కొవాక్సిన్ కు కొత్త ట్విస్ట్.. అంగీకార పత్రం మస్ట్
భారత్ లో రెండు టీకాల అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. వీటిలో ఒకటి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్. దీన్ని పుణెలోని సీరం ఇన్ స్టిట్యూట్ తయారు చేసింది. రెండోది భారత్ బయోటెక్ తయారీ కొవాక్సిన్. అయితే కొవాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉండగానే దానికి ప్రభుత్వం అత్యవసర అనుమతినివ్వడం, దానిపై రాజకీయ దుమారం చెలరేగడం అందరికీ తెలిసిందే. వీటన్నిటినీ పట్టించుకోకుండా కొవిషీల్డ్ తోపాటే, కొవాక్సిన్ టీకాల సరఫరా కూడా […]
భారత్ లో రెండు టీకాల అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. వీటిలో ఒకటి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్. దీన్ని పుణెలోని సీరం ఇన్ స్టిట్యూట్ తయారు చేసింది. రెండోది భారత్ బయోటెక్ తయారీ కొవాక్సిన్. అయితే కొవాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉండగానే దానికి ప్రభుత్వం అత్యవసర అనుమతినివ్వడం, దానిపై రాజకీయ దుమారం చెలరేగడం అందరికీ తెలిసిందే. వీటన్నిటినీ పట్టించుకోకుండా కొవిషీల్డ్ తోపాటే, కొవాక్సిన్ టీకాల సరఫరా కూడా మొదలైంది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. కొవాక్సిన్ మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకపోవడంతో.. దాన్ని తీసుకుంటున్న లబ్ధిదారులనుంచి అంగీకార పత్రం తీసుకోబోతున్నారు అధికారులు. కొవిషీల్డ్ టీకా అన్ని ప్రయోగ దశలు దాటుకుని వచ్చింది కాబట్టి దానికి ఆ పత్రం అవసరం లేదు. కేవలం కొవాక్సిన్ తీసుకుంటున్న వారి దగ్గరనుంచే దీన్ని అడుగుతారని తెలుస్తోంది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేయడంతో కలకలం మొదలైంది. కేంద్రం ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అంగీకార పత్రం అనే అంశంపై చర్చ జరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే ఆ అంగీకార పత్రంలో ఎలాంటి అంశాలుంటాయనే విషయాలను మాత్రం వారు బైటపెట్టలేదు.
ఈనెల 16నుంచి అధికారికంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలవుతున్నా.. ఎవరెవరికి ఏ టీకాను ఇస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. తొలి విడత కొవిషీల్డ్ టీకా ఎక్కువ పరిమాణంలో సరఫరా కావడంతో ముందుగా దాన్ని మాత్రమే పంపిణీ చేయాలని చూస్తున్నారు అధికారులు. అంగీకార పత్రం అనే అంశంపై క్లారిటీ వస్తేనే కొవాక్సిన్ కిట్ ఓపెన్ చేస్తారు. అయితే ఇలా సంతకాలు తీసుకుంటున్నారనే విషయం తెలిస్తే కొవాక్సిన్ వేయించుకోడానికి ఎవరు మొగ్గు చూపుతారనేదే ప్రశ్నార్థకం. ప్రయోగాలు పూర్తి కాకముందే టీకా పంపిణీకి అనుమతినివ్వడం తొందరపాటు చర్య అయితే.. దాన్ని వేయించుకునేవారి వద్ద అంగీకార పత్రాలను అడగడం మరింత ఆందోళన కలిగించే అంశం.
తెలంగాణలో పారిశుధ్య కార్మికుడికి తొలి టీకా..
తెలంగాణలో తొలి టీకాను గాంధీ ఆసుపత్రిలోని ఓ పారిశుధ్య కార్మికునికి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 139 టీకా కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే ప్రజా ప్రతినిధులు మాత్రం టీకా తీసుకోరు. కేవలం ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి మాత్రమే తొలి దశ టీకాలు ఇస్తారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారందరికీ కోవిన్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో సర్టిఫికెట్లు పంపిస్తారు. మొదటి డోస్ టీకా వేసుకున్నాక రెండో డోస్ ఎప్పుడు, ఎక్కడ వేసుకోవాలో లబ్దిదారుడి మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. వ్యాక్సినేషన్ తర్వాత ఎలాంటి సమస్యలు, సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్రస్థాయిలో కొవిడ్ వ్యాక్సిన్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.