ఫేస్ బుక్ సందేశం... మహిళల రక్షణకు వినూత్న ప్రయత్నం !

మహిళల రక్షణకు ఎన్ని చట్టాలున్నా, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు. అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్, హథ్రాస్ లో జరిగిన ఘటన మరో సారి మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ క్రమంలో నాగాల్యాండ్ లోని దిమాపూర్ అనే ప్రాంతంలో ఫేస్ బుక్ వేదికగా ఒక సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అనీబా తౌ అనే వ్యక్తి ఫేస్ బుక్ పోస్ట్ తో ఈ మహిళా […]

Advertisement
Update:2020-10-21 03:17 IST

మహిళల రక్షణకు ఎన్ని చట్టాలున్నా, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు. అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్, హథ్రాస్ లో జరిగిన ఘటన మరో సారి మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.

ఈ క్రమంలో నాగాల్యాండ్ లోని దిమాపూర్ అనే ప్రాంతంలో ఫేస్ బుక్ వేదికగా ఒక సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అనీబా తౌ అనే వ్యక్తి ఫేస్ బుక్ పోస్ట్ తో ఈ మహిళా రక్షణ ప్రయత్నం మొదలైంది. రాత్రివేళ బయటకు వెళ్లాల్సిన అవసరం ఉన్న మహిళలకు, లేదా బయట ఉండి ఇంటికి చేరాల్సినవారికి సురక్షితమైన వాహన సదుపాయం కల్పించాలన్నది అతని ఆశయం. అందుకు అతను వ్యక్తిగతంగా ముందుకొచ్చాడు.

పెద్ద వయసులో ఉన్న స్త్రీలైనా, యువతులైనా ఎవరైనా సరే బయటకు వెళ్లేందుకు, లేక ఇంటికి చేరేందుకు వాహన సదుపాయం లేనప్పుడు, లేదా ఎక్కడైనా తాము సురక్షితంగా లేము అనే భయం కలిగినప్పుడు, ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు… తనకు కాల్ చేయాలని లేదా అత్యవసర సందేశం పంపినా తాను వెంటనే వారికి సహాయం అందిస్తానని, ఇరవైనాలుగు గంటలు అందుకు సిద్ధంగా ఉంటానని అతను తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నాడు. తన ఫోన్ నెంబర్లు ఇచ్చాడు.

ఇలాంటి సహాయ సహకారాలు అందించేందుకు ఎక్కువమంది ముందుకొస్తే… దేశంలోని ఏ మూలనుండైనా మహిళలకు అండగా నిలవగల వాలంటీర్లు దొరుకుతారని అనీబా అభిప్రాయపడ్డాడు. ఆ విధంగా అత్యాచారాలు లేని భారతదేశాన్ని, సురక్షితమైన ఇండియాని చూడాలన్న కలని మనం నిజం చేసుకోవచ్చని అతను తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇతను కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. మహిళలకు అవసరమైన సహాయం అందించడంలో అయ్యే ఖర్చుని తానే భరిస్తానని, ఒకవేళ తనకు ఆ సమయంలో రావటం కుదరకపోతే.. తన స్నేహితులను ఎవరినైనా పంపుతానని కూడా అనీబా తన పోస్టులో వెల్లడించాడు.

అతని పోస్టు వైరల్ గా మారటంతో మరింత మంది అదే విధంగా తాము కూడా మహిళా రక్షణకు ఎప్పుడైనా సిద్ధమేనంటూ తమ వివరాలను, ఫోన్ నెంబర్లను ఫేస్ బుక్ ద్వారా వెల్లడిస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక చైన్ లా మారిందని… దిమాపూర్ లోని చాలామంది ఫేస్ బుక్ ద్వారా తమ సంసిద్ధతను తెలియజేస్తున్నారని అనీబా తెలిపాడు.

ఇతనికి రెండేళ్లు, నాలుగేళ్లు వయసున్న ఇద్దరు ఆడపిల్లలున్నారు. భార్య హోం మేకర్. తన పిల్లలు పెద్దయ్యే సరికి ఒక చక్కని సురక్షితమైన సమాజం వారి చుట్టూ ఉండాలని అనీబా కోరుకుంటున్నాడు. తమ ప్రాంతంలో పరిస్థితి మరీ అంత దారుణంగా లేకపోయినా… స్త్రీల రక్షణ విషయంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అతను భావిస్తున్నాడు.

Advertisement

Similar News