నోరు జారిన సీఎం.. చీవాట్లు పెడుతున్న మహిళా లోకం..

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కొన్ని సార్లు చెప్పే విధానం కూడా చీవాట్లు తెచ్చిపెడుతుంది. ఇప్పుడిలాగే చిక్కుల్లో పడ్డారు ఉత్తరాఖండ్ నూతన సీఎం తిరత్ సింగ్ రావత్. పదవి చేపట్టి వారం రోజులు తిరగకముందే ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఏకంగా బీజేపీ అధిష్టానానికే తలనొప్పులు తెచ్చిపెట్టాయి. మహిళలు చిరిగిన జీన్స్ వేసుకుని, మోకాళ్లు చూపెడుతూ నగ్నత్వం వైపు అడుగులేస్తున్నారని, పాశ్చాత్యులంతా మన సంస్కృతిని మెచ్చుకుంటున్న ఈ సందర్భంలో భారతీయ మహిళల వస్త్రధారణ లైంగిక […]

Advertisement
Update:2021-03-19 05:16 IST

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కొన్ని సార్లు చెప్పే విధానం కూడా చీవాట్లు తెచ్చిపెడుతుంది. ఇప్పుడిలాగే చిక్కుల్లో పడ్డారు ఉత్తరాఖండ్ నూతన సీఎం తిరత్ సింగ్ రావత్. పదవి చేపట్టి వారం రోజులు తిరగకముందే ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఏకంగా బీజేపీ అధిష్టానానికే తలనొప్పులు తెచ్చిపెట్టాయి. మహిళలు చిరిగిన జీన్స్ వేసుకుని, మోకాళ్లు చూపెడుతూ నగ్నత్వం వైపు అడుగులేస్తున్నారని, పాశ్చాత్యులంతా మన సంస్కృతిని మెచ్చుకుంటున్న ఈ సందర్భంలో భారతీయ మహిళల వస్త్రధారణ లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉందని తిరత్ సింగ్ రావత్ రెండు రోజుల క్రితం కామెంట్ చేశారు. దీంతో సహజంగానే మహిళా లోకం భగ్గుమంది. అయితే ఈసారి అలా ఇలా కాదు, తమ నిరసనను తెలియజేయడంలో మహిళలు మహోగ్ర రూపం చూపిస్తున్నారు. కావాలని జీన్స్ ప్యాంట్ లు చించుకుని మరీ వాటితో ఫొటోలు దిగి సీఎం రావత్ ని సోషల్ మీడియాలో చెడామడా తిట్టేస్తున్నారు. వస్త్రధారణ వల్ల ఆడవారిపై అఘాయిత్యాలు జరగవని, అదే నిజమైతే నెలల పసిపిల్లలు, పండు ముసలివారి వస్త్రధారణలో రెచ్చగొట్టే తత్వం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.

హ్యాష్ ట్యాగ్ రిప్డ్ జీన్స్..
రిప్డ్ జీన్స్ అని గూగుల్ లో సెర్చే చేస్తే.. వాటికి సంబంధించిన ఫొటోలే ఇప్పటి వరకూ కనపడేవి. కానీ ఇప్పుడీ పేరుతో వెదికితే ముందుగా సీఎం రావత్ ఫొటో కనపడుతుంది, ఆ తర్వాత మహిళలు సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలు కనపడుతున్నాయి. అమ్మాయిలనుంచి అమ్మమ్మల వరకు అందరూ సీఎంని వ్యతిరేకిస్తూ చిరిగిన జీన్స్ తో ఫొటోలు అప్ లోడ్ చేస్తున్నారు. రిప్డ్ జీన్స్ ని ఆ విధంగా బాగా పాపులర్ చేశారు సీఎం రావత్.

ఆ చీవాట్లు వింటే తట్టుకోలేరు..
చిరిగిన జీన్స్ తో ఫొటోలు పెట్టడమే కాదు, కింద వాళ్లు పెడుతున్న మెసేజ్ లు చూస్తుంటే వస్త్రధారణపై సీఎం చేసిన కామెంట్లు మహిళా లోకాన్ని ఎంతగా బాధించాయో అర్థమవుతుంది. సోచ్ బద్ లో – దేశ్ బద్ లో (ముందు ఆలోచనలు మార్చుకోండి, తర్వాత దేశాన్ని మార్చండి) అంటూ బీజేపీని టార్గెట్ చేశారు మహిళలు. బీజేపీ మహా అయితే ఇంకో 50ఏళ్లపాటు ఉంటుందేమే, చిరిగిన జీన్స్ ఫ్యాషన్ శాశ్వతంగా ఉండిపోతుందని కూడా కౌంటర్లిస్తున్నారు. అమితాబ్ మనవరాలు నవేలీ నందా ఈ వివాదంపై తొలిసారిగా స్పందించారు. ఆ తర్వాత సాధారణ మహిళలు, సెలబ్రిటీలు.. అందరూ సీఎం రావత్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఆయనతో క్షమాపణ చెప్పించాలని బీజేపీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News