ప్రచారం బాగుంది.. ప్రభావం ఎంతుంటుందో..?

కరోనా వ్యాక్సినేషన్లో భారత్ ప్రపంచ రికార్డు సాధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. టీకా పంపిణీ ప్రారంభమైన మొదటి రోజే దేశంలో 2,07,229 మందికి టీకా వేశారని, ఇది రికార్డు అని చెబుతోంది. అయితే టీకా పంపిణీలోనే కాదు, ప్రచారంలో కూడా భారత్ రికార్డులు బద్దలు కొట్టిందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. టీకా పంపిణీ కార్యక్రమాన్ని, రాజకీయ ప్రచారంగా వాడుకుంటున్నారని మండిపడుతున్నాయి. 3కోట్ల మందికి మాత్రమే కేంద్రం ఉచిత టీకా ఇస్తానంటే.. దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారికి, […]

Advertisement
Update:2021-01-18 03:50 IST

కరోనా వ్యాక్సినేషన్లో భారత్ ప్రపంచ రికార్డు సాధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. టీకా పంపిణీ ప్రారంభమైన మొదటి రోజే దేశంలో 2,07,229 మందికి టీకా వేశారని, ఇది రికార్డు అని చెబుతోంది. అయితే టీకా పంపిణీలోనే కాదు, ప్రచారంలో కూడా భారత్ రికార్డులు బద్దలు కొట్టిందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. టీకా పంపిణీ కార్యక్రమాన్ని, రాజకీయ ప్రచారంగా వాడుకుంటున్నారని మండిపడుతున్నాయి. 3కోట్ల మందికి మాత్రమే కేంద్రం ఉచిత టీకా ఇస్తానంటే.. దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారికి, ఇప్పటికీ రేషన్ సరకులతోనే జీవనం సాగిస్తున్న 81.35 కోట్లమంది పేదలకు ఎవరు ఇస్తారంటూ మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు.

ప్రతిపక్షాల వ్యవహారం పక్కనపెడితే.. వ్యాక్సినేషన్ విషయంలో ప్రచారం మాత్రం భారీగా జరిగిందనే విషయం వాస్తవం. రాజకీయ నాయకులు వ్యాక్సిన్ వేసుకునే సాహసం చేయలేదు కానీ, ప్రారంభోత్సవాలతో హడావిడి బాగానే చేశారు. అత్యవసర అనుమతి పేరుతో తీసుకొచ్చిన టీకాల ప్రభావం ఏమేరకు ఉంటుందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మూడో దశ ప్రయోగాలు పూర్తికాని కొవాక్సిన్ మాకొద్దు అంటూ కొంతమంది వైద్య నిపుణులే వెనకడుగేయడం కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఈ వ్యవహారాన్ని వ్యూహాత్మకంగా సద్దుమణిగేలా చేశారు కేంద్ర పెద్దలు.

కొవిషీల్డ్ అయినా కొవాక్సిన్ అయినా రెండు డోసులు తీసుకోవాలనేది నిబంధన. అసలు ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ కూడా ఇలా డోసేజ్ రూపంలో ఇచ్చారన్న ఆధారాలు లేవు. పోనీ వ్యాక్సిన్ వేసుకున్నవారికి భయం లేదా అంటే.. వారు కూడా మాస్క్ వేసుకుని తిరగాల్సిందేనని మెలిక పెడుతున్నారు. మద్యం తాగితే ప్రభావం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ నిజమేనా? లేక టీకా విఫలమైతే చెప్పుకోడానికి ముందస్తు కారణాలు వెదుకుతున్నారా అనేది కూడా ఓ అనుమానం.

మా వ్యాక్సిన్ 200 రోజులు పనిచేస్తుందని ఓ కంపెనీ, మా వ్యాక్సిన్ ఏడాది ప్రభావం చూపుతుందని మరో కంపెనీ.. ఇలా రకరకాల వార్తలు వెలువడుతున్న వేళ, అసలు భారత్ లో పంపిణీ అవుతున్న వ్యాక్సిన్ ప్రభావం ఏమేరకు ఉంటుందో నిర్థారణ కావాల్సి ఉంది. రాబోయే రోజుల్లో భారత్ లో కరోనా కేసుల సంఖ్య, టీకా వేసుకున్నవారిలో పెరిగిన రోగ నిరోధక శక్తి ఈ విషయాలను తేల్చాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ కి ముందే మన దేశంలో కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో.. టీకా ప్రభావం ఎంత అనేది తేలడం కష్టమేనంటున్నారు నిపుణులు.

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా టీకాతో వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా భయాందోళనలు కలిగిస్తున్నాయి. అయితే విదేశాల్లో దుష్పరిణామాలు చూపించిన టీకాలు భారత్ లో వినియోగించకపోవడం ఒక్కటే కొసమెరుపు. ఇక భారత్ లో తొలి రోజు 2,07,229 మంది వ్యాక్సిన్‌ తీసుకోగా, రెండో రోజు 17,072 మందికి వ్యాక్సిన్‌ అందించారు. రెండు రోజుల్లో మొత్తం 2,24,301 మందికి వ్యాక్సిన్‌ అందించగా వారిలో 447 మందికి దుష్ర్పభావాలు కనిపించాయని కేంద్రంప ప్రకటించింది. అయితే అవి కేవలం సాధారణమైన జ్వరం, తలనొప్పి, అలసట వంటివి మాత్రమేనని స్పష్టంచేసింది. వీరిలో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు.

Tags:    
Advertisement

Similar News