వరవరరావు విడుదల..

రెండున్నరేళ్లుగా విచారణ ఖైదీగా జైలు జీవితం గడుపుతున్న విప్లవ కవి వరవరరావు ఎట్టకేలకు విడుదలయ్యారు. ముంబైలోని నానావతి ఆస్పత్రి నుంచి అర్థరాత్రి ఆయన ఇంటికి వచ్చారని న్యాయవాది ఇందిరా జైసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భీమా కోరేగావ్ కేసులో ముంబైలోని తలోజా జైల్లో రెండున్నరేళ్లుగా ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. వరవరరావు వయసు 81 సంవత్సరాలు. వయసుతోపాటు వచ్చే అనారోగ్యాలతోపాటు, ఆయన కరోనాతో కూడా బాధపడ్డారు. ఇటీవల తీవ్ర అనారోగ్యం బారినపడటంతో బాంబే హైకోర్టు ఆదేశాల […]

Advertisement
Update:2021-03-07 05:06 IST

రెండున్నరేళ్లుగా విచారణ ఖైదీగా జైలు జీవితం గడుపుతున్న విప్లవ కవి వరవరరావు ఎట్టకేలకు విడుదలయ్యారు. ముంబైలోని నానావతి ఆస్పత్రి నుంచి అర్థరాత్రి ఆయన ఇంటికి వచ్చారని న్యాయవాది ఇందిరా జైసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భీమా కోరేగావ్ కేసులో ముంబైలోని తలోజా జైల్లో రెండున్నరేళ్లుగా ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు.

వరవరరావు వయసు 81 సంవత్సరాలు. వయసుతోపాటు వచ్చే అనారోగ్యాలతోపాటు, ఆయన కరోనాతో కూడా బాధపడ్డారు. ఇటీవల తీవ్ర అనారోగ్యం బారినపడటంతో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు నానావతి ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే ఆయనకు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తవడంతో అర్థరాత్రి ఆయనను విడుదల చేశారు. అయితే బెయిల్‌ ఇచ్చేటప్పుడు బాంబే హైకోర్టు పెట్టిన షరతుల మేరకు ఆయన ముంబై పరిధిలోనే ఉండాలి. దీంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

ఏంటీ కేసు..? ఎందుకీ అరెస్ట్..
మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్‌ అల్లర్లలో ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేశారన్న ఆరోపణలతో, మావోయిస్ట్ లకు ఆయుధాలు సరఫరా చేశారన్న కారణంగా వరవరరావును ఎన్ఐఏ అరెస్టు చేసింది. అనంతరం ఆయన్ను ముంబైలోని తలోజా జైల్లో విచారణ ఖైదీగా ఉంచారు. ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించినట్లు జైలు అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియా ద్వారా చాలామంది వరవరరావు విడుదలకు డిమాండ్ చేశారు.
1818లో భీమా కోరెగావ్‌ లో పేష్వాల నేతృత్వంలో మరాఠాలకు, ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మహర్ సైనికులు బ్రిటిష్ వారి తరపున పోరాడారు. అందులో మరణించిన మహర్ సైనికులకు నివాళిగా భీమా కోరెగావ్‌ లో ఒక విజయ స్తంభాన్ని నిలిపారు. దీనిపై ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన మహర్ సైనికుల పేర్లను చెక్కారు. ప్రతీ ఏడాదీ జనవరి 1నాడు వేలమంది దళితులు ఇక్కడ గుమికూడి వీర మరణం పొందిన మహర్ సైనికులకు గౌరవ వందనాలు అర్పిస్తారు. ఆ క్రమంలో భీమా కోరెగావ్ 200 వార్షికోత్సవ సందర్భంగా 2018 జనవరి 1న కూడా భీమా కోరెగావ్ లో ప్రదర్శన జరిగింది. అయితే ఆ వెంటనే అల్లర్లు చెలరేగాయి. ప్రదర్శనకారులపై కొంతమంది రాళ్లు విసిరారు. వాహనాలు, దుకాణాలు దెబ్బతిన్నాయి. అల్లర్లలో ఒకరు మరణించారు. దీనీపై పింప్రి పోలీస్ స్టేషన్లో హిందుత్వ మతవాదులు శంభాజీ భీడే, మిలింద్ ఏక్బోటేతో సహా మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. బాధితులుగా ఉన్న దళితులు, దళిత మేధావులపైనే కేసులు నమోదయ్యాయి. ఎల్గార్ పరిషత్, కబీర్ కళావేదిక దళితుల్ని సంఘటితం చేసే క్రమంలో మావోయిస్ట్ లతో చేతులు కలిపిందని, దేశంలో అల్లర్లు చెలరేగేందుకు ప్రణాళిక రచించారని తేల్చారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర జరిగిందనే కోణం కూడా వెలుగు చూసింది. కేసు విచారణ ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లిన తర్వాత అరెస్ట్ ల పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో దొరికిన లేఖల్లో వరవరరావు పేరుకూడా ఉండటంతో ఆయన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారణ ఖైదీగా జైలుకి తరలించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆయన జైలులోనే మగ్గిపోయారు. ఆయన ఆరోగ్యం బాగోలేదని, విడుదల చేయాలని, భార్య, బిడ్డలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. చివరకు బాంబై హైకోర్టు జోక్యంతో వరవరరావుకి బెయిలు మంజూరై, ఆయన బయటకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News