా దమ్ముంటే రాజీనామా చేయాలంటూ ఈటలకు సవాల్ విసిరారు. తానూ బీసీ బిడ్డనేనని, బెదిరింపులకి భయపడనని స్పష్టం చేశారు గంగుల.

అధికారం శాశ్వతం కాదు -ఈటల
హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ తిరిగొచ్చిన ఈటల రాజేందర్, తన అనుచరవర్గంతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. తన బొందిలో ప్రాణమున్నంత వరకు హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. బెదిరింపులకు దిగితే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. తనపై కక్షపూరితంగా వ్యవహరించొచ్చు కానీ, తన అనుచరుల్ని వేధించొద్దని హితవు పలికారు. టీఆర్ఎస్ చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. మంత్రి కాకముందు సంస్కారం లేకపోయినా పర్వాలేదు, ఆ తర్వాతయినా ఉండాలి కదా అని పరోక్షంగా గంగుల కమలాకర్ ను ప్రశ్నించారు ఈటల. 2023 తర్వాత నీకు అధికారం ఉండదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారో.. ఆ తర్వాత మేమూ ఆ పని తప్పకుండా చేస్తామని హెచ్చరించారు. హుజూరాబాద్‌ లో ఇప్పుడల్లా ఎన్నికలు జరగవని, ఒకవేళ జరిగితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు సకల జనులు, ఉద్యమకారులంతా తనకు అండగా ఉంటారని అన్నారు. హుజూరాబాద్ ప్రజల్ని రెచ్చగొట్టి, దాదాగిరి చేయాలనుకుంటే, తాను కరీంనగర్ కేంద్రంగా ఉద్యమం చేస్తానంటూ హెచ్చరించారు.

దమ్ముంటే రాజీనామా చెయ్- గంగుల
ఈటల హెచ్చరికలపై వెంటనే స్పందించారు మంత్రి గంగుల కమలాకర్. ప్రజలంతా తన వెంటే ఉన్నారని చెప్పుకునే ఈటల ప్రజా క్షేత్రంలో తీర్పు కోరాలని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పదవులకోసం పెదవులు మూసుకోనని ఈటల అన్న మాటల్ని గుర్తు చేస్తూ.. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసినా, ఇంకా ఎమ్మెల్యే పదవిని పట్టుకుని ఊగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఉండటం ఆత్మ గౌరవమా? ఆత్మ వంచనా అనేది ఈటలే ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకునే ఈటల.. డబ్బులు పంపి హుజూరాబాద్ నేతల్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు గంగుల. హుజూరాబాద్ నియోజకవర్గంలో తమిళనాడుకి చెందిన గ్రానైట్ క్వారీలు నడుస్తుంటే ఈటల చూస్తూ ఎందుకున్నారని ప్రశ్నించారు.

నేనూ బీసీ బిడ్డనే..
ఈటల అసైన్డ్ భూములు లాగేసుకున్నారని అధికారులు తేల్చారని, వాటిని వెంటనే ప్రభుత్వానికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు గంగుల కమలాకర్. “బిడ్దా అని మాట్లాడుతున్నావ్‌.. నేనూ బీసీ బిడ్డనే.. బెదిరిస్తే భయపడేవారు ఎవరూ లేరిక్కడ. నువ్వు హుజూరాబాద్‌ లో బీసీ.. హైదరాబాద్‌ లో ఓసీ. టీఆర్ఎస్ లో ఉన్నావు కాబట్టి ఇన్నాళ్లూ గౌరవించాం. 2018 ఎన్నికల్లో నేను ఓడిపోవాలని నిలువెత్తు విషం కక్కావ్. నా గెలుపుని జీర్ణించుకోలేకపోయావ్. 2018లో నేను గెలిచినప్పటి నుంచి నాతో ఆయన మాట్లాడలేదు. నా పార్టీని కాపాడుకోడానికి నేను కచ్చితంగా ప్రయత్నం చేస్తా” అని గంగుల కమలాకర్‌ అన్నారు.

Tags:    
Advertisement

Similar News