ఉక్కు ఉద్యమం " ఎవరెటు..?

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కీలక అడుగులు వేస్తున్న సమయాన.. ఉత్తరాంధ్ర కేంద్రంగా అలజడి మొదలైంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ తమ తమ విధానాల మేరకు, రాజకీయ అవసరాల మేరకు ఈ విషయంపై స్పందిస్తున్నాయి. ఆలోచన ధోరణిలో అధికారపక్షం.. విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాలేదని, వచ్చాకే ముఖ్యమంత్రిని కలిసి నిర్ణయం తీసుకుంటామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. విశాఖ ఉక్కు భావోద్వేగాలతో కూడుకున్న అంశమని, దీనిపై పార్టీలో చర్చించి […]

Advertisement
Update:2021-02-06 06:17 IST

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కీలక అడుగులు వేస్తున్న సమయాన.. ఉత్తరాంధ్ర కేంద్రంగా అలజడి మొదలైంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ తమ తమ విధానాల మేరకు, రాజకీయ అవసరాల మేరకు ఈ విషయంపై స్పందిస్తున్నాయి.

ఆలోచన ధోరణిలో అధికారపక్షం..
విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాలేదని, వచ్చాకే ముఖ్యమంత్రిని కలిసి నిర్ణయం తీసుకుంటామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. విశాఖ ఉక్కు భావోద్వేగాలతో కూడుకున్న అంశమని, దీనిపై పార్టీలో చర్చించి తమ విధానాన్ని తెలియజేస్తామని మంత్రులు చెబుతున్నారు. అటు సీఎం జగన్ కూడా ఇంతవరకూ ఈ విషయంపై స్పందించలేదు. అయితే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం తామంతా విశాఖ ఉక్కు కార్మికులకు అండగా ఉంటామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, రాజీనామాలకైనా సిద్ధపడతామని భరోసా ఇచ్చారు.

రెచ్చిపోతున్న ప్రతిపక్షం..
సమస్య దొరకాలే కానీ, దాన్ని సాగదీసి సాగదీసి.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ధోరణిలో ఉంది ప్రతిపక్ష టీడీపీ. ఆలయాల ఘటన ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంతవరకు టీడీపీకి మంచి పాయింట్ దొరకలేదు. స్థానిక ఎన్నికలు జరిగినన్ని రోజులు విమర్శలు-ప్రతి వమర్శలు ఎలాగూ ఉండనే ఉంటాయి కాబట్టి, విశాఖ ఉక్కుని ఇప్పుడు టీడీపీ హైజాక్ చేసింది. ఉక్కు కర్మాగారం విషయంలో జగన్ సైలెంట్ గా ఉండటానికి కారణం.. కేంద్రంతో లాలూచీ పడటమేనని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు. ప్రైవేటుపరం చేస్తామంటున్న కేంద్రాన్ని పల్లెత్తు మాట అనని టీడీపీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించే ప్రయత్నాలలో బిజీగా మారిపోయింది.

బీజేపీ మౌనం..
బీజేపీ పూర్తిగా ఈ వ్యవహారంపై మౌనాన్ని ఆశ్రయించింది. ఎంపీ సుజనా చౌదరి మాత్రం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం చాలా పాతదని, ఇప్పుడు పట్టాలెక్కుతోందని అన్నారు. దీనివల్ల ఏపీకి, కర్మాగారానికి కూడా లాభమంటూ జోస్యం చెప్పారు. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఇంకా ఇలాంటి సర్దుబాటు వ్యాఖ్యలకు కూడా సాహసం చేయడంలేదు.

ఇరుకున పడ్డ జనసేన..
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిర్ద్వందంగా వ్యతిరేకించడం అంటే జనసేన, బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్టే. అందుకే ఆచితూచి స్పందిస్తున్నారు జనసేన నేతలు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని తాము సమర్థించడంలేదంటూనే.. ఇదే విషయమై పవన్ కల్యాణ్ త్వరలో ప్రధాని మోదీని కలసి ఓ మెమొరాండం ఇస్తారని ప్రెస్ నోట్ విడుదల చేశారు నాదెండ్ల మనోహర్. పనిలో పనిగా నాటి మన్మోహన్ ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాల్లో భాగంగానే ఇప్పుడీ దురవస్థ ఏర్పడిందని నెపం కాంగ్రెస్ పైకి నెట్టే ప్రయత్నం చేశారు మనోహర్.

ఇక వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఈ రెండు పార్టీలు భాగస్వాములయ్యాయి. మొత్తమ్మీద పంచాయతీ ఎన్నికలతో సందడి మారిన ఏపీ రాజకీయాల్లో.. విశాఖ ఉక్కు మరింత కాక రేపుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో నేతలు రెచ్చిపోతున్నారు.

Tags:    
Advertisement

Similar News