కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో అభ్యర్థులకు షాక్..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ, మే 2న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం సహా.. పలు ఉప ఎన్నికల ఫలితాలకోసం కౌంటింగ్ నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. అయితే ఇప్పటికే ఎన్నికల సభలు, ర్యాలీలు, పలు అంశాలపై మద్రాస్ హైకోర్టు సహా.. ఇతర న్యాయస్థానాలు ఎన్నికల సంఘం తీరుని ఆక్షేపించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మే 2న నిర్వహించే ఎన్నికల […]
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ, మే 2న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం సహా.. పలు ఉప ఎన్నికల ఫలితాలకోసం కౌంటింగ్ నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. అయితే ఇప్పటికే ఎన్నికల సభలు, ర్యాలీలు, పలు అంశాలపై మద్రాస్ హైకోర్టు సహా.. ఇతర న్యాయస్థానాలు ఎన్నికల సంఘం తీరుని ఆక్షేపించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మే 2న నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ రోజున పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి రావడంపై కఠిన ఆంక్షలు విధించింది. అభ్యర్థులు కానీ, ఏజెంట్లు కానీ.. కౌంటింగ్ కేంద్రంలోకి అడుగుపెట్టాలంటే.. తప్పని సరిగా కౌంటింగ్ సమయానికి 48 గంటల ముందుగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ కానీ, కరోనా నెగటివ్ రిపోర్టు కానీ, కలిగి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అప్పుడే కౌంటింగ్ హాల్ లోకి అనుమతి ఇస్తామని మార్గదర్శకాలు విడుదల చేసింది.
పశ్చిమ బెంగాల్ లో చివరి విడత ఎన్నికలు మిగిలి ఉండగా.. తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతోపాటు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు పూర్తయ్యాయి. బెంగాల్ లో ఈనెల 29న చివరి దశ పోలింగ్ పూర్తయితే.. అన్నిచోట్లా మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. ఈ దశలో కౌంటింగ్ సందర్భంగా కరోనా పుట్ట పగిలే అవకాశం ఉందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు కూడా వెనకడుగు వేస్తున్నారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం చివరి ఘట్టాన్ని పగడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా అభ్యర్థులు, ఏజెంట్ల విషయంలో నిబంధనలు కఠినతరం చేసింది. కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ లేదా, కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్.. ఏదో ఒకటి ఉంటేనే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామని తేల్చి చెప్పింది.
కౌంటింగ్ కు 48 గంటల ముందు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే అభ్యర్థులు, లేదా వారి ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒకవేళ రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్ తీసుకుని వస్తే మాత్రం కనీసం 48 గంటల ముందుగా రెండు డోసులు టీకా పొందినట్టు సర్టిఫికెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపుకి మూడు రోజుల ముందు కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను అధికారులకు అందించాల్సి ఉంటుంది. వీరిలో ఎవరైనా సర్టిఫికెట్ తీసుకు రావడంలో విఫలం అయితే వెంటనే వెనక్కి పంపించేస్తారు. మరోవైపు ఫలితాల ప్రకటన రోజున అన్ని విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై ఎన్నికల సంఘం ఈ పాటికే నిషేధం విధించింది.