ఎన్నికల సంఘానికి ఎదురుదెబ్బ

ఏపీలో స్థానిక సమరానికి బ్రేక్ పడింది. పంచాయతీ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ కి మధ్య తలెత్తిన వివాదానికి హైకోర్టు తెరదించింది. ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ని ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఏకపక్షంగా షెడ్యూల్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక […]

Advertisement
Update:2021-01-11 15:15 IST

ఏపీలో స్థానిక సమరానికి బ్రేక్ పడింది. పంచాయతీ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ కి మధ్య తలెత్తిన వివాదానికి హైకోర్టు తెరదించింది. ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ని ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఏకపక్షంగా షెడ్యూల్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. రెండో దశ కరోనా విజృంభణ, వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం తరుపు న్యాయవాదులు విచారణ సందర్భంగా వాదించారు. ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఈ నెల 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుండడంతో ఎన్నికలు అందుకు ఆటంకంగా మారుతాయని కోర్టు భావించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల షెడ్యూల్ ని నిలిపివేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్ విషయంలో ఎన్నికల సంఘం సహేతుకంగా లేదని అభిప్రాయపడింది.

మూడు రోజుల క్రితం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 వరకు నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా.. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. అటు ఎన్నికల నిర్వహణలో పాల్గొనాల్సిన ఉద్యోగ సంఘాలు సైతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల్లో పాల్గొనబోమంటూ తేల్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ని నిలివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రభుత్వానికి ఊరట లభించింది. కాగా.. ఎన్నికల విషయంలో ఎలక్షన్ కమిషన్ మెట్టు దిగడానికి సిద్ధంగా లేదు. హైకోర్టు తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.

మరోవైపు పంచాయితీ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలోనూ కొత్త వివాదానికి కారణమయ్యాయి. ఎలక్షన్ కమిషనర్ జాయింట్ డైరెక్టర్‌ జీవీ సాయి ప్రసాద్‌ నెల రోజుల పాటు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడాన్ని కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సీరియస్ గా తీసుకున్నారు. ఇతర సభ్యులను ప్రభావితం చేసేలా వ్యవహరించాడనే కారణంగా అతడిని విధుల నుంచి తప్పించారు. మొత్తానికి తన పంతం నెగ్గించుకునేందుకు నిమ్మగడ్డ ప్రయత్నిస్తుండగా, అన్ని వైపుల నుంచీ అతడికి ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. దీంతో అతడిలో అసహనం రెట్టించినట్లు కనిపిస్తోంది. తాజా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Tags:    
Advertisement

Similar News