వారెవ్వా.. గోవా..

లాక్ డౌన్ విషయంలో నిర్ణయాలు తీసుకోడానికే కొన్నిచోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ముందూవెనకాడుతున్న సమయంలో గోవా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పోరులో మరో ముందడుగు వేసింది. గోవాలోని ప్రైవేట్ ఆస్పత్రులన్నిటినీ ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది. కోవిడ్ వైద్య సేవలు ఇకపై ప్రభుత్వ అధీనంలోనే అందిస్తామని ప్రకటించింది. కోవిడ్ కోసం గోవాలో ఎక్కడా ప్రైవేటు వైద్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఎందుకీ నిర్ణయం..? మహారాష్ట్ర, కర్నాటక, కేరళ తరహాలో గోవాలో కూడా కరోనా కేసులు […]

Advertisement
Update:2021-05-16 02:14 IST

లాక్ డౌన్ విషయంలో నిర్ణయాలు తీసుకోడానికే కొన్నిచోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ముందూవెనకాడుతున్న సమయంలో గోవా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పోరులో మరో ముందడుగు వేసింది. గోవాలోని ప్రైవేట్ ఆస్పత్రులన్నిటినీ ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది. కోవిడ్ వైద్య సేవలు ఇకపై ప్రభుత్వ అధీనంలోనే అందిస్తామని ప్రకటించింది. కోవిడ్ కోసం గోవాలో ఎక్కడా ప్రైవేటు వైద్యం అవసరం లేదని తేల్చి చెప్పింది.

ఎందుకీ నిర్ణయం..?
మహారాష్ట్ర, కర్నాటక, కేరళ తరహాలో గోవాలో కూడా కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగాయి. దీంతో అక్కడ లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం, ప్రైవేట్‌ ఆస్పత్రులకు కీలక ఆదేశాలిచ్చింది. ఆస్పత్రులన్నిటిలో కోవిడ్ బాధితులకు 50శాతం బెడ్లు కేటాయించాలని సూచించింది. కోవిడ్ పేరుతో ఆస్పత్రికి వచ్చేవారికి ఎలాంటి వైద్య సహాయం ఇవ్వకుండా తిప్పి పంపకూడదని చెప్పింది. అయితే ఈ ఆదేశాలను దాదాపుగా అన్ని ప్రైవేటు ఆస్పత్రులు బేఖాతరు చేశాయి. దీంతో గోవా సర్కారు కఠిన నిర్ణయం తీసుకుంది. కోవిడ్ చికిత్సకు కేటాయించిన ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. నేటినుంచి ఈ ఆస్పత్రులన్నీ ప్రభుత్వ అధీనంలో పనిచేస్తాయని గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించారు. ఈ ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చుని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఆస్పత్రి సిబ్బంది విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవు. పాత సిబ్బంది యథా ప్రకారం ఆస్పత్రుల్లో కొనసాగుతారు. అయితే కొంతకాలం ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ, నిర్ణయాధికారాలు మాత్రం ప్రభుత్వానికి దఖలు పడతాయి. ప్రతి ఆస్పత్రిని ఒక ప్రభుత్వ అధికారి పర్యవేక్షిస్తారు.

గోవా భౌగోళిక పరిస్థితులు, జనాభా దృష్ట్యా.. ఆ రాష్ట్రానికి ఈ విధానం సరిపోయే అవకాశం ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల సంఖ్య పరిమితంగా ఉంటుంది కాబట్టి, వాటిని ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుని నడిపించడం పెద్ద సమస్యేమీ కాదు. అయితే ఇతర రాష్ట్రాలు మాత్రం ఈ సాహసం చేయడం కష్టం. జనాభా, ఆస్పత్రుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రయత్నాలు చేయకపోవచ్చు. ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రైవేటు ఆస్పత్రుల్లో కచ్చితంగా కోవిడ్ వార్డుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంది. ఆరోగ్యశ్రీ పథకం కింద కోవిడ్ చికిత్స అంతా ప్రభుత్వమే భరిస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రులకు కూడా కోవిడ్ చికిత్సకు గరిష్ట ఫీజులు నిర్థారించింది.

Tags:    
Advertisement

Similar News