తప్పు కేంద్రానిది.. నిందలు రాష్ట్రాలపైనా..?

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న మారణహోమానికి బాధ్యులెవరు..? అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఎలా జరుగుతోంది..? వ్యాక్సినేషన్ ఆలస్యం కావడం వల్ల సెకండ్ వేవ్ విజృంభణ అడ్డుకోలేకపోతున్నామని అంటున్నారు, మరి వ్యాక్సినేషన్ బాధ్యత ఎవరిది? సకాలంలో రాష్ట్రాలకు టీకాలు సరఫరా చేయాల్సిన కేంద్రం ఏం చేస్తోంది..? వ్యాక్సిన్ తయారీ అనుమతులు, రాష్ట్రాలకు కోటా కేటాయింపులు, సరఫరా.. అన్నీ కేంద్రం అధీనంలోనే ఉన్నా.. ఆలస్యానికి రాష్ట్రాలను నిందిస్తున్నారు మోదీ. చిన్నా చితకా వేస్టేజీపై ఏకంగా ముఖ్యమంత్రుల సమావేశం […]

Advertisement
Update:2021-05-07 13:11 IST

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న మారణహోమానికి బాధ్యులెవరు..? అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఎలా జరుగుతోంది..? వ్యాక్సినేషన్ ఆలస్యం కావడం వల్ల సెకండ్ వేవ్ విజృంభణ అడ్డుకోలేకపోతున్నామని అంటున్నారు, మరి వ్యాక్సినేషన్ బాధ్యత ఎవరిది? సకాలంలో రాష్ట్రాలకు టీకాలు సరఫరా చేయాల్సిన కేంద్రం ఏం చేస్తోంది..? వ్యాక్సిన్ తయారీ అనుమతులు, రాష్ట్రాలకు కోటా కేటాయింపులు, సరఫరా.. అన్నీ కేంద్రం అధీనంలోనే ఉన్నా.. ఆలస్యానికి రాష్ట్రాలను నిందిస్తున్నారు మోదీ. చిన్నా చితకా వేస్టేజీపై ఏకంగా ముఖ్యమంత్రుల సమావేశం పెట్టి మరీ నిందలు మోపుతున్నారు. టీకాలు ఇవ్వకుండా, వ్యాక్సినేషన్ ఆలస్యానికి పరోక్ష కారణంగా నిలిచి, రాష్ట్రాలను బాధ్యులు చేసి మాట్లాడటం ఎంతవరకు సబబు..?

ఆక్సిజన్ కొరతకు కారణం ఎవరు..?
భారత్ లో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నాయి. డిమాండ్ కి తగ్గట్టు సరఫరా లేదు. కొన్ని చోట్ల ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి సామూహిక మారణహోమం జరుగుతోంది. ఆక్సిజన్ ఉత్పత్తికి కావలసిన అనుమతులు, ఉత్పత్తి, నియంత్రణ, రవాణా, సరఫరా అన్నీ కేంద్రప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి. రాష్ట్రాల‌కు కోటా కేటాయిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. ఇలాంటి సందర్భంలో విదేశాలనుంచి ట్యాంకర్ల కొనుగోలుని కూడా రాష్ట్రాలకు వదిలేసిన కేంద్రం అసలు ఏం చేస్తున్నట్టు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ఎందుకు దులిపేసుకుని వెళ్తున్నట్టు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి ఎంత ఆక్సిజన్ అవసరం ఉంది, ఎంత సరఫరా చేస్తున్నారు, ఎంత చేయగలరు, ఎంత దిగుమతి చేసుకుంటున్నారు అనే లెక్క అసలు కేంద్రం వద్ద ఉందా?

మందుల బ్లాక్ మార్కెట్ కి కారణం ఎవరు..?
కరోనా వైద్యంలో ఉపయోగించే కీలక మందులన్నీ బ్లాక్ మార్కెట్ కి తరలుతున్నాయి. దీనికి కారణం ఎవరు? ఎగుమతులపై పూర్తిగా నిషేధం విధించి, మార్కెట్ లో అవసరానికి తగ్గట్టు మందులు అందుబాటులో ఉంచితే ఈ పరిస్థితి వచ్చేదా? ప్రాణ రక్షణకు అత్యవసరమైన లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉత్పత్తి అనుమతులు, కేటాయింపు, సరఫరా కూడా కేంద్రం నియంత్రణలోనే ఉంది. మరి మందుల బ్లాక్ మార్కెట్ కి కారణం కేంద్రం కాదా..? కీలకమైన ఆక్సిజన్, వ్యాక్సిన్, ప్రాణ రక్షణకు అత్యవసరమైన మందులతో సహా అన్నీ కేంద్రం తన నియంత్రణలో పెట్టుకొని రాష్ర్టాలకు సకాలంలో సరఫరా చేయడం లేదు. సొంతంగా సమకూర్చుకునే అధికారం రాష్ట్రాలకు లేదు. ఈ దశలో కరోనా మారణహోమానికి కేంద్రమే బాధ్యత వహించాలి కానీ, రాష్ట్రాలు కాదు అనే వాదన మొదలైంది.

