తిరుపతి బరిలో రాజీనామాల వేడి..

తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఊపందుకున్నాయి. గతంలో అమరావతి రెఫరెండం అంటూ చంద్రబాబు వైసీపీ నేతలకు రాజీనామా సవాల్ విసిరారు. కనీసం రెండు జిల్లాల ఎమ్మెల్యేలయినా రాజీనామా చేయండి అంటూ కాస్త వెసులుబాటు కూడా ఇచ్చారు. కానీ చంద్రబాబు సవాళ్లను ఎవరూ పట్టించుకోనే లేదు. తాజాగా మరోసారి చంద్రబాబు వైసీపీ ఎంపీలకు, సీఎం జగన్ కి రాజీనామా సవాల్ విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం తమ పార్టీ ఎంపీలంతా రాజీనామా […]

Advertisement
Update:2021-04-11 10:24 IST

తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఊపందుకున్నాయి. గతంలో అమరావతి రెఫరెండం అంటూ చంద్రబాబు వైసీపీ నేతలకు రాజీనామా సవాల్ విసిరారు. కనీసం రెండు జిల్లాల ఎమ్మెల్యేలయినా రాజీనామా చేయండి అంటూ కాస్త వెసులుబాటు కూడా ఇచ్చారు. కానీ చంద్రబాబు సవాళ్లను ఎవరూ పట్టించుకోనే లేదు. తాజాగా మరోసారి చంద్రబాబు వైసీపీ ఎంపీలకు, సీఎం జగన్ కి రాజీనామా సవాల్ విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం తమ పార్టీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని, వైసీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి కలసి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.

మంత్రి పెద్దిరెడ్డి సవాల్..
ప్రత్యేక హోదాకోసం రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరిన చంద్రబాబుకి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పనబాక గెలిస్తే.. వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని అన్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలిస్తే టీడీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. టీడీపీ ఎంపీలతో పాటు, వారి వద్ద ఉన్న రఘురామ కృష్ణం రాజు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి. పాచిపోయిన లడ్డూ ఇప్పుడు పవన్ ‌కు తాజా లడ్డూ అయిందా? అని ప్రశ్నించారు. ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదని విమర్శించారు.

నిజంగా తిరుప‌తిలో టీడీపీ గెలుస్తుంద‌నే ధీమా చంద్ర‌బాబులో ఉంటే త‌న స‌వాల్‌ ను స్వీక‌రించాల‌ని డిమాండ్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి. అర్థంపర్థం లేని విమర్శలతో త‌మ‌పై బుర‌దజ‌ల్లే కార్య‌క్ర‌మానికి ఇక‌నైనా చంద్ర‌బాబు ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని హిత‌వు ప‌లికారు. వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలే తమ బలమని ఆయ‌న చెప్పుకొచ్చారు. క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా జ‌గ‌న్ ప్ర‌చార స‌భ‌ను ర‌ద్దు చేసుకుంటే, దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారని, టీడీపీ నేతల దివాళాకోరు తనానికి ఇదే నిదర్శనం అని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి.

Tags:    
Advertisement

Similar News