నామినేషన్ల కోలాహలం.. తిరుపతి బరిలో జనసేన రెబల్..

తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు వేశారు. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి, నెల్లూరు కలెక్టరేట్ లో మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నెల్లూరులో భారీ ర్యాలీ చేపట్టి గురుమూర్తికి […]

Advertisement
Update:2021-03-30 02:10 IST

తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు వేశారు. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి, నెల్లూరు కలెక్టరేట్ లో మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నెల్లూరులో భారీ ర్యాలీ చేపట్టి గురుమూర్తికి మద్దతుగా తరలి వచ్చారు.

బీజేపీ కూడా వైసీపీకి దీటుగా నెల్లూరులో ర్యాలీ చేపట్టి తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేసింది. అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా.. సీఎం రమేష్, జీవీఎల్‌ నరసింహారావు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇతర ముఖ్య నేతలు తరలి వచ్చారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం చలవేనంటూ బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. వైసీపీని గెలిపిస్తే ఉపయోగం లేదని, బీజేపీకి అవకాశమివ్వాలని కోరారు. నెల్లూరు కలెక్టరేట్ లో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ మూడు సెట్ల నామినేషన్లు వేశారు.

ఇక కాంగ్రెస్ తరపున ఆరుసార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ నేత చింతా మోహన్ కూడా ఉప ఎన్నిక బరిలో నిలిచారు. తన భార్య వెంటరాగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నాయకులెవరూ ఆయన నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాకపోవడం విశేషం. సీపీఎం అభ్యర్థి నెల్లూరు యాదగిరి కూడా సోమవారమే నామినేషన్ లాంఛనాన్ని పూర్తి చేశారు.

జనసేన రెబల్..?
బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేసిన రోజునే.. ఆ పార్టీ మిత్రపక్షం జనసేన రెబల్ అభ్యర్థిగా చెప్పుకుంటున్న పల్లిపాటి రాజా అనే వ్యక్తి కూడా తిరుపతి ఉప ఎన్నిక కోసం నామినేషన్ వేయడం విశేషం. పల్లిపాటి రాజా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి అసెంబ్లీ స్థానానికి బీఎస్పీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జనసేన-బీఎస్పీ మిత్రపక్షాలు. పొత్తులో భాగంగా జనసేన మద్దతుతో బీఎస్పీ తరపున ఆయన బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిని మించి ఓట్లు సాధించారు. ఇప్పుడు నామినేషన్ వేసేందుకు సైతం జనసేన జెండాలతో పల్లిపాటి రాజా కదలిరావడం విశేషం. అయితే బీజేపీకానీ, జనసేన కానీ ఎక్కడా రెబల్ అభ్యర్థి గురించి స్పందించలేదు. అనవసరంగా ఆ విషయాన్ని పెద్దది చేసి, రెబల్ కు ప్రచారం ఇవ్వడం ఎందుకని సైలెంట్ గా ఉండిపోయారు నేతలు. అయితే తనకి తాను రెబల్ అభ్యర్థినని చెప్పుకుంటున్న రాజా మాత్రం తిరుపతిలో జనసేనకు అవకాశం ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని, ఆ పార్టీకి బుద్ధి చెప్పాలంటే అసలు సిసలు జనసేన కార్యకర్తలంతా తనకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మరి ఈ నామినేషన్ ఎన్నిక వరకు ఉంటుందా, మధ్యలోనే ఉపసంహరణకు గురవుతుందా అనేది తేలాల్సి ఉంది. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి అందరికంటే ముందుగా తన నామినేషన్ సమర్పించి, ప్రచార రంగంలోకి దిగిపోగా, సోమవారం ప్రధాన పార్టీల నేతలంతా నామినేషన్ వేసి ప్రచార పర్వానికి సిద్ధమయ్యారు.

Tags:    
Advertisement

Similar News