ఎన్నికలు.. కుంభమేళాలు..
సెకండ్ వేవ్ ఉధృతి మొదలవుతున్న దశలో 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వచ్చే సరికి సెకండ్ వేవ్ చుట్టు ముట్టేసింది. కనీసం ఎన్నికలను వాయిదా వేయడానికి కేంద్రం చొరవ తీసుకోకపోవడం దేనికి సంకేతం. బెంగాల్ లాంటి చోట్ల 8 విడదల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియతో బీజేపీకి వచ్చిన లాభం ఏంటి? ప్రజల ప్రాణాల్ని బలిపెట్టడం తప్ప ఇంకేమైనా ఫలితం ఉందా..? ఎన్నికల విధుల్లో పాల్గొన్న వందలాది మంది సిబ్బంది మరణానికి కారణం ఎవరు? ఎన్నికల కారణంగా, ప్రచారాల్లో పాల్గొని కరోనా అంటించుకుని బాధపడుతున్న లక్షలాదిమంది సామాన్యుల కష్టాలకు కేంద్రం బాధ్యత వహించదా..? కుంభమేళా లాంటి మతపరమైన కార్యక్రమాలకు కేంద్రం అనుమతులివ్వడం, ఎవరి ప్రాపకం కోసం? చేసిందంతా చేసి.. ఇప్పుడు నిందను రాష్ట్రాలపైకి నెట్టాలని చూడటం ఎంతవరకు సమంజసం?

ప్రజా ఆరోగ్యం, వైద్యం అనేవి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత. కానీ కరోనా వంటి వైపరీత్యాలు సంభవించినపుడు రాష్ట్రాలకు కేవలం నామమాత్రపు అధికారాలు ఇచ్చి సర్వ అధికారాలు తన ఆధీనంలో ఉంచుకుంటోంది కేంద్రం. తొలి దశలో ఉరుములేని పిడుగులా లాక్ డౌన్ ప్రకటించి కేంద్రం తన విశేష అధికారాలు ఉపయోగించుకుంది. రెండో దశలో మాత్రం చేతులెత్తేసి భారీ ప్రాణ నష్టానికి కారణం అవుతోంది.

వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలైన కొత్తల్లో ప్రపంచానికే ఆదర్శం మనమేనంటూ గొప్పలు చెప్పుకున్నారు ప్రధాని మోదీ. అనేక దేశాలకు వ్యాక్సిన్ సరఫరా మనమే చేస్తున్నామంటూ బాకాలు ఊదుకున్నారు. పేద దేశాలకు ఉచితంగా టీకా సరఫరా చేసి హీరో అనిపించుకోవాలనుకున్నారు. కరోనాని తరిమికొట్టిన తొలిదేశం మనదేనంటూ అన్నిటికీ గేట్లు బార్లా ఎత్తేశారు. మరిప్పుడు ఏం జరిగింది. తప్పు చేశారు సరే.. ఆ తప్పు సరిదిద్దుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారా అంటే అదీ లేదు. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు, మరణాలు, వైద్య సౌకర్యాలలో లోపాలు, వ్యాక్సినేషన్ అరకొర నిల్వలు.. మోదీ అసమర్థతను చాటి చెబుతున్నాయి. కనీసం ఇప్పుడైనా మోదీ నోరు మెదుపుతారా..? మోదీ దిగిపొండి అంటూ వెల్లువెత్తుతున్న నినాదాలకు ఆయన బదులు చెప్పగలరా..?

ప్రతిపక్ష ముక్త భారత్ కాదు, మోదీ అసలు లక్ష్యం ప్రజా ముక్త్ భారత్ అని వినిపిస్తున్న విమర్శలకు మోదీ జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

Tags:    
Advertisement

Similar News