అంబులెన్స్ లు ఆపడానికి వీల్లేదు -తెలంగాణ హైకోర్టు..

ఆస్పత్రుల అనుమతులు లేవనే కారణంగా తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లో అంబులెన్స్ లు ఆపడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అంబులెన్స్ లు ఆపే హక్కు ఎవరిచ్చారంటూ మండిపడింది. ముందస్తు అనుమతి లేనిదే కొవిడ్ రోగుల్ని తెలంగాణలోకి రానివ్వబోమంటూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాలతో సహా కేంద్రానికి కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ […]

Advertisement
Update:2021-05-14 15:05 IST

ఆస్పత్రుల అనుమతులు లేవనే కారణంగా తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లో అంబులెన్స్ లు ఆపడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అంబులెన్స్ లు ఆపే హక్కు ఎవరిచ్చారంటూ మండిపడింది. ముందస్తు అనుమతి లేనిదే కొవిడ్ రోగుల్ని తెలంగాణలోకి రానివ్వబోమంటూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాలతో సహా కేంద్రానికి కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్‌ 17వ తేదీకి వాయిదా వేసింది.

హైదరాబాద్‌ కు వస్తున్న అంబులెన్స్‌ లను సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారంటూ విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి వెంకట కృష్ణారావు దాఖలు చేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

హైదరాబాద్ ఆస్పత్రుల్లో పడకలు అందుబాటులో లేక బాధితులు ఇబ్బంది పడుతున్నారని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఆస్పత్రిలో పడకలు ఉంటేనే ఇతర రాష్ట్రాల రోగులు తెలంగాణకు రావాలని ముందుగానే సూచించామని తెలంగాణ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ కోర్టుకి తెలిపారు. ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధించాయని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం అంబులెన్స్‌ లను ఏ రాష్ట్రం ఆపలేదని తెలిపింది. కారణం ఏదైనా అంబులెన్స్‌ లను ఆపే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించింది. ఇది రాజ్యాంగం, చట్టాలు, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కాదా? అని మండిపడింది. జాతీయ రహదారులపై రాకపోకలు నియంత్రించే అధికారం రాష్ట్రానికి ఎక్కడిదని ప్రశ్నించింది. ఇలా చేస్తే జాతీయ రహదారుల చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది.

తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‌ వస్తున్నవారు కూడా బెడ్లు ముందుగా రిజర్వ్‌ చేసుకుంటున్నారా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైదరాబాద్ ఆస్పత్రులపై భారం పడుతుందని చెబుతున్న ప్రభుత్వం తెలంగాణలోని ఇతర జిల్లాల అంబులెన్స్ లపై కూడా నిషేధం విధించిందా అని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల ప్రజలను అడ్డుకోవడం రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘనే అవుతుందని అడ్వొకేట్ జనరల్ శ్రీరాం ఏపీ తరపున వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోర్టుకి తెలిపారు.

అందరి వాదనలు విన్న ధర్మాసనం.. అంబులెన్స్ లు ఆపడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. గతంలో అంబులెన్స్ లు ఆపొద్దని తాము ఆదేశాలిచ్చినా.. మరో రూపంలో ఉత్తర్వులివ్వడం కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి ఉంటుంది ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇకపై అంబులెన్స్ లను అడ్డుకోడానికి ఇంకే రూపంలోనూ ప్రయత్నించొద్దని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇదే ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News