శశికళ రాక.. తమిళనాట కాక!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఈ నెల 27న జైలు నుంచి విడుదల అవుతుండటంతో రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మూడున్నర సంవత్సరాల కిందట జయ మరణించగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి శశికళ ప్రయత్నం చేశారు. ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో శశికళ అనూహ్యంగా అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యారు. జైలుకు వెళ్లే ముందు నూతన […]

Advertisement
Update:2021-01-19 13:18 IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఈ నెల 27న జైలు నుంచి విడుదల అవుతుండటంతో రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మూడున్నర సంవత్సరాల కిందట జయ మరణించగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి శశికళ ప్రయత్నం చేశారు. ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో శశికళ అనూహ్యంగా అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యారు.

జైలుకు వెళ్లే ముందు నూతన ముఖ్యమంత్రిగా పళని స్వామిని నియమించారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పళని స్వామి శశికళకు దూరం అయ్యారు. పన్నీర్ సెల్వం వర్గాన్ని కలుపుకొని బీజేపీ అండతో అన్నా డీఎంకే తరపున పూర్తి కాలం పాలన సాగించారు.

కాగా ఈ సారి అన్నా డీఎంకే బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు శశికళ జైలు నుంచి విడుదల అవుతుండటంతో అన్నా డీఎంకే పార్టీ చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

అన్నా డీఎంకేలో శశికళ సుమారు 30 ఏళ్ల పాటు జయలలిత వెన్నంటి ఉన్నారు. దీంతో ఆమెకు పార్టీపై పూర్తి పట్టు ఉంది. అన్నా డీఎంకేలో ఇప్పుడు సీనియర్ నాయకులుగా ఉన్న ఎంతోమంది ఒకప్పుడు శశికళ కనుసన్నల్లో పనిచేసిన వారే. ఇప్పుడు జైలు నుంచి శశికళ విడుదలైతే అన్నా డీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆమె వెంట నడిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఈ విషయాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

శశికళ జైలునుంచి విడుదల అయితే అన్నాడీఎంకే పార్టీని తిరిగి తన వశం చేసు కోవడానికి ప్రయత్నిస్తుందని అంటున్నారు.అలా కుదరకపోయినా తన మేనల్లుడు దినకరన్ స్థాపించిన అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి ఎన్నికల ప్రచారం సాగించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఆమె అలా చేసే పక్షంలో అన్నాడీఎంకేకు చెందిన పలువురు సీనియర్ నాయకులు శశికళ పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు. అన్నా డీఎంకేలో ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కన్నా శశికళ అన్ని విధాలుగా బలమైన నేత కావడం, ఆర్థిక వనరులకు కూడా ఇబ్బంది లేకపోవడంతో ఎన్నికల్లో శశికళ తన మార్కు రాజకీయం చూపే అవకాశం ఉందంటున్నారు.

కాగా ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే బీజేపీతో కలసి పోటీ చేస్తోంది. బీజేపీ తమకు 40 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని పట్టు పడుతుండడంతో ఇందుకు అన్నాడీఎంకే ససేమిరా అంటోంది. సీట్ల తఖరారు తేల్చుకునేందుకు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

అయితే సీట్ల కేటాయింపు పై చర్చించడానికే ఎడప్పాడి ఢిల్లీకి వెళ్లారని చెబుతున్నప్పటికీ శశికళ విడుదల అవుతుండటంతో తలెత్తే పరిణామాలపై చర్చించడానికే ఆయన ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. బీజేపీ అధిష్టానం పెద్దలు కూడా శశికళ బయటకు వస్తే ఎటువంటి ప్రభావం పడుతుందనే విషయమై ఆరాతీస్తున్నట్లు సమాచారం. అన్నా డీఎంకే, శశికళ పార్టీ ఏకమై ఎన్నికలకు వెళ్తే మేలు జరుగుతుందని, లేకపోతే అన్నా డీఎంకే ఓట్లు చీలి డీఎంకేకు లాభం చేకూరుతుందని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News