సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. ఏప్రిల్ 1 నుంచి భారత్ లో కొత్త రూల్స్..
భారత్ లో సెకండ్ వేవ్ ప్రభావం రోజు రోజుకీ ఎక్కువవుతోంది. నిన్న మొన్నటి వరకూ కేవలం మహారాష్ట్రలో మాత్రమే కేసులు పెరుగుతున్నాయని అనుకున్నారంతా. ఆ ప్రభావం నేడు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. తెలంగాణలో స్కూల్స్ మూతబడ్డాయి. అటు కేరళలో కూడా రాత్రి కర్ఫ్యూ మొదలైంది. ఏపీలోని జూనియర్ కాలేజీల్లో కరోనా విజృంభణతో హాస్టల్స్ మూతబడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా పరిస్థితిని మరోసారి సమీక్షించిన హోంశాఖ.. ఏప్రిల్ 1నుంచి అమలులోకి వచ్చే విధంగా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఏప్రిల్ […]
భారత్ లో సెకండ్ వేవ్ ప్రభావం రోజు రోజుకీ ఎక్కువవుతోంది. నిన్న మొన్నటి వరకూ కేవలం మహారాష్ట్రలో మాత్రమే కేసులు పెరుగుతున్నాయని అనుకున్నారంతా. ఆ ప్రభావం నేడు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. తెలంగాణలో స్కూల్స్ మూతబడ్డాయి. అటు కేరళలో కూడా రాత్రి కర్ఫ్యూ మొదలైంది. ఏపీలోని జూనియర్ కాలేజీల్లో కరోనా విజృంభణతో హాస్టల్స్ మూతబడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా పరిస్థితిని మరోసారి సమీక్షించిన హోంశాఖ.. ఏప్రిల్ 1నుంచి అమలులోకి వచ్చే విధంగా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఏప్రిల్ 30 వరకు ఇవి అమలులో ఉంటాయి.
మళ్లీ జరిమానాలు మొదలు..
బహిరంగ ప్రదేశాలు, ఆఫీస్ లు, మార్కెట్లు.. తదితర రద్దీప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలి. మాస్క్ లు, సామాజికదూరం పాటించేలా చూడాలి. నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే జరిమానా విధించాలి.
రవాణాపై ఆంక్షలు లేవు..
రవాణాపై ఆంక్షలు విధించి గతంలో కేంద్రం పూర్తిగా ఇబ్బంది పడింది. దీంతో మరోసారి ఆ తప్పు చేసేందుకు వెనకాడుతోంది. రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల రాకపోకలపై ఎలాంటి నిషేధం విధించొద్దని కేంద్రం సూచించింది. వ్యక్తులు, సరకు రవాణా కోసం రాష్ట్రాల మధ్య ఎలాంటి అనుమతులు కూడా అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే స్థానిక పరిస్థితులను బట్టి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించుకోవచ్చని వెసులుబాటునిచ్చింది.
మళ్లీ కంటైన్మెంట్ జోన్ లు..
బఫర్ జోన్, కంటైన్మెంట్ జోన్, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్.. ఈ పదాలన్నీ మళ్లీ వాడుకలోకి వచ్చేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రాలలో పాజిటివ్ కేసులను బట్టి కంటైన్మెంట్ జోన్ లను ప్రకటించాలని కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో పొందు పరచాలని, కంటైన్మెంట్ జోన్ లలో ఇంటింటి సర్వే చేపట్టి పరీక్షలు చేయాలని ఆదేశించింది. కంటైన్మెంట్ జోన్ వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. అయితే ప్రయాణికుల రైళ్లు, విమానాలు, మెట్రో రైళ్లు, విద్యాసంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పార్కులు, జిమ్ సెంటర్లలో నిర్దేశిత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని సీజ్ చేసేందుకు సైతం వెనకాడకూడదు.
పరీక్షలు పెంచాలి, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆర్టీటీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలని, పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందించాలని, ఆ తర్వాత వారు ఎవరెవరిని కలిశారో గుర్తించి వారికి కూడా కరోనా టెస్ట్ లు చేయాలని సూచించింది కేంద్రం.
టీకా పంపిణీలో నెమ్మదిగా ఉన్న రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. అర్హులైన వారందరూ టీకా వేయించుకునేలా చూడాలని చెప్పింది